Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయ, సంస్కృతుల ప్రతిబింబంగా ప్రజలు పండుగలు చేసుకుంటారు. ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, రంజాన్, క్రిస్టమస్ వంటి పండుగలను ఆయా మతాలకు చెందిన ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటారు. దసరా పండుగకు కనీసం నెల రోజులకు ముందు ఆ ఊర్లో కోలాహలం ప్రారంభమయ్యేది. కానీ నేడు పండుగలు కళ తప్పుతున్నాయి. కారణం సామూహిక పండుగల కంటే వ్యక్తిగత పండుగలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. తమ స్థాయికి మించి వాటిని నిర్వహించి, సరిలేరు నాకెవ్వరూ అనిపించుకుంటున్నారు. పుట్టిన రోజు వేడుకలు, తొట్టెల పండగ, శారీ పంక్షన్లు, పెండ్లి రోజులు జరుపుకోవడం ఎక్కువైంది. పెండ్లి అయి 25 ఏండ్లు, 50 ఏండ్లు, 75 ఏండ్ల మైలురాయి దాటినప్పుడు కూడా తగ్గేదేలె అంటున్నారు. స్థోమత లేకపోయినా సరే... అప్పులు చేసైనా సరే హంగామా చేస్తున్నారు. తమ అభిమాన రాజకీయ నేతలు, హీరోల పుట్టిన రోజులొస్తే ఇక ఎక్కడలేని హడావుడి ఉంటుంది. వాడి కంటే నేనే ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉత్సహం ఎక్కువగా కనిపిస్తున్నది. అతని కంటే ఇంకా ఘనంగా చేయాలనే సోయిలో ఉన్నదంతా ఊడ్చుకుపోయినా పర్వాలేదు కానీ భారీగా నిర్వహిస్తున్నారు. ఒకిరిని చూసి మరొకరు తెగ హడావుడి చేస్తున్నారు. చుక్క, ముక్కలేకపోతే దావత్ దండుగే అన్నంతగా ఉన్నది ఈ వ్యవహారం! ముఖ్యంగా పెండ్లిల ఖర్చు విషయంలో మాత్రం 'పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా? ఫైర్' అంటున్నారు. ఎంతో మంది పేదలు సైతం దీనికి ప్రభావితమవుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టుగా బొడ్రాయి పండుగొకటి సమాజంలోకి దూసుకొచ్చింది. (ఊరి మధ్యలో ఉండే బొడ్రాయి మట్టిలో మునిగితే, దాన్ని పైకి తేవడం). ఊరి బాగుకోసమంటూ ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చి పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదో పెద్ద పండుగగా మారింది. ఊరికి ఇచ్చేది పోను...ఆ తర్వాత బంధుగణానికి మేకలు, కోళ్లు, మందు, విందులు, వినోదాలతో మూడు, నాలుగు రోజులపాటు ఇల్లు గుల్ల అవుతున్నది. బయిటికి సంతోషంగా కనిపించినా... లోలోపల అప్పుల భయం వెంటాడి కుమిలిపోతున్నారు. ఈ దసరా పండగను తలదన్నేలా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఇలా పుటకో పండుగ పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తుంటే జనం మింగలేక కక్కలేక అవస్థలు పడుతున్నారు.
- గుడిగ రఘు