Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 30రోజులుగా వరంగల్‌లో ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సాక్షిగా నిరుపేదలపై మామునూరు సిఐ కరెంటు కట్ చేయించి, రౌడీలను ఉసిగొల్పి దాడులు చేయించడం దుర్మార్గం. పైగా వారి పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను నలువైపులా దారులన్నీ బంద్ చేసి, జక్కలొద్ది దారిలో ఎవరూ రాకుండా చెత్తను డంప్ చేసి అరెస్టు చేశారు. పేదలను, గర్భిణీ స్త్రీలను సైతం రౌడీ మూకలతో దారుణంగా కొట్టించారు. అసలు ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులు, కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎందుకింత రాక్షసంగా వ్యవహరిస్తున్నాయి? ఎందుకంటే నేడు చట్టం కలిగినోడికి చుట్టమయ్యి రాజుకో నీతి పేదకో నీతి అని నిర్వచిస్తున్నది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బడా బాబులు అక్రమించుకుంటే, ప్రత్యేక జీవోలు ఇచ్చి వాటిని క్రమబద్ధీకరించే ప్రభుత్వం, గూటికి లేని పేదలు 30గజాల స్థలాన్ని ఇవ్వమని అడిగితే ఆక్రమణదారులు అని ముద్రవేసి, బుల్డోజర్లతో కూల్చివేసి, ఇండ్లకు నిప్పుపెట్టి నానా బీభత్సం సృష్టిస్తూ తాను చేసిన చట్టాలను తానే ఉల్లంఘిస్తున్నది.
2014లో దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కేసీఆర్ ఎనిమిదేండ్లు గడుస్తున్నా హామీని నిలబెట్టుకోలేదు. గుర్రం మూతికి గడ్డికట్టి గమ్యం చేరినట్టు, సంవత్సరానికి లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపి మోసం చేస్తున్నారు. గతంలో 40లక్షల ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేసిన కేసీఆర్, 63 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ఇప్పటికి ప్రారంభించలేదు. 2014లో భూమి లేని పేదలకు 125 గజాల స్థలం ఇస్తానని చెప్పిన కేసీఆర్ మోసపు మాటలు నమ్మి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు జీవిస్తున్నారు. కానీ, కబ్జా కోరులు ఎకరాలకు ఎకరాలు మింగుతున్నా ఉలుకూ పలుకూలేని ప్రభుత్వం, పెదోడు నిలువనీడకు జానెడు నేలడిగితే విరుచుకుపడుతున్నది. బుల్డోజర్లతో దాడి చేస్తున్నది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 250 ఎకరాలను ఇప్పటికే కోటీశ్వరులు కబ్జా చేశారు.. గోపాలపురం చెరువులో 20ఎకరాల భూమికి నేడు 9ఎకరాలు మాత్రమే మిగిలింది. 11 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. కోట చెరువుల కింద 53ఎకరాలుంటే 6ఎకరాలు అన్యాక్రాంతం కాగా, 20 ఎకరాల్లో మట్టిని తవ్వి ఇటుక బట్టీల కోసం అమ్ముకుంటూ వ్యాపారం చేస్తుంటే రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. బంధం చెరువులో 21ఎకరాలలో 6ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇంత జరిగినా కండ్లు మూసుకుని ఉన్న సర్కారు, నిరుపేదలు, గుడిసెలేసుకుంటే మాత్రం కండ్లెర్రజేస్తోంది.
2004లో భూ పోరాటానికి పిలుపునిచ్చిన కమ్యూనిస్టు పార్టీలు ఇందిరా పార్కులో నిరవధిక దీక్షకు కూర్చోని, 2006లో బంద్‌కు పిలుపునివ్వడంతో ముదిగొండలో ఏడుగురు బలయ్యారు. ఆనాటి ఉద్యమ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి సీనియర్ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూసంస్కరణల చట్టంలోని లొసుగులు, కుంట శిఖాలు, ఇనాం, నాళాలు, భూదాన్ యజ్ఞ లాంటి అంశాల్లో సమస్యలను పేర్కొంటూ, అవన్నీ పరిష్కారం కావాలంటే మొదట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని, అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉండాలని సలహా ఇస్తూ మొత్తం 104 సిఫార్సులను ప్రభుత్వానికి అందించింది. అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే భూములులేని పేదలందరికీ రెండు నుంచి మూడు ఎకరాల భూమిని ఇవ్వవచ్చని కమిటీ నివేదికలో ఆనాడే చెప్పింది. అయితే స్వతంత్రంగా పని చేసేందుకు అంబడ్సుమెన్ లాంటి కమిటీ ఉండాలని, అసెంబ్లీలోనూ బయటా ఆందోళన చేసినప్పటికీ ఆనాటి వైయస్సార్ ప్రభుత్వం నామమాత్రంగా ఐఏఎస్ అధికారితో భూ కమిషనరును నియమించి చేతులు దులుపుకోవడంతో ఆ సిఫార్సులన్నీ బుట్టదాఖలయ్యాయి. 2000 సంవత్సరం తర్వాత రియలెస్టేట్ వ్యాపారం ఊపందుకొంది. ఎలాంటి శ్రమ లేకుండా అసైన్డ్భూములే కాదు అనేక రకాల భూములను ఆక్రమించి, దొంగ కబ్జాలకు, రికార్డుల సృష్టికి బరితెగించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మియాపూర్ గోల్డ్‌స్టోన్‌కు చెందిన భూముల అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగులోనే ఉన్నది. కోకాపేట భూముల వ్యవహారం పూర్తిగా రెవెన్యూ లీలలకు నిలయమైంది. గ్యాన్సాగూడ దేవుని గుట్ట, సరూర్‌నగర్, కీసర భూములు అలాగే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ భూములు, హైదరాబాదులోని వేలాది చెరువులు కుంటల అదృశ్యం, నాలా భూముల ఆక్రమణ, అయ్యప్ప సొసైటీ లాంటివి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. భూదాన్ యజ్ఞ భూములు కూడా వేలాది ఎకరాలు అక్రమానికి గురయ్యాయి. గ్యాంగ్‌స్టర్ నయీం భూముల వ్యవహారంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల హస్తం ఉన్నదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సెలవిస్తూ ఎంతటి పెద్ద వారినైనా వదలం అన్నారు. కానీ నయీం డైరీ ఇప్పటిదాకా బయట పెట్టలేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో, ఎంపీలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్నవారే అధికంగా ఉన్నారనేది నగసత్యం. తెలంగాణలో 20,13,833 ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే అందులో 2,14,627 ఎకరాల భూములు ఇలాంటి బడాబాబుల స్వాధీనంలో ఉన్నాయి. అయితే రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నందునే అసైన్డ్ భూములు అన్యాక్రాంత మైనవనేది వాస్తవం. ఇది తేలాలంటే తూతూ మంత్రంగా వ్యవహరిస్తే సరిపోదు. దీనిపైన చట్టబద్ధమైన న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటే పరిష్కారం. దేవరయాంజాల్, సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి చెందిన 1531 ఎకరాలకుగాను వెయ్యి ఎకరాల వరకూ అక్రమంగా గోదాములు, ఫంక్షన్ హాల్స్, ఇండ్లు నిర్మించబడ్డాయి. దీని పైన రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఎఎస్ అధికారులతో కమిటీ వేసింది. నయీం సంఘటనపై కూడా ఇలాగే కమిటీ ఏర్పాటూ హంగామా జరిగి ఎంత మొత్తుకున్నా అరణ్యరోదనగానే మిగిలి పోయింది. దేవరయంజాల్ భూములలో కూడా అనేక మంది పెద్దల హస్తం ఉందన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అందులో మంత్రులకు, చివరికి అధికార పార్టీకి చెందిన పత్రికకు కూడా భూములు ఉన్నాయనేది వాస్తవం. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఏ కమిటీ ఏమీ తేల్చింది లేదు. కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం 2017లో భూప్రక్షాళన పేరుతో ప్రచారం తారాస్థాయికి చేరుకున్నా ఆఖరుకు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేని దుస్థితి. భూ దొంగల రికార్డులు, దొంగ కబ్జాల అంశం పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నది. నేడు అసైన్డు భూములు, చెరువు, కుంట శిఖాలు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, భూదాన్ యజ్ఞ భూములు లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమై, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంట పండి స్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా కండ్లు తెరవాలి. పేదల పోరాటాలను గుర్తించాలి. లేదంటే పోరాటం ఆగదు.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140