Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంరక్షక కార్యకలాపాలతో పాటుగా సృజనాత్మక పరిశ్రమలు, కొన్ని ప్రాధాన్యత గల భవిష్యత్తు ఆర్థిక రంగాల్లో ముఖ్యమైనవిగా ఉద్భవించబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డిజైన్, ఫ్యాషన్, ఫిల్మ్, వీడియోలు, ఫొటోగ్రఫీ, సంగీతం, కళల ప్రదర్శన, ప్రచురణలు, పరిశోధనలు, అభివృద్ధి, సాఫ్ట్ వేర్, కంప్యూటర్ గేమ్స్, ఎలక్ట్రానిక్ ప్రచురణలు, టీవీ, రేడియోలు అన్నీ ఈ సృజనాత్మక పరిశ్రమల కిందకు వస్తాయి.
సాంస్కృతికంగా, వాణిజ్య పరంగా ఈ కార్యకలాపాలు ఏ విధంగా విలువైనవో 2019 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్సీటీఏడీ) నివేదికలో గుర్తించారు. అవి మానవ, సామాజిక శ్రేయస్సు ఆరోగ్యం, సంతోషాన్ని మెరుగుపరుస్తాయి. మానవ ఊహ వ్యక్తీకరణల ద్వారా అవి జీవితాలకు అర్థాన్ని, ఆనందాన్ని, సంపూర్ణతను తెస్తాయి. అవి, వాటి ఉన్నతమైన రూపాల్లో సామాజిక ఐక్యతను, మానవ ఉల్లాసాన్ని ప్రోత్సాహించే, ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక విలువలను వ్యాప్తి చేస్తాయి.
వాటికి ఉపాధిని కల్పించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఆర్థికాభివృద్ధికీ అవి కీలకమైనవి. ఇతర రంగాలలో వలే కాకుండా, సాంకేతిక పరమైన మార్పులు సృజనాత్మక పరిశ్రమలపై సానుకూలమైన ప్రభావాలు చూపుతాయి. అంటే కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ఉన్న ఉద్యోగాలను తగ్గించకుండా ఉండడం లాంటివి. సమకాలీన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సాంస్కృతికంగా, సాంకేతికంగా, వ్యాపారపరంగా, నూతన ఆవిష్కరణలలో అభివృద్ధిని సాధిస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తులో ఒక బలమైన వనరుగా ఉండవచ్చు. ఈ కార్యకలాపాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు సరిపోయే విధంగా ఉంటాయి. సృజనాత్మక వస్తువులు, సేవలలో సరిహద్దు వాణిజ్యం, కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా చాలా ఉన్నతంగానే ఉంది.
ఆసక్తికరంగా, ఈ పరిశ్రమల విస్తరణకు అనుకూలంగా ఉండే దేశాల్లో భారతదేశం ఒక దేశంగా కనపడుతుంది. 2015లో యూఎన్ సీటీఏడీ, ప్రపంచంలో సృజనాత్మక వస్తువులను భారీ ఎత్తున ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశాన్ని ఎనిమిదవ దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో (చైనా, హాంకాంగ్ తరువాత) మూడో పెద్ద దేశంగా గుర్తించింది. ఎగుమతుల్లో దాదాపు 17 బిలియన్లు, వాణిజ్య మిగులు 12 బిలియన్ డాలర్లు. బాలీవుడ్ దీనిలో కేవలం ఒక భాగంగా, తక్కువ ప్రాధాన్యత కలిగిందిగా ఉంది. ఉదాహరణకు, ఇటీవల సంవత్సరాలలో భారతదేశం క్రీడల అభివృద్ధికి, క్రీడల మద్దతు సేవల కేంద్రంగా మారింది.
ఎక్కువ మంది ప్రజలు అసంఘటిత రంగంలో పని చేస్తారు, కొద్దిమంది మాత్రమే ''నమోదు'' చేయబడిన పరిశ్రమల్లో పని చేస్తారు కాబట్టి, భారతదేశంలో ఖచ్చితంగా ఎంతమంది ఈ సృజనాత్మక పరిశ్రమల్లో భాగస్వాము లవుతారో అంచనా వేయడం కష్టం. కానీ పెద్ద సంఖ్యలో ఉంటారనడంలో మాత్రం సందేహం లేదు. వ్యవసాయం తరువాత మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పనకు అవకాశం ఇచ్చేది చేనేత రంగం, చేతి వృత్తుల రంగం. ఈ రంగాలు సుమారు 200 మిలియన్ల మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయనే అంచనా ఉంది. కళల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్, డిజైన్, సినిమా, ఫొటోగ్రఫీ లాంటి పరిశ్రమలన్నీ ఉపాధి అవకాశాల పెరుగుదలను సృష్టించాయి. ఆన్లైన్ బదిలీల ద్వారా లబ్ది పొందే కొత్త రంగాలు ఉద్యోగ కల్పనలో చాలా పెరిగాయి. ఉత్పాదక ఉపాధి అవకాశాలు లేని, చాలీచాలని జీవనాధారాలు ప్రధాన సవాళ్ళుగా ఉన్న భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలో ఈ కార్యకలాపాలకు తగిన ప్రాధాన్యత లేదు.
అయినా ఈ పరిశ్రమలు ప్రజల మద్దతుతో ప్రయోజనాలు పొందలేదు. అనేక దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో, సాంస్కృతిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడి గత దశాబ్ద కాలంగా స్థిరంగా తగ్గుతూ వస్తుందని ఇటీవల ''యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్'' (యునెస్కో) నుంచి వచ్చిన నివేదిక ధృవీకరించింది. సంక్షోభ సమయంలో కోరుకుంటున్న, కొనసాగు తున్న సాంస్కృతిక, సృజనాత్మక రంగాలపై ఇది బలమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఈ సృజనాత్మక పరిశ్రమలపై కోవిడ్-19 ఎలా ప్రభావం చూపిందనే ప్రశ్న ఈ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్న వారికి మాత్రమే ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తులో ఒక శక్తివంతమైన అభివృద్ధికి ఇదొక జటిల సమస్య. దీనిపై ఒక సమగ్రమైన అధికారిక విశ్లేషణ లేని పరిస్థితిలో, ఈ కాలంలో భారతదేశంలోని సృజనాత్మక పరిశ్రమల్లో కొన్నింటిలో ఏమి జరిగింది, అకాస్మాత్తుగా తగిలిన దెబ్బలనుండి బయటపడేందుకు వారనుసరించిన వ్యూహాలేమిటనే దానిపై ఆధారపడి చేసిన ఒక విలువైన సర్వే సమాచారాన్ని ఓ కొత్త నివేదిక సమకూర్చింది. అది, మార్చి 2020 నుండి నవంబర్ 2021 వరకు వరుసగా చేసిన మూడు సర్వేలు (ముఖ్యంగా సంఘటిత రంగ సంస్థలు, కొన్ని అసంఘటిత రంగ సంస్థలు కూడా) భారతదేశంలోని సాంస్కృతిక రంగం, పైన తెలిపిన కాలంలో కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో ఎలా స్పందించిందో సూచించాయి.
ఊహించిన విధంగానే రుజువు చాలా తీవ్రంగా ఉంది. విభిన్న కార్యకలాపాలలో ఫలితాలు అసమానంగా ఉన్నప్పటికీ, ఆదాయం, ఉపాధి అంశాలలో బాగా దెబ్బతిన్న పరిశ్రమల్లో ఈ పరిశ్రమలూ ఉన్నాయి. థియేటర్, సంగీతం, నాట్యంతో పాటుగా పండుగలు, సినిమాలు, గ్యాలరీలు, మ్యూజియంలపై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. కానీ, ప్రయివేటు గ్యాలరీలు, కళాత్మక అమ్మకాలు, ఆన్లైన్ కార్యకలాపాలు, కృత్రిమ ఆటలు లాంటి వాటిలో జరిగిన వ్యాపారం కరోనా మహమ్మారి కాలంలో చాలా వేగంగా పెరిగింది.
లాక్డౌన్లు, భౌతిక దూరం లాంటి అంశాలు, 88శాతం ఉపాధి అవకాశాలున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నైపుణ్యం గల స్వతంత్ర కార్మికులు కూడా బాధలననుభవించారు. అలాంటి కార్మికులు 51శాతం ఆదాయాలను నష్టపోగా, 44శాతం మంది ఉద్యోగులు మరింత అభద్రతతో, రక్షణలేని స్వతంత్ర పనిలోకి నెట్టబడ్డారు.
ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే కార్మికులు ఘోరంగా దెబ్బతిన్నారు. అతి కొద్ది సమయంలోనే వారు జీవనాధారాలను కోల్పోయారు. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిన వలస కార్మికుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో 76శాతం మంది తమ పనులను కోల్పోయారని, 44శాతం మంది ఆర్డర్లు రద్దయ్యాయని, చెల్లింపుల్లో ఆలస్యం జరిగిందని, కేవలం 58శాతం మంది మాత్రమే కరోనా వ్యాప్తి సమయంలో కొత్త ఉత్పత్తులను తయారు చేశారని సర్వేలు చెబుతున్నాయి. ఈ కాలంలో అలాంటి 22శాతం మంది కార్మికులు కనీసం 75శాతం ఆదాయాలు కోల్పోయారు.
పండుగ నష్టాలు
మతపరమైన, సాంస్కృతిక పండుగలు ప్రధానంగా భారతదేశంలో ఉపాధిని సృష్టిస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు, కోల్కటాలో దుర్గా పూజ సందర్భంగా రోజుకు రెండు నుంచి మూడు లక్షల మంది అమ్మకాలు, కొనుగోళ్ళలో పాల్గొంటారని అంచనా. వీరంతా ఉపాధి కల్పన, ఆదాయాలు సమకూర్చడంలో భాగస్వాములవుతారు. దేశంలో సాధారణంగా పండుగలకు అదునైన కాలం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కానీ 2020, 2021సంవత్సరాలలో భౌతిక దూరం పాటించాలనే నియమం కారణంగా ఎక్కువ పండుగలు రద్దయ్యాయి, కొన్ని వాయిదాలు పడ్డాయి. ఇది కేవలం ప్రత్యక్ష ఉపాధిపై మాత్రమే కాక ఈ పండుగల సందర్భంగా అమ్ముడు పోయే ఉత్పత్తుల పైన, వాటిని తయారుచేయడానికి అవసరమయ్యే వస్తువులపై కూడా ప్రభావం చూపింది.
సినీ పరిశ్రమ
భారతదేశంలో సినీ పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమగా పేరు పొందింది. ప్రజల జీవన పరిస్థితుల వలే సినీ పరిశ్రమ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. మొత్తం దేశ వ్యాప్తంగా 9527 సినిమా హాళ్ళకు గాను కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో సుమారు వెయ్యి సినిమా హాళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. కొన్నింటిని ఇప్పుడు తెరుస్తున్నారు. ఉపాధిపై దీని ప్రభావం ఎంతగా ఉందో ఇంకా స్పష్టంగా తెలియదు. 2020లో మ్యూజియంలు, గ్యాలరీలు సగటున 155 రోజుల పాటు మూసివేయబడ్డాయి . కొన్నింటిని 2021వ సంవత్సరంలో కూడా మూసి వేయాల్సి వచ్చింది. 2019తో పోలిస్తే అమ్మకాలు, కొనుగోళ్ళు 70శాతం పడిపోతే, ఆదాయాలు 40-60శాతానికి తగ్గాయి. దీనికి భిన్నంగా లాక్డౌన్ కాలంలో, ఆ తర్వాత కాలంలో కూడా ఆన్లైన్ ఆటలు బాగా పెరిగాయి. భారతదేశంలో ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ నిర్దిష్ట సాంస్కృతిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది దేశంలోని పెద్ద సంఖ్యలో ఉన్న యువ జనాభా యొక్క ప్రజాదరణను పెంచింది. తక్కువ సంఖ్యలో అయినా పెరుగుతున్న నిపుణులైన కార్మికులకు కొత్త ఉపాధిని కల్పించాయి.
కరోనా మహమ్మారి సమయంలో సృజనాత్మక పరిశ్రమలు ఘోరంగా దెబ్బతినడంతో అనేక కార్యకలాపాలు ముఖ్యంగా చేతివృత్తులు మనుగడలో ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇది ఉపాధికి మాత్రమే చెడు కాక, సమాజంలోని జీవిత నాణ్యత పైన, ప్రతీ ఒక్కరి శ్రేయస్సు పైన ప్రభావం చూపుతుంది. ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలు సాంస్కృతిక, సృజనాత్మక రంగాలతో ఉండే అనుసంధానం నుండే లబ్ది పొందుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సేవలు, సామాజిక, ఆర్థిక విలువల సృష్టికి, సామాజిక అభివృద్ధికి ముఖ్యంగా విభజన ధోరణులు ముందుకు తోసుకొని వస్తున్న సమయంలో ఉత్ప్రేరకంగా పని చేయవచ్చు.
ఈ కార్యకలాపాలు కొనసాగడానికి, అవి ఎదుర్కొంటున్న తీవ్రమైన, అసంఖ్యాకమైన సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రజల జోక్యం చాలా కీలకం. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా మారడం తప్ప వేరే అవకాశం లేని మిలియన్ల సంఖ్యలో ఉన్న సృజనాత్మక ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన అంశం. సృజనాత్మక రంగం, ఉపాధి అవకాశాల కల్పనకు, ఆరోగ్యకరమైన, ప్రజా శ్రేయస్సును అందించ గలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని ప్రభుత్వాలు గుర్తించి, మొత్తం సమాజంతో, ప్రకృతితో సామరస్యంగా దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించే విధంగా కృషి చేయాలి.
- జయతీ ఘోష్
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451