Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన సమీక్షా సమావేశం, ద్రవ్యవిధానంలో భాగంగా రెపోరేటును 0.50శాతం మేరకు పెంచింది. ఫలితంగా రెపోరేటు 4.40శాతం నుంచి 4.90శాతంకు పెరిగింది. దీంతో ఐదువారాలలో రెండవసారి రెపోరేటును పెంచి నట్లయ్యింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) దేశంలో నెలకొని ఉన్న స్థూల ఆర్థిక పరిస్థితుల అంచనాతో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడమైనదని పేర్కొన్నారు. 50 బేస్ పాయింట్ల పెంపుదల ఫలితంగా గృహ, వాహన, విద్య, వ్యవసాయ, రిటైల్ తదితర రుణాలు పొందిన సామాన్య ప్రజానీకంపై మరింత చెల్లింపుల భారం పడనున్నది.
పరపతి విధాన ప్రకటనలో భాగంగా, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణి, సరఫరా, లభ్యత, రుణాలపై వడ్డీరేటు, రుణాల పంపిణీతీరు, ధరల స్థిరత్వం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువల స్థిరత్వం, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణాలు, స్థూల జాతీయోత్పత్తి వంటి వివిధ అంశాలపై రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు, ప్రజల పొదుపు, పెట్టుబడులు, జీవన ప్రమాణ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
ద్రవ్య పంపిణీని, లభ్యతను కట్టడి చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ప్రయత్నం, వస్తుసేవల డిమాండ్, సప్లరుల మధ్య సమతౌల్యం ఉండే విధంగా నియంత్రణా వ్యవస్థలు పనిచేసేలా చేయటం, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు వంటి ప్రాధాన్యతా రంగాలకు అదనపు నిధులను తక్కువ వడ్డీరేటుకు అందుబాటులోనికి తేవడం వంటివి పరపతి విధాన నిర్వాహణలో అంతర్భాగమే. కానీ సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని మార్కెట్‌శక్తులే విధాన నిర్ణేతలుగా మార్చాలనే ధోరణి ప్రబలమైన ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష దేశ వాస్తవ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించలేక పోతున్నది. వివిధ బ్యాంకులు నగదు మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచేందుకు నిర్దేశించిన క్యాష్ రిజర్వ్ రేషియో (సిఆర్ఆర్), లిక్విడ్ ఆస్తులలో, ఆర్బీఐ ఆమోదించిన సెక్యూరిటీ లలో ఉంచవలసిన భాగం మొత్తానికి సంబంధించిన స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో (ఎస్ఎల్ఆర్), బ్యాంకులకు దీర్ఘకాలిక ప్రాతిపదికమీద ఆర్బీఐ అందించే రుణాల మీద ఇచ్చే వడ్డీరేటుగా పేర్కొనే బ్యాంక్ రేట్, ఆర్బీఐ దగ్గర బ్యాంకులు పొందే స్వల్పకాలిక రుణాలమీద ఇచ్చే వడ్డీరేటు (రెపోరేట్), ఆర్బీఐలో అదనపు నిధులు పెట్టినందుకు ఆర్బిఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీరేటు (రివర్స్ రెపోరేట్) వంటివి రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన ప్రకటనలో కీలక అంశాలు. కానీ ప్రపంచీకరణ విధానాల ఫలితంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అత్యంత సన్నిహితంగా అనుసంధాన మైన తరుణంలో, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్ధేశిత విధానాలకే పాలకులు ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, అవి మన మౌలికమైన ఆర్థిక వ్యవస్థ స్వరూప, స్వభావాలపై సమూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన ద్రవ్యోల్బణ స్థాయి 5.7శాతం నుండి 6.7శాతంగా సవరించారు. మొదటి, రెండూ, మూడు, నాలుగు త్రైమాసికాలలో వరుసగా 7.5శాతం, 7.4శాతం, 6.2శాతం, 5.8శాతంగా ఉంటుందని అంచానా వేసింది. 2022-23 సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.2శాతంగా ఉంటుందని, వృద్ధిరేటు మొదటి, రెండూ, మూడు, నాలుగు త్రైమాసికాలలో వరుసగా 6.2శాతం, 6.2శాతం, 4.1శాతం, 4శాతంగా ఉంటుందని పేర్కొంది.
రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థ అనేక నూతన, భారీ సవాళ్ళను ఎదుర్కొంటోందన్నారు. కరోనా తగ్గుదల వలన ఒనగూరే ప్రయోజనాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు సమకూరలేదని, అంతర్జాతీయ ముడి చమురు ధరలు పతాక స్థాయిలో ఉన్నాయని విశ్లేషించారు.
రిజర్వ్‌బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకోని డిజిటల్ లెండింగ్ యాప్‌ల నుంచి రుణాలను తీసుకున్నవారు సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ యాప్‌ల ద్వారా రుణాలను పొందే ఖాతాదారులు సంబంధిత యాప్‌లు ఆర్బీఐ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నదో లేదో ఆర్బీఐ వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. అనధికార డిజిటల్ లెండింగ్ యాప్‌లను నియంత్రించడానికి మరింత సమగ్ర విధానాన్ని రూపొందించి, వాటిని అరికట్టాల్సిన బాధ్యత నియంత్రణా సంస్థపై ఉన్నది.
క్రెడిట్ కార్డులతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూసీఐ) ఖాతాలను అనుసంధానం చేయడానికి అనుమతిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వినియోగదారులు ఫోన్‌పే, పేటియం, గూగుల్‌పే వంటివి డెబిట్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం నుంచి భవిష్యత్తులో క్రెడిట్ కార్డులకు అనుసంధానం చేయడం ద్వారా క్రెడిట్ కార్డు వినియోగ దారులు కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం కల్పిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆర్థిక అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కృషితో పాటుగా సైబర్ నేరాలను అరికట్టడానికి సమగ్ర వ్యూహరచన ఆవశ్యం.
రెపో అంటే రీ పర్చేజ్ ఆఫర్. వివిధ బ్యాంకులు తమకు నిధుల కొరత ఏర్పడినప్పుడు వారి వద్ద ఉన్న సెక్యూరిటీల వంటి ద్రవ్య సాధనాలను రిజర్వ్ బ్యాంకు తిరిగి కొనుగోలు చేసేలా స్వల్ప ప్రాతిపదిక మీద అమ్మే ప్రక్రియ. ఈ విధంగా సమకూరిన నిధులను బ్యాంకులు తమ అవసరానికి వాడుకుంటాయి. ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచడానికి తీసుకున్న చర్యలుగా ప్రభుత్వం వీటిని అభివర్ణిస్తున్నప్పటికీ, కేవలం రెపోరేటును పెంచడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని, అధిక ధరలను అరికట్టడం ఆచరణలో అసాధ్యం.
దిగుమతుల మీద పరిమితులు విధించడం, ఫ్యూచర్ ట్రేడింగ్ నిషేధించడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించడం, యువతకు ఉపాధిని, ప్రజల కొనుగోనుశక్తిని పెంచేందుకు నిర్ధిష్టమైన దిశా, నిర్దేశం ఆర్థిక వ్యవస్థకు ఆవశ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరల నిర్ణయాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించిన వైనాన్ని ప్రశ్నించకుండా, పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలనే పన్నులు తగ్గించుకోమనే సూచనలకు పరిమితమవ్వడం, సామాన్యుల రుణాలపై వడ్డీ భారాన్ని పెంచే చర్యలకు ఉపక్రమించడం నిష్ప్రయోజనం.
రిజర్వ్ బ్యాంక్ చట్ట నిర్దేశిత ఫ్లెక్సిబుల్ ఇన్ల్ఫేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎఫ్ఐటిఎఫ్) విధానం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంక్ సంప్రదింపులతో ప్రభుత్వం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణ స్థాయి పెరుగుదలైనా, తగ్గుదలైనా నిర్దేశిత లక్ష్యా నికి 2శాతం మేరకి మాత్రమే పరిమిత మయ్యేలా త్రైమాసికాంతానికి సమీక్షిస్తుంది. వరుసగా మూడు త్రైమాసికాలలో ఆర్బీఐ నిర్ధేశిత ద్రవ్యో ల్బణ స్థాయి దాటితే వైఫల్యానికి అవసరమైన కారణాలకు వివరణ ఇచ్చే బాధ్యత ఆర్బీఐదే.
ప్రాధమిక నిర్వచనాలకు, పాలకుల ప్రవచనాలకు భిన్నంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారోత్పత్తులు, నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, ప్రాణావసర ఔషధాలు, రవాణా ఛార్జీలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, వివిధ వస్తు సేవలపై యూజర్ ఛార్జీలు, జీఎస్టీ, రుణాలపై వడ్డీ వంటివి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం అందుకోలేని స్థాయికి చేరాయి. ఇవి పెనుభారమై వ్యవస్థాగత నియంత్రణలను దాటి ప్రజల జీవన ప్రమాణాలను ఛిద్రం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాత్మకమైన, స్వయం ప్రతిపత్తితో, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ, సామాన్య ప్రజలకు స్వావలంబనగా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలనేది విస్తృత ప్రజాకాంక్ష.
- జి. కిషోర్ కుమార్
సెల్: 9440905501