Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోగం వచ్చాక బాధపడడం కంటే, రాకుండా ముందుజాగ్రతల్తు తీసుకోవడమే మంచి దంటారు డాక్టర్లు. లైంగికదాడి సంఘటనలు జరిగాక బాధపడడం కంటే.. జరుగకుండా చర్యలు తీసుకోవడమే మంచిది. ఇది మన ప్రభుత్వాలూ, పోలీసుశాఖ పాటిస్తే జూబ్లీహిల్స్ లాంటి సంఘటనలు జరిగేవి కావు. అమ్నేషియా పబ్ వ్యవహారంలో లైంగికదాడి ఘటన తరువాత కూడా ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధిóతుల ఫిర్యాదులతో పోలీసులు విచారణలు కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరబాద్ నెక్లెస్ రోడ్ అనాథ బాలికపై లైంగికదాడి, నారాయణ పేట జిల్లాలోని మహిళపై లైంగికదాడి, తాజాగా ఒకే రోజు ముగ్గురు మైనర్లపై.. ఇలా ఎక్కడో ఓ చోట సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేరా...? ప్రభుత్వాలు, పోలీసు శాఖ ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు..? దిశ, పోక్సో చట్టాల ద్వారా త్వరితగతిన శిక్షలు ఎందుకు ఖరారు కావడంలేదు..? పోలీసులు కోర్టులకు సమగ్ర సాక్షులను, ఆధారాలను ఎందుకు సమర్పించడం లేదు..? ఇలా సామాన్యుల అనేక సందేహాలకు పోలీసుల వద్ద, సర్కారు వద్ద జవాబులేదు. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి లైంగిక దాడి ఘటనలు పెరుగుతున్నట్టు స్ఫష్టమౌతున్నది. 2020లో రాష్ట్రంలో 1934 లైంగికదాడి కేసులు నమోదు కాగా, 2021 నాటికి ఆ సంఖ్య 2382కు పెరిగినట్టు పోలీసు శాఖ ఇచ్చిన రిపోర్టులే చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఈ సంవత్సరం ఈ కేసుల సంఖ్య మరింత భారీగా నమోదు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంత జరుగుతున్నా.. నష్ట నివారణ చర్యలు చేపట్టక పోవడంతో బాలికల తల్లిదండ్రులు, మహిళల్లో అభద్రతా భావం పెరిగిపోతున్నది. బాలికలను స్కూలుకు పంపించాలంటే, ఒంటరిగా వదిలి పెట్టి బయటకు వెళ్లాలంటే, కాలేజీలకు పంపాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. మహిళలు కూడా ఒంటరిగా వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ వరుస సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులు బాలికల ఉన్నత విద్యకు విఘాతం కల్గించేలా ఉన్నాయి. అభివృద్ధిపైనా పెను ప్రభావం చూపనున్నాయి. భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్, వైన్స్‌లపై చర్యలు తీసుకోవాల్సింది ఎక్సైజ్‌శాఖ అని రాష్ట్ర హోం మంత్రి చేసిన ప్రకటన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ఎక్సైజ్, హోం శాఖల మంత్రులు వేరు కావచ్చు... కానీ ఈ దారుణాలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని గుర్తించకపోతే ఎలా?
శాంతి భద్రతల నిర్వహణకు బోలెడన్ని నిధులు తగలేస్తున్నా, అనుభవజ్ఞులైన పోలీసు అధికారులున్నా, అడుగడుగునా సీసీ కెమెరాలు, కంట్రోల్ అండ్ కమాండ్ వ్యవస్థ, షీ టీమ్స్, వివిధ నిఘా విభాగాలు పని చేస్తున్నా... ఈ లైంగికదాడులను అరికట్టలేకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఘటనలు జరిగిన వెంటనే విచారణలు వేగిరం కావడం లేదని, వీఐపీలు, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు, జోక్యం పెరుగుతున్న దని విమర్శలుంటున్నాయి. ఫలితంగా చట్టబద్దంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ కొనసాగడంలేదనే ఆరోపణ లూ ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యా ధునిక కంట్రోల్ కమాండ్ సిస్టమ్ పోలీసుల చేతుత్లో ఉంది. పబ్‌లు, స్టార్ హోటళ్లు, వైన్స్‌లు, దాబాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై మానిటరింగ్ చేసి లైంగికదాడి ఘటనలు, అసాంఘీక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కానీ ఇవన్నీ విఫలమౌతున్నట్టు జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్.. బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో వీఐపీల పిల్లలు, ప్రజా ప్రతినిధుల బంధువులున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఓ ఎమ్మెల్యే కుమారుడని, మరో మంత్రి మనుమడున్నాడనే ఆరోపన లున్నాయి. లైంగికదాడికి వాడిన కారు, ఈ సంఘట నకు మూలమైన పబ్ నిర్వాహకులు కండ్లముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మైనర్లు, మరో వ్యక్తి ఉన్నట్టు తేల్చిన పోలీసులు.. మరింత లోతుగా విచారిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు కార్పోరేటర్ కుమారున్ని నిందుతునిగా చేర్చిన పోలీసులు, మిగతా నేతల బంధువుల పాత్ర లేదని తేల్చేశారు.
లైంగికదాడి బాధితురాలు రుమేనియాకు చెందిన బాలిక అని ఆ దేశ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు, జాతీయ, అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. ఇది విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపనుంది. రాజకీయ విమర్శలు- ప్రతి విమర్శలను ఎలా ఉన్నా.. లైంగికదాడి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణలోనే కాదు, నేడు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లైంగికదాడి ఘటనలు గతం కంటే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటిి నిరోధానికి ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ చిత్తశుద్దితో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- చిలగాని జనార్ధన్
8121938106