Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక ''కదలిక లేని స్థితి''కి చేరుకుంటుందన్న భయం ఆడం స్మిత్, డేవిడ్ రికార్డోలను వెన్నాడుతూండేది. అంటే సున్నా వృద్ధి రేటు దగ్గర నిలిచిపోనున్నదని అర్ధం. ఈ పరిస్థితినే మార్క్స్ ''సరళ పునరుత్పత్తి'' అంటూ వర్ణించాడు. అంటే ఆ స్థితికి చేరుకున్నాక,
ఉత్పత్తి సామర్ధ్యం అదనంగా పెరిగేది ఏమీ ఉండదు. ఉన్న స్థాయిలోనే మళ్ళీ మళ్ళీ పునరుత్పత్తి జరుగుతూ వుంటుంది. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ అటువంటి స్థితికి చేరుకుంటుందని అనిపిస్తోంది.
మన ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని చిత్రీకరించడానికి మోడీ ప్రభుత్వపు ప్రచార యంత్రాంగం తెగ తిప్పలు పడుతోంది. కాని వాస్తవమేమో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఒక చిన్న లెక్కల తమాషాను ప్రచార యంత్రాంగం ఉపయోగించుకుంటోంది. ఉదాహరణకు, ఉత్పత్తి 100 నుండి 90కి పడిపోయిందనుకోండి. అప్పుడు వృద్ధిరేటు 10 శాతం పడిపోయినట్టు లెక్క. ఆ తర్వాత ఏడాది మళ్ళీ 90 నుంచి 100కి పెరిగిందనుకోండి. అప్పుడు వృద్ధిశాతం 11.1 అవుతుంది. పడిపోయిన రేటు కన్నా వృద్ధి రేటు అధికంగా ఉన్నట్టు లెక్కల్లో కనపడుతుంది. కాని వాస్తవంగా రెండేండ్లకు మునుపటి పరిస్థితి ఏ విధంగా ఉండేదో, ఆ స్థితికే, ఆ 100కే ఈ ఏడాది చేరు కున్నాం. అంటే ఈ రెండేండ్లలో ఏ వృద్ధీ లేదన్నమాట. కాని వృద్ధిరేటు పెరిగిపోతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
కరోనా మహమ్మారి తీవ్రంగా చెలరేగిన సంవత్సరం 2020-21. ఆ ఏడాదిని విడిచి పెట్టేద్దాం. దానికి ముందటి ఏడాదిని, దానికి తర్వాత ఏడాదిని పరిగణనలోకి తీసుకుందాం. 2019-20, 2021-22 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వాస్తవంగా ఆర్థిక వృద్ధి కేవలం 1.5 శాతం మాత్రమే పెరిగింది. జనాభా పెరుగుదల (2 శాతం) కన్నా ఇదితక్కువగాఉంది. తలసరి వాస్తవ జీడీపీ 2019-20 కన్నా 2021-22లో తక్కువగా ఉంది.
ఈ ఆర్థిక మాంద్యానికి దోహదం చేసిన అంశాలను పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది. 2019-20లో కన్నా 2021-22లో ప్రైవేటు వ్యక్తిగత వస్తువినిమయం 1.5 శాతం పెరిగింది. ఇదే కాలంలో వాస్తవ స్థిర పెట్టుబడి 3.75 శాతం పెరిగింది. వినిమయం కన్నా పెట్టుబడి ఎక్కువగా పెరగడానికి గల కారణాలలో లాక్డౌన్ కాలంనుంచీ మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయవలసిరావడం కూడా ఒకటి కావచ్చును. కొన్నిరంగాలలో ఆధునీకరణ చేయడానికి అదనంగా పెట్టుబడి పెట్టవలసిరావడం కూడా మరో కారణం కావచ్చును. ఏదేమైనా, ఈ విధంగా వినిమయం పెరుగుదల రేటు కన్నా పెట్టుబడి పెరుగుదల రేటు అధికంగా ఉండే ధోరణి ఎక్కువకాలం కొనసాగించడం సాధ్యం కాదు. పెట్టుబడి పెరు గుదల రేటు తగ్గుతున్నకొద్దీ, వినిమయం పెరుగుదల రేటు కూడా తగ్గుతుంది. (పెట్టుబడి తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. చేయవలసిన ఉత్పత్తి తగ్గుతుంది కనుక
ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతాయి. అప్పుడు ఆదాయాలు తగ్గుతాయి. దానివలన వినిమయం తగ్గుతుంది.) ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింత స్పష్టంగా ఎదుగూ బొదుగూ లేని దశకు చేరుతుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దాదాపుగా మాంద్యంలో ఉంది. (నిజానికి తలసరి ఆదాయం తగ్గిపోతోంది) ఇప్పుడు సంపూర్ణ మాంద్యంలోకి పడిపోతుంది. (దానివలన తలసరి ఆదాయాలు ఇంకా ఎక్కువగా తగ్గిపోతాయి) ఒకసారి ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సంపూర్ణ మాంద్యంలోకి పడిపోతే ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి బైటపడడం చాలా కష్టం. ఎందువలన ? కారణం స్పష్టం.
దేశంలో ప్రజలందరూ తమ వినియోగం కోసం చేసే ఖర్చు + స్థూల పెట్టుబడి + నికర ఎగుమతులు (. మొత్తం ఎగుమతుల విలువ లోంచి దిగుమతుల విలువను తీసేస్తే మిగిలినది నికర ఎగుమతుల విలువ) + ప్రభుత్వ వ్యయం - ఈమొత్తం అవశ్యంగా దేశ జీడీపీతో సమానంగా ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికి చివరి రెండు భాగాలనూ పక్కన పెడదాం. అలాగే ఎగుమతుల మార్కెట్ కోసం పెట్టే పెట్టుబడి భాగాన్ని కూడా పక్కన పెడదాం. ఇక ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నప్పుడు వినిమయం పెరిగే అవకాశమే ఉండదు. ఎందుకంటే, వినిమయం పెరగాలంటే ఆదాయాలు కూడా పెరగాలి కనుక. మాంద్యం లో ఆదాయాలు పెరిగే అవకాశం ఉండదు. దేశంలో వినిమయం పెరిగే అవకాశం లేనప్పుడు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడం కోసం పెట్టుబడులు అదనంగా పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. అందుచేత మనం ఇందాకా పక్కన పెట్టిన రెండు భాగాల్లో-విదేశీ ఎగుమతుల మార్కెట్, దేశంలో ప్రభుత్వ వ్యయం - ఏదైనా ఒక ఊపు వస్తే తప్ప మన దేశం ఆర్థిక మాంద్యం నుంచి బైట పడే అవకాశం ఉండదు. వృద్ధి రేటు మైనస్ అయినా అవవచ్చు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగానే మాంద్యంలో ఉంది. కాబట్టి నికర ఎగుమతుల్లో ఒక పెరుగుదల ఊపు వచ్చే అవకాశం లేదు. పోనీ దిగుమతులను బాగా తగ్గిస్తే నికరంగా ఎగుమతుల పెరుగుదల వస్తుంది కనుక దిగుమతులమీద అధిక పన్నులను విధించే సాహసం ఈ ప్రభుత్వం చేయగలదా అంటే ఈ నయా ఉదారవాద ఆధిపత్యం వ్యవస్థలో మన ప్రభుత్వం ఆ పని చేయజాలదు. ఇక మిగిలింది ప్రభుత్వ వ్యయం. ద్రవ్య లోటును నియంత్రించడం ఒక విధిగా అమలు చేస్తున్న మన ప్రభుత్వం ప్రభుత్వ వ్యయాన్ని గనుక పెంచితే ద్రవ్యలోటు పెరిగిపోతుంది. కాబట్టి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాల్లో పెరుగుదల ఎక్కువగా వస్తే తప్ప ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇక పన్నుల ద్వారా రాబడి పెంచుకోడానికి పరోక్ష పన్నులను పెంచడం జరిగితే, ఆ పరోక్ష పన్నుల భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. అప్పుడు వారి వినిమయం ఇంకా తగ్గిపోతుంది. పన్నుల రాబడి ద్వారా పెరిగిన దానికి, ఇలా తగ్గిన వినిమయానికి చెల్లు అవుతంది. నికరంగా జిడిపిలో పెరుగుదల ఏమీ రాదు. తమ ఆదాయాల్లో అత్యధిక భాగాన్ని వినిమయం కోసం ఖర్చు చేసే తరగతుల ప్రజానీకం మీద ప్రత్యక్ష పన్నులను అదనంగా విధించినా, జరిగేది అదే. వారి వినిమయం పెరిగిన పన్నుల మేరకు తగ్గిపోతుంది. అంతిమంగా జిడిపి లో వృద్ధి ఉండదు.
అందుచేత మాంద్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి: ద్రవ్యలోటును బాగా పెంచి, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం. రెండు: సంపన్నుల మీద అదనంగా పన్నులు విధించడం. రెండోది చేయడం అంటే కార్పొరేట్ పన్నును గాని, సంపద పన్నును గాని, రెండింటినీ గాని పెంచడం. కాని అందుకు ఈ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. అలాగే, ద్రవ్యలోటు పెరిగిపోకుండా అదుపులో ఉంచడానికే ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడివుంది. సంపన్నులమీద అదనంగా పన్నులు వేయడం మాట అటుంచి, వారికి భారీగా పన్ను రాయి తీలు ఇస్తోంది. అలా రాయితీలు ఇస్తే ఉత్సాహపడి ఆ సంపన్నులు అదనంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారన్న తప్పుడు నమ్మకంతో ఈ ప్రభుత్వం ఉంది.
ఎందుకు ఇది తప్పుడు నమ్మకం అంటున్నాం ? మాటవరసకు అదనంగా పన్ను రాయితీలు ఇచ్చినందువలన కార్పొరేట్లు ఉత్సాహపడి అదనంగా పెట్టుబడులు పెట్టేరనే అనుకుందాం. అలా జరిగినా, ఆ విధంగా పెరిగిన పెట్టుబడులు ఎంతో, అంతే మోతాదులో ప్రభుత్వ పన్ను రాబడి తగ్గిపోతుంది. ఆ మేరకు ప్రభుత్వ వ్యయం కూడా తగ్గిపోతుంది. అందువలన మొత్తం మీద వినిమయం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి అవకాశం ఉండదు. అంతే కాదు. కార్పొరేట్లు అదనంగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలంటే కావలసింది వినిమయ శక్తిలో పెరుగుదల. ఆ విధంగా అదనపు డిమాండ్ పెరగకుండా అదనపు పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్లు ముందుకు రారు. ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీల వలన మిగిలిన సంపదను భద్రంగా దాచుకుంటారు. దీనిని బట్టి మనకు బోధపడేదేమంటే, ఆర్థిక వ్యవస్థ ఎదుగూ బొదుగూ లేని దశలో చిక్కుకున్నప్పుడు దానిని బైటకు లాగడం ఈ నయా ఉదార విధానాల చట్రానికి లోబడివున్నంతకాలం అసాధ్యం. ఇదేదో వామపక్షవాదుల సిద్ధాంతం కాదు. సైద్ధాంతిక గందరగోళంలో చిక్కుకోకుండా సూటిగా ఆలోచించగల ప్రతీవారూ ఈ నిర్ధారణను అంగీకరిస్తారు. అందుకే కొంతమంది నిిజాయితీ పరులైన పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు కూడా ఇదే నిర్ధారణకు వస్తున్నారు.
ఈ మొత్తం లెక్కల్లో వ్యవసాయ రంగంలో వచ్చే ఉత్పత్తి మాత్రం డిమాండ్ మీద ఆధారపడి పండదు కదా. ఆ రంగంలో వచ్చే అదనపు ఉత్పత్తిని ప్రభుత్వం ఉపయోగించగలిగితే ఆర్థిక వ్యవస్థలో కదలిక తీసుకువచ్చే అవకాశం ఉంటుంది కదా. నిజమే. ఈ వాదన తార్కికంగా సరైనదే. కాని మనం పరిశీలించిన జిడిపి గణాంకాలు ( 2019-20, 2021-22 కాలానికి చెందినవి) వ్యవసాయ రంగంలో వచ్చిన వృద్ధిని కూడా కలుపుకుని లెక్కించినవే.
వ్యవసాయ రంగంలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున ఉత్పత్తిలో వృద్ధి సాధ్యపడితే తప్ప మన ఆర్థిక వ్యవస్థలోని మాంద్యాన్ని అధిగమించి బైట పడడం సాధ్యం కాదు. ఐతే, ప్రస్తుత నయా ఉదారవాద విధానాలలోని ఒక ముఖ్యాంశం చిన్నరైతు వ్యవసాయాన్ని పీల్చి పిప్పి చేయడం. అటువంటప్పుడు వ్యవసాయ రంగంలో దానంతట అదే బాగా వృద్ధి సాధ్యమౌతుందని అనుకోలేం. అందుచేత ఆర్థిక వ్యవస్థ ఎదుగూ బొదుగూ లేని దశలోనే దిగబడిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ కారణం వలన అయినా గాని ఆదాయాల పంపిణీలో ప్రతికూలమైన దిశగా మార్పులు జరిగితే ( ఆదాయాలు పడిపోవడం, ఉద్యోగాలు తగ్గిపోవడం, పెన్షన్ల కోత, రైతుల ఆదాయాలు పడిపోవడం వంటివి) అది ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. అంతిమంగా మరింత ఎక్కువగా నిరుద్యోగం పెరగడం, మరింతగా వినిమయం తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న స్థాయికన్నా అథమ స్థాయికి చేరాక అక్కడ మళ్ళా ఎదుగూ బొదుగూ లేని స్థితిలో మళ్ళీ ఉండిపోతుంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఒక ఎదుగూ బొదుగూ లేని స్థితిలోకి చేరి, దాని నుంచి బైటకు రాలేని నిస్సహాయ పరిస్థితి ఈ నయా ఉదారవాద వ్యవస్థలో సంభవించడం బట్టి నయా ఉదారవాద విధానాలు ఇంకేమాత్రమూ ముందడుగు వేయలేని స్థితికి చేరుకున్నాయని స్పష్టం అవుతోంది. ఇది కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికీ కూడా వర్తిస్తుంది.
- ప్రభాత్ పట్నాయిక్