Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో గత పాలకులు గీతకార్మికులను సరిగ్గా పట్టించుకోలేదుగానీ, మా ప్రభుత్వం మాత్రం గీతకార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని అనేక వేదికలపై ఎక్సైజ్శాఖా మాత్యులతోపాటు పాలకనేతలంతా చెబుతన్న విషయం విధితమే. హైదరాబాద్లో మూసివేసిన కల్లుషాపులు తెరిపించాము, గీత కార్మికులు ప్రభుత్వానికి చెల్లించే పన్ను 16కోట్లు రద్దు చేశాము, ఎక్సిగ్రేషియా 2లక్షల నుంచి 5లక్షలకు పెంచాము, పెన్షన్ రెండువేలకు పెంచాము, నీరాపాలసీ తీసుకొచ్చాము, లిక్కర్షాపులలో గౌడులకు 15శాతం రిజర్వేషన్లు ఇచ్చాము, హైదరాబాద్లో గౌడభవనం నిర్మించి ఇస్తాము, 4కోట్ల ఈతచెట్లు నాటించామని పదే పదే చెబుతున్నారు. ఇవన్నీ కాదనలేం. కొంత ప్రయోజనం జరుగుతున్న మాట కూడా నిజం. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో స్వచ్ఛమైన కల్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని తనదైన శైలిలో చెప్పారు, ఆభ్కారీమంత్రి జిల్లా పర్యటనలు చేసిన సందర్బంలో వనంలో కల్లుతాగడం, ప్రక్కన ఉన్నవాళ్ళకు తాపించడం, వేదికలపై నీరాతాగడం ద్వారా కల్లుకు బ్రాండ్ఇమేజ్ తీసుకొచ్చారనడంలో సందేహంలేదు. అయినప్పటికీి గ్రామాలలో గీత కార్మికులెవరూ సంతృప్తిగాలేరు. వృత్తి రోజురోజుకు దెబ్బతింటున్నది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ విధానాల వలన బహుళజాతి కంపెనీల ఉత్పత్తులు లిక్కర్, శీతల పానీయాలు విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయి. పలితంగా వృత్తిలో ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్నారు. మరో పక్క వృత్తిలో ప్రమాదాలు జరిగి వేలాదిమంది వికలాంగులవుతున్నారు, చనిపోతున్నారు. క్రమంగా వృత్త్త్తి చేసే గీతకార్మికులు తగ్గుతున్నారు. కొత్త తరం ఈ వృత్త్తిపై ఆసక్తి కనబర్చడం లేదు. లాక్డౌన్కాలంలో తెలంగాణ ప్రభుత్వం కల్లును మినహాయించింది. లిక్కర్, శీతలపానీయాలు లేకపొవడం, ప్రకృతి పానీయాలు ఆరోగ్యానికి మంచిదని ప్రచారం కావడంతో కల్లు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆన్లైన్ బుకింగ్లు చేసుకున్నారు. ఈ కాలంలో గీత కార్మికులకు ఆదాయం బాగా వచ్చింది. వృత్తిలో బ్రతకలేక వలసలు వెళ్శినవారు తిరిగి గ్రామాలకు చేరుకొన్నారు. వీరిలో కొంతమంది మళ్ళీ వృత్తి చేస్తున్నారు. గ్రామాలలో కొత్తవారు సభ్యత్వం కొరకు ధరఖాస్తులు పెట్టుకోవడం పెరిగింది. కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కల్లు అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం కేవలం కొన్ని సంక్షేమపథకాలు పెట్టి సరిపెట్టుకోకుండా వృత్తిలో ఉపాథి అవకాశాలు మెరుగుపరిచే చర్యలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి తాటి, ఈత చెట్లున్నాయి. 4,558 గీతకార్మిక సహకార సంఘాలు (టీటీసీఎస్), 3717 వ్యక్తిగత లైసెన్సు (టీఎఫ్టీ)ల ద్వారా 2,50,000 మంది సభ్యత్వం కలిగి వృత్తి చేస్తున్నారు. సభ్యత్వం లేకుండా కూడా వృత్తి పని చేసేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. గీసే పని పురుషులు చేస్తే, అమ్మ కంలో స్త్రీలు ఉంటున్నారు. వీరికి సభ్యత్వం లేనప్పటికీ వృత్తిలో భాగస్వాములుగా ఉన్నారు. వీరితోపాటు వృత్తి పరి కరాలు తయారుచేసే కుమ్మరి, కమ్మరి, చర్మకారులు తదితర వృత్తి దారులు మొత్తం రాష్ట్రంలో 5 లక్షల కుటుంభాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా గీతకార్మికులు ఈ వృత్తి చేస్తున్నారు. 2014 నుంచి ఈ 8 సంవత్సరాల కాలంలో 5,000 మంది ప్రమాదాలకు గురయ్యారు. వీరిలో 600మంది చనిపోయారు. 4400మంది వికలాంగులయ్యారు. ఇంత ప్రమాదకరమైన వృత్తి మరేదీ లేదు. కానీ ప్రభుత్వం వీరి సంక్షేమాన్ని చిన్నచూపు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గీతకార్మికులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఇవి కేవలం ఉపశమనమే తప్ప ఉపాధి కాదు. 50 సంవత్సరాలు పైబడిన గీతకార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. వృత్తిలో ప్రమాదంజరిగి చనిపోయినవారి కుటుంబాలకు, వికలాంగులకు ఎక్సిగ్రేషియో చెల్లిస్తున్నారు. కేవలం కొన్ని పథకాలు పెట్టి వాటి చుట్టు తిప్పడం కాకుండా రాష్ట్రంలోని గీతకార్మికులందరికి ఉపాధి కల్పించి వారి అబివృద్దికి రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక ఆర్దిక సహకార సంస్ద (టాడి కార్పోరేషన్) ద్వారా చర్యలు చేపట్టాలి. సొసైటీలకు చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలి. పట్టాణాలు విస్తరించడం, రియల్ ఎస్టెట్ వ్యాపారం పెరగడంతో తాటి ఈత చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు. నరికినవారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా బలమైన చట్టం లేదు. క్రమంగా చెట్లు మొత్తం లేకుండాపోయె ప్రమాదం ఏర్పడింది. గ్రామంలో ప్రభుత్వభూమి ఉన్నట్టయితే 5ఎకరాలు ఇవ్వాలనే 560 జీవో ఉన్నప్పటికీ అమలు కావడంలేదు. హైబ్రీడ్ తాటి, ఈత, ఖర్జూర, జీలుగు మొక్కలు సరఫరా చేసి నీటి సౌకర్యం కల్పించినట్లైతే గీతకార్మికులకు ఉపాధి కలగడమే కాకుండా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కూడా జయప్రదం అవుతుంది.
కల్లులో ఆరోగ్య గుణాలను ప్రభుత్వం ప్రచారం చేయాలి
కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా నివారించ వచ్చని, కిడ్నీలో రాళ్లను తొలగిస్తుందని దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. దీనిని ప్రభుత్వమే ప్రచారం చేయడం వలన కల్లుకు మార్కెట్ పెరుగుతుంది. తద్వారా గీతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఆదునీకరణ పద్దతులు అవలంబించాలి
తాటి, ఈత, ఖర్జూర, జీలుగు చెట్ల ద్వారా 'నీరా' తీయవచ్చు. దీనిని నిల్వ ఉంచే పద్దతి, బాట్లింగ్ సిస్టమ్ చేపట్టినట్టయితే స్టార్ హౌటల్లలో కూడా అమ్మకాలకు పెట్టవచ్చు శీతలపానీయాలకు ధీటుగా కొనసాగించవచ్చు. నీరాతో బెల్లం, చక్కెర, సిరఫ్, జామ్, చాక్లెట్లు, పామ్వైన్ లాంటి అనేక బై ప్రొడక్ట్స్ తయారు చేయవచ్చు. తాటి ముంజలు, ఈత పండ్లు అంటే ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇతర దేశాల్లో కూడా వీటికి మంచి గిరాకి ఉంది. జిల్లాకో ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి ఇలాంటి ఆధునీకరణ పద్ధతులకు అవకాశం కల్పిస్తే ఉపాధి కలుగుతుంది. యువత, మహిళలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాప్రంలోని గీతకార్మికులందరికి ప్రభుత్వమే ప్రమాదబీమా పాలసీ చేసి సహజమరణాలకు కూడా ఎక్సిగ్రేషియా వర్తించేవిధంగా చూడాలి. ప్రస్తుతమున్న మెడికల్బోర్డు విధానం తొలగించి రూ.10లక్షలకు పెంచాలి. వృత్తి చేసేవారు తాటి, ఈత వనంకు 5నుంచి 10 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వస్తున్నందున అందరికి తక్షణమే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. సంవత్సరంలో 6 మాసాలే వృత్తి ఉంటుంది కాబట్టి మిగితా కాలం ఇతర పనులు చేసి బతికేందుకు కుటుంభానికి 10 లక్షల చొప్పున దళితబంధులాగా గీతన్న బంధు ఇవ్వాలి. 50 సంవత్సరాలు పైబడినవారికి ఇవ్వాల్సిన పెన్షన్ కొత్తవారికి 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారు. వారందరికి ఇవ్వాలి. చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్తచట్టం తీసుకురావాలి. కోటి వరాల పథకంలో భూముల కొనుగోలుకు ఇచ్చిన ఋణం తిరిగి చెల్లించలేని 322 సొసైటీల వారి బాకీలు మాఫీ చేయాలి. ప్రమాదానికి గురైనవారికి ప్రస్తుతం టాడి కార్సోరేషన్ నుంచి చేస్తున్న తక్షణ సహాయం పెంచి ఇవ్వాలి. పట్టణాలలో కల్లు షాపుల్లో పని చేసే వేతన గీతకార్మికులకు అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చి వారందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప జేయాలి. ఎజెన్సీ ఏరియాలో రద్దు చేసిన సొసైటీలను పునరుద్దరించాలి. గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘాలకు కమ్యూనిటి భవనం నిర్మించి ఇవ్వాలి. బెల్టు ఫాపులను తొలగించి మద్యనిషేదాన్ని దశలవారిగా అమలు చేయాలి. తరతరాలుగా వృత్తిచేస్తూ జీవనంసాగిస్తున్న వీరి ఉపాధికి భద్రత కల్పించాలి.
- యం. వి. రమణ
9490098485