Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ముఖం మీద చిన్న మొటిమ అయి... కొంచెం నొప్పి చేస్తేనే అబ్బా, అమ్మా, అయ్యా అని అంటుంటాం. దానికి పొరపాటున మన చెయ్యి తగిలినా ఆ సలపరానికి విలవిల్లాడిపోతాం. ఒకవేళ అదే మొటిమ స్థానంలో గడ్డ అయితే ఆ బాధ వర్ణనాతీతం. సరే... మొఖం మీద గడ్డ అయితే కాస్త జాగ్రత్తగా ఉండి ఏదోలా సర్దుకుని పోతామని అనుకుందాం. అదే బాహు మూలల్లో ఆ గడ్డ అయితే చెయ్యి లేపేటప్పుడు, దించేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడూ కూడా అది మన తాట తీస్తుంది. భుజం దగ్గర మొదలైన నొప్పి ఒళ్లంతా పాకి చుక్కలు చూపెడుతుంది. సరిగ్గా ఇదే రీతిలో విదేశాల్లో ఉన్న మన భారత బిడ్డలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు... ప్రస్తుతం ఇక్కడి బీజేపీ నేతలు మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల వల్ల అక్కడి వారికి ముఖం చూపించలేకపోతున్నారు. 'మా దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. మా దగ్గర ఆనందంగా, హాయిగా ఉంటున్నారు. మీ మతాలను మేం గౌరవిస్తున్నాం. పరమత సహనాన్ని పాటిస్తున్నాం. మిమ్మల్ని మేం ఎప్పుడూ కించపరచలేదు... అలాంటిది మా మతం మీద, మా దేవుడి మీద ఇలాంటి వ్యాఖ్యలేంటి...?' అంటూ గల్ఫ్‌లోని భారత రాయబారులను అక్కడి ప్రభుత్వాధినేతలు నిలదీస్తున్నారు. దీంతో మనోళ్లు కక్కలేక, మింగలేకా చస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా ముఖం మీద గడ్డ (దేశంలోపల మత విద్వేషాలు, రెచ్చగొట్టుడు...)ను భరించాం. ఇప్పుడు ఎక్కడో అయ్యే గడ్డ (ప్రవక్తపై కామెంట్లు చేయటం ద్వారా విదేశీయులను కూడా రెచ్చగొట్టటం)ను కూడా భరించాల్సి వస్తున్నది. దాని నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.. భరిస్తున్నాం. అవునూ, ఇక్కడో ధర్మ సందేహం... ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలకు నిరసనగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్లందర్నీ ఆయా దేశాలు వెనక్కి పంపితే మన పరిస్థితి ఏంటంటారు...?
-బి.వి.యన్.పద్మరాజు