Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం సువిశాలమైన భూభాగం కలిగి ఉన్న వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభా సుమారు 70శాతం వరకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే జీవనం సాగిస్తున్నది. ఈ దేశంలోని అన్నదాతలు 80శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులే. వీరి సేధ్యపు నేల ఐదుఎకరాల లోపే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జూన్-జులై నెలల్లోనే రైతులు సాగుకు పూనుకుంటారు. వ్యవసాయంలో దిగుబడులు అధికంగా రావడానికి ప్రధానంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కీలకపాత్ర వహిస్తాయి. శాస్త్ర సాంకేతికంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వలన నూతన వంగడాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తయారీలోకి వచ్చాయి. వీటిని ఉత్పత్తి చేయడంలో ప్రయివేటు సంస్థలు ప్రవేశించాక ధనార్జనే ధ్యేయంగా మారింది. రాష్ట్రంలో దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ వ్యాపార సంస్థలు, నకిలీ(కల్తీ) విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తయారు చేసి ఈ సీజన్లో అమ్ముకుంటూ ఆరుగాలం కష్టం చేసే అన్నదాతల నోట మట్టికొడుతున్నాయి. ఫలితంగా అధిక దిగుబడి కాదు కదా! పెట్టిన పెట్టుబడి రాకపోగా రేయింబవళ్లు కుటుంబం మొత్తం చేసిన శ్రమంతా ''బూడిదలో పోసిన పన్నీరుగా'' మారుతున్నది. దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని ఈ నకిలీ దందా కొనసాగుతుంది. నియంత్రించే యంత్రాంగ కొరతకు తోడు లంచాలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్ల మూలంగా కల్తీ వ్యాపారం ''మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా'' కొనసాగుతున్నది. ఇలా ప్రతీ ఏటా కల్తీ కంపెనీల కబంధహాస్తాల్లో చిక్కి అన్నదాతలు నష్టపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం కేవలం ఆర్భాటపు ప్రకటనలతో కాలం వెల్లదీస్తున్నాయి.
సంక్షోభానికి బీజం: గత మూడు దశాబ్ధాల నాడు సరళీకృత, ఆర్థిక సంస్కరణ విధానాలు, గ్లోబలైజేషన్ వ్యాపార విధానాలతో ప్రపంచంలోని చాలా వ్యాపార వాణిజ్య సంస్థలు మన దేశంలోకి ప్రవేశించాయి. పెట్టుబడిదారీ, కార్పొరేటు వ్యాపారం లో లాభార్జనే ధ్యేయంగా వేరే దేశాల్లో నిషేదించిన మందులను మనదేశంలో విక్రయిస్తున్నాయి. ఆ విషపూరిత రసాయనాల వల్ల భూసారం క్షీణించి పోతోంది. భూమి కలుషితమైపోతోంది. వాతావరణం, పర్యావరణం విషపూరితమై పోతోంది. ఇలా అన్నదాతల నోట మట్టికొడుతూ, నేలమ్మ కడుపులో విషం నింపుతున్నారు. ప్రభుత్వాలు ప్రతి ఏటా ఈ మోసాలను చూస్తూనే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. అందువల్ల వారి వ్యాపారాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఇలా నాసిరకం (నకిలీ) విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మనదేశంలో సుమారు 30శాతం ఉన్నట్లు ఓ అంచనాలో తేలింది. పంటలకు ఆశించిన తెగుళ్లను నాశనం చేస్తామంటూ, అధిక దిగుబడిని ఇస్తాయి అంటూ నకిలీ పురుగు మందులు (బయో పెస్టిసైడ్స్) జీవన ఎరువులు (బయో ఫెర్టిలైజర్స్) రైతులకు అంటగడుతున్నారు. వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఒక ప్రయోగశాల కూడా లేనట్లు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3,300 కంపెనీల పేర్లతో పలురకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అనేక రకాల బ్రాండ్లతో అమ్ముతున్నారు. వీటిలో చాలా వాటికి తయారీ ప్లాంట్లు, పరిశోధన కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. వీటిలో 355 కంపెనీలు మాత్రమే రిజిష్ట్రేషన్ (నమోదు)కు దరఖాస్తు చేశాయి. ఈ కంపెనీలు గత మూడేండ్లలో ఎన్ని మందులు అమ్మాయి? ఏయే ఉత్పత్తి ఎంత తయారు చేశాయి? అనే వివరాలు కూడా ఇవ్వడం లేదు. ఇస్తే జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అంటే అనేక కంపెనీలు జీఎస్టీ కట్టడం లేదు. వాటికి ఉండాల్సిన అన్ని అర్హతలు సక్రమంగా లేవని తెలుస్తుంది. ఇలాంటి వాటిలో తయారైన మందుల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు మార్కెట్లో విచ్ఛల విడిగా సాగుతున్న నాసిరకం (నకిలీ) ఎరువులు, పురగు మందులు, విత్తనాల అమ్మకా లపై కఠిన చర్యలు తీసుకొని కట్టడి చేయాలి. ఇలా నిర్జీవ ఎరువులను, విత్తనాలను, పురుగు మందులను అమ్మే కంపెనీలపై కేసులు పెడుతూ వారి విష కౌగిలినుండి అన్నదాతలను రక్షించాలి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం : రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వివిధ రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై కూడా పడింది. ఎరువుల ధరలు అనూహ్యంగా పెరగటంతో పాటు తీవ్రమైన కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన పోటాష్, నత్రజని వంటి పదార్థాల కోసం మన దేశం ఉక్రెయిన్, రష్యా, బెలారస్ దేశాలపై ఆధారపడటమే ఇందుకు కారణం. అమ్మోనియా, నైట్రోజన్, నైట్రేట్స్, ఫాస్ఫెట్స్, పొటాష్, సల్పేట్ ధరలు 30శాతానికి పైగా పెరిగాయి. ఈ పరిణామంతో దేశీయ కంపెనీలు కూడా పెంచడం ఖాయం. ఇప్పటికే ఎరువుల రిటైల్ ధరలు పెరిగాయి. పొటాష్ ధర మొన్నటి వరకు బస్తా రూ.1050 ఉండగా, ఇప్పుడు రూ.1700కు ఎగబాకింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు 50 నుంచి 70శాతం వరకు పెరిగాయి. బస్తా కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1400 నుంచి 1900గా చెబుతున్నారు. మున్ముందు సరఫరా తగ్గుతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ యుద్ధం ఎలా ఉన్నా ఏడాది పాటు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందనిపిస్తుంది. యుద్ధాన్ని ఒక సాకుగా చూపి కృత్రిమ కొరత సృష్టించి కంపెనీలు ఇబ్బందుల పాలు చేస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వాల కర్తవ్యం : జూన్లో వానాకాలం (ఖరీఫ్) పంటల సాగుబడి ప్రారంభం కానుంది. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్నదాతల పెట్టుబడి వ్యయంపై అధిక భారం పడకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి. అసలే ఆరుగాలం కష్టపడినా లాభంలేదని నిరాశలో ఉన్న అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వేళ... ''మూల్గే నక్కపై తాటిపండు''లా ఎరువుల ధరలు పెరగడం, కల్తీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దాడిచేస్తున్నాయి. వీటికి తోడు అతివృష్టి, అనావృష్టులు వెంటాడుతున్నాయి. పాలకులు ధరలను సరళతరం చేస్తూ, కొరత లేకుండా నిల్వ చేసుకుని సకాలంలో అందించాలి. డెబ్బై అయిదేండ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్నదాతల ఆత్మహత్యల దయనీయ స్థితిని నివారిస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ, రాష్ట్రాల పాలకులపై ఉన్నదని మరువరాదు. అన్నదాతల భద్రతంటే? భారతజాతి ఆహార భద్రత అనేది కాదనలేని నిజం. అన్నదాతలు సుఖంగా ఉంటేనే దేశమంతా సుభిక్షంగా ఉన్నట్లు. అందువల్ల వ్యవ''సాయం'' దండుగ కాదు, పండుగ అనుకునేలా వ్యవసాయ రం(రైతాం)గానికి పాలకులు దన్నుగా నిలవాలి.
రైతులు విత్తనం నాటిన నాటినుండి పంట అమ్ముకుని డబ్బులు చేతికి వచ్చే వరకు ఏ దశలోనూ దోపిడీకి గురికాకుండా చూడాలి. రుణ మాఫీతోపాటు పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు, ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు, పరికరాలు అందించాలి. పండించిన పంటకు ''గిట్టుబాటు ధరను'' కల్పించాలి. సాగునీరు, ఉచిత కరెంట్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలి. జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతు ఆదాయం రోజు (దినసరి) కూలి కన్నా తక్కువ (రూ.224) అని తేలింది. ఈ దుర్భర స్థితిని నిర్మూలించాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించరాదు.
- మేకిరి దామోదర్
సెల్:9573666650