Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రండి! మీకోసమే ఎదురు చూస్తున్నాను?'' అంటూ భర్తకు ఎదురొచ్చింది లక్ష్మి.
''నువు ఎదురు చూడటం ఎందుకు? ఆఫీసు ముగిసింతర్వాత ఎలాగూ ఇంటికొస్తాను కదా!'' అన్నాడు శేఖర్. అతడు సినిమాలో బ్రహ్మానందంలా ఫోజుపెట్టి.
''అది కాదండీ! పొద్దున్నే నాకో అనుమానం వచ్చింది! అది తీరుస్తారేమోనని మీకోసం ఎదురు చూస్తున్నాను'' అన్నది లక్ష్మి.
''నీకొచ్చిన అనుమానానికి నేనెందుకు? గూగుల్ తల్లిని అడగలేకపోయావా?'' అన్నాడు శేఖర్ తేలిగ్గా.
''ఊహూఁ మీరే తీర్చాలి!'' అంది లక్ష్మి భర్త భుజంపై వాలి గోముగా.
''సర్లే వస్తానుండు!'' అంటూ స్నానం చేసొచ్చి సోఫాలో కూర్చున్నాడు శేఖర్.
ఈలోగా కమ్మటి కాఫీతో పాటు స్నాక్స్ కూడా తీసుకొచ్చింది లక్ష్మి.
''ఇప్పుడు చెప్పు! నీ డౌటేమిటో!'' అన్నాడు శేఖర్ కాఫీ తాగుతూ.
''ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే ఏమిటండీ!'' అడిగింది లక్ష్మి
శేఖర్‌కి పొలమారింది! దీంతో లక్ష్మి, శేఖర్ నెత్తిమీద ఒక్కటిచ్చింది. శేఖర్ సర్దుకున్నాడు.
''ఆ పదం ఎక్కడ విన్నావు!'' అడిగాడు శేఖర్ ఆశ్చర్యంగా.
''ఎక్కడ వింటే ఏమిటిటండీ! నాకు వివరించండి!'' అంది లక్ష్మి.
''ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే అంచు లేదా కొంగు లేదా కొసరు అంశాలు అన్న మాట! అయినా ఈ డౌటు ఎందుకొచ్చింది! కొంపదీసి పట్టుచీరలు, వాటి కొంగులు తూకానికి వేశావా ఏమిటీ? మా అమ్మ ఎంతో ప్రేమతో నీకిచ్చిన పట్టుచీరలు ఉన్నాయా! లేవా?'' అన్నాడు శేఖర్ ఆందోళనగా
''మీ అమ్మగారు పెట్టిన పట్టుచీరలెక్కడికీ పోలేదుగానీ, అసలు లేకుండా కొసరు ఉంటుందా? చెప్పండి!'' అంది లక్ష్మి.
''అసలు లేకుండా కొసరు ఎలా ఉంటుందీ. ఉండదు! అయినా అసలు, కొసరూ కలిసే ఉంటాయి!'' అన్నాడు శేఖర్ ఆలోచిస్తూ.. భార్య ప్రశ్నలు ఎక్కడికో పోతున్నాయని డౌటొచ్చింది.
''అయితే కొసరును ఎదయినా అంటే అసలును కూడా అన్నట్టే కదా!'' లక్ష్మి అడిగింది.
''అన్నట్టే కానీ, నీవు అడిగేదేదో సూటిగా అడుగు!'' అన్నాడు శేఖర్ చిరాగ్గా.
''బీజేపీ లీడర్ నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్త గురించి అన్న మాటలని'' ఫ్రింజ్ ఎలిమెంట్స్'' అని బీజేపీ ప్రకటించింది కదా! అవి కొసరు మాటలైతే, బీజేపీ సిద్ధాంతమైన మతతత్వమే అసలు అవుతుంది కదా! ఆ మాత్రం దానికి నుపుర్‌శర్మను సస్పెండ్ చేయడమెందుకు?'' ప్రశ్నించింది లక్ష్మి.
శేఖర్ తికమక పడ్డాడు. లక్ష్మి ఏమంటున్నదో అర్థం కాలేదు.
''ఇంతకూ నువు నుపుర్ శర్మను సమర్థిస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా!'' అడిగాడు శేఖర్.
''ఉమాభారతి కూడా సమర్థిస్తున్నది కదా! బీజేపీ సిద్ధాంతాన్నే నుపుర్ చెప్పింది. మతతత్వం నిలువెల్లా నిండిన పార్టీ బీజేపీ. ఆ పార్టీ అధికారిక ప్రతినిధిగా ఆ పార్టీ సిద్ధాంతాన్ని చెప్పింది! అంతేకదా!'' అన్నది లక్ష్మి.
''అంతేగా! అంతేగా!'' అన్నాడు శేఖర్. కాని వెంటనే సర్దుకున్నాడు.
''అరబ్ దేశాలు వ్యతిరేకించాయి కదా! అందుకే చర్య తీసుకున్నారు! బీజేపీకి అన్ని మతాలు ఒకటే!'' అన్నాడు.
లక్ష్మి ఫక్కున నవ్వింది!
''బీజేపీకి అన్ని మతాలు ఒకటేనా! అయితే బాబ్రీమసీదు ఎందుకు పడగొట్టారు! ఇప్పుడు గ్యాన్వాపి మసీదులో శివలింగం ఉందంటూ ఎందుకు గొడవ పడుతున్నారు! మధురలో కూడా గొడవ పెట్టుకుంటామని ప్రకటన ఎందుకుచేశారు?'' అడిగింది లక్ష్మి.
''మరి హిందువుల గుళ్ళు కూలగొట్టి మసీదులు కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? బీజేపీ అట్లా ఎప్పటికీ చేయదు!'' అన్నాడు శేఖర్.
''మసీదు, మందిరం, చర్చి, అల్లా, రాముడు, జీసస్ ఇట్లా దేవుళ్లందరూ ఒకటి గాదా? అంతా వేర్వేరా? అట్లాగైతే దేవుళ్ళు ఎవరి భూములను వారు సృష్టించుకోవచ్చు కదా! అందరూ కలసి, ఒకే భూమిని సృష్టించి గొడవలు ఎందుకు పెట్టారు!'' ప్రశ్నించింది లక్ష్మి.
''కాదు కాదు సకల చరాచర విశ్వానికి ఒక్కడే పరమేశ్వరుడు!'' అన్నాడు శేఖర్.
''పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పుడు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆ పరమేశ్వరుడిని పూజిస్తున్నట్లే కదా! అలాంటప్పుడు ఒక మతం దేవుడిని కించపర్చుట తప్పుకాదా!'' అడిగింది లక్ష్మి.
''ఓహౌ! మన హిందూ దేవుళ్ళను ముస్లింలు, క్రైస్తవులు విమర్శించినప్పుడు, నీ గొంతు పెగలలేదేం?'' అన్నాడు వెటకారంగా శేఖర్.
''నేను అన్న మాటలు అన్ని మతాలకు వర్తిస్తాయి. కాని మతాల పేరిట ప్రజలను చీల్చివేయాలని ప్రయత్నించేవారే ఉలిక్కిపడతారు! మీలాగ!'' అన్నది లక్ష్మి శేఖర్‌ను మరింత ఉడికిస్తూ....
''ఇంతకీ నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు! అన్నాడు శేఖర్ అసహనంగా.
''ఏమీ లేదు! మీ వాళ్ళ డైలాగుల వల్ల దేశం పరువు పోయిందని అంటున్నాను!'' అన్నది లక్ష్మి.
''ఇందులో పరువు పోవటానికి ఏముంది?'' అమాయకంగా అన్నాడు శేఖర్.
''మనదేశం అనుసరించే విదేశాంగ విధానానికి ప్రపంచంలో గతంలో ఎంతో మంచిపేరు ఉండేది. నెహ్రూ, శాస్త్రి, గుజ్రాల్ లాంటి వారితో పాటు వాజ్‌పేయి కూడా చక్కటి విదేశాంగ విధానం అవలంబించి మనదేశ గౌరవ ప్రతిష్టలు పెంచారు. కానీ భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెడతానని చెప్పిన మన ప్రధాని వర్ణచిత్రం, విదేశాలల్లో చెత్తబండ్ల మీద, బూట్ల ముద్రల కింద కనబడటం గతంలో ఎప్పుడైనా జరిగిందా! ఇది మన దేశానికి ఎంత అవమానకరం! తలచుకుంటేనే వళ్ళు కంపరంగా ఉంది!'' అన్నది లక్ష్మి అసహ్యంగా ముఖం పెట్టి.
''అందుకే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము కదా!'' అన్నాడు గొప్పగా శేఖర్.
''మీరు తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటో చెప్పవా, అరబ్ దేశాలకు క్షమాపణ చెప్పటం! నుపుర్, జిందాల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఫ్రింజ్ ఎలిమెంట్సనీ, ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని ప్రకటించటం! ఇవేకదా! 75ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో భారతదేశం ఎప్పుడు, ఏ విషయంలోనూ ఇతర దేశాలకు, తన చర్యల పట్ల క్షమాపణ చెప్పలేదు! అజాదీకా అమృతోత్సవ్‌లో ఆ లోటు తీర్చిన ఘనత పార్టీదే!'' అన్నది లక్ష్మి.
శేఖర్‌కి ఏమిచెప్పాలో తెలియటం లేదు.
''మీ పార్టీ అసలు సిద్ధాంతం మతతత్వం! అధికారం కోసం మతాల చిచ్చు పెట్టేందుకు అవసరమైన సిలబస్ తయారు చేశారు. ఆసిలబస్లోని కొసరు మాటలే. అధికార ప్రతినిధులు వల్లించారు! అందుకే అవి ఫ్రింజ్ ఎలిమింట్స్ అని మీ పార్టీ కరెక్టుగానే ప్రకటించింది. అందుకు అభినందనలు'' అంటూ లక్ష్మి చప్పట్లు కొట్టింది.
శేఖర్ కూడా చప్పట్లు కొట్టబోయి ఆగిపోయాడు.
''200ఏండ్ల వలస పాలనలో మనను దోచుకున్న ఇంగ్లండ్ మీద గెలవటం కాన్నా, మొన్నటి దాకా కలిసున్న పాకిస్థాన్ మీద గెలవటం గొప్పగా భావించే సచిన్; వంద సంవత్సరాల గ్యాప్ ఉన్న ఇద్దరు రాజులు యుద్ధం చేసినట్లు సినిమాలు తీసే అక్షరు, కాశ్మీర్ పండిట్ల మీద సినిమాలు తీసి, చరిత్రను వక్రీకరించే వివేక్ లాంటివారు రైతు పోరాటాలను విమర్శిస్తూ మాట్లాడారు కానీ, ఇప్పుడు ఒక్క మాట మాట్లాడడం లేదెందుకు? అవును పాపం వారు కూడా ఫ్రింజ్ ఎలిమెంట్స్ కదా!'' అన్నది లక్ష్మి.
శేఖర్ తలదించుకున్నాడు.
''మతం పేరిట ప్రజలను చీల్చివేసే ప్రయత్నానికి ఇప్పటి వరకూ మనదేశంలోనే ప్రతిఘటన ఎదురైంది. దాన్ని సీఏఏ, రాజద్రోహం చట్టాల పేరిట అణిచివేసే ప్రయత్నం చేశారు. కాని మతతత్వాన్ని కొనసాగించటం వల్ల అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి తలవంపులు తెచ్చిపెట్టారు! ఇకనైనా మేలుకొని మీ పద్ధతులు మార్చుకోండి! లేకపోతే మీ ఆరాధ్యుడైన హిట్లర్ మార్గంలోనే మీరూ పయనించాల్సి ఉంటుంది!'' అంటూ లోనికి వెళ్ళింది లక్ష్మి.
- ఉషాకిరణ్, సెల్: 949040354