Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది లేఖల కాలం అంటే.. అసలు మతుండి మాట్లాడుతున్నరా? అని ఎవరైనా అనుకోవడం పరిపాటే. అరె ఇది సెల్‌ఫోన్ యుగం.. వాట్సాప్‌లు.. ట్వీట్లు.. ఇన్‌స్ట్రాగ్రామ్... కాలమని అనటం యాదృశ్ఛికమే. గీ టైమ్‌లో కుశల ప్రశ్నలడుగుతూ లెటర్లు రాసేటోళ్లు ఎవరుంటరు? అనే సందేహాన్ని వ్యక్తం చేయడాన్నీ తప్పుబట్టలేం. మీకెన్ని ధర్మసందేహాలున్నా.. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది లేఖల కాలమే. ముమ్మాటికీ నడుస్తున్నది గదే. 'మోడీజీ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలేమైనరు' అంటూ ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ప్రశ్నల పరంపరను కురిపిస్తూ ఓ లేఖను వదిలారు. అరె మీరే లేఖలు రాస్తరా? మేం రాయలేమా? మీ కంటే రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నం.. అసలే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్లం అనుకున్నరేమో ఏమోగానీ రైతు సమస్యలపై ప్రశ్నలు సందిస్తూ చాతాడంత లేఖను సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు పంపారు. అరె మేం ఎక్కడ వెనుకబడతమో ఏమో అనున్నడో ఏమోగానీ.. 'లైంగిక దాడుల ఘటనలతో రాష్ట్రం ఆగమాగమైపోతున్నది. శషబిషలు లేకుండా అఖిలపక్షాన్ని పిలవండి. ప్రగతిభవన్‌కు నేనే వస్తా' అంటూ సీఎం కేసీఆర్‌కు లేఖబాణాన్ని వదిలాడు రేవంత్‌రెడ్డి. ఇగ ఎవ్వరి పార్టోళ్లు ఆ పార్టీ నేతల లేఖలను చూసి మురుసుకుంట వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వదలబట్టే. గవన్నీ చక్కర్లు గొట్టబట్టే. పత్రికలన్నింటిలోనూ గవే వార్తలాయే. గా లేఖలను చూసుకుని మురుసుడాయే. వాటివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేకపాయే. ఓ సార్లు లేఖల మీద లేఖలు వదులుకోవడం గాదు జర సోయిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే గదే పదివేలు అని జనం అనుకుంటున్నరు.
- అచ్చిన ప్రశాంత్