Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ మహమ్మారితో దేశంలో ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు చాలా వరకు ప్రాథమిక భావనలు మర్చిపోయారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మెజారిటీ విద్యార్థులు చదవడం, రాయడం, గుణించడం వంటి కనీస అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడ్డారు. సుదీర్ఘకాలంగా బడులు మూతపడడంతో గ్రామీణ భారతంలో 37శాతం పట్టణాల్లో 19శాతం విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. మిగిలిన పిల్లల అభ్యసనంపై కరోనా పెను ప్రభావం చూపింది. ఇంకోపక్క పాఠశాల విద్యా వ్యవస్థ పట్టు తప్పుతున్నది. ప్రతి పిల్లవాడిని పాస్ చేయించి పైకి పంపే వేడుకల్లో కాగితాలు అయితే మారుతున్నాయి కానీ, ఉపాధ్యాయులు పిల్లవాడి సూక్ష్మ ప్రగతి నిరంతర మూల్యాంకనం చేయలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఈ పరిస్థితిలో గత ఏడాది నవంబర్ 12న చేపట్టిన జాతీయ సాధన సర్వే విద్యార్థుల బిత్తరపోయే చదువులను, నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన జాతీయ సాధన సర్వేలో పిల్లల పఠన, రాత, గణిత నైపుణ్యాలు బాగా తగ్గిపోయాయని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
విద్యార్థులలో అభ్యాసన నష్టం...
గత ఏడాది నవంబర్ 12న నిర్వహించిన జాతీయ సాధన సర్వేలో చాలా రాష్ట్రాల్లో విద్యార్థుల కనీస అభ్యసన స్థాయి ప్రమాణాలు క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేస్తున్నది. బడి చదువుపై కరోనా పంజా విసరడం వల్ల చాలా రాష్ట్రాల్లో పాఠశాల విద్యలో ప్రమాణాలు దిగజారుతూ పునాదులు బీటలు వారుతున్నాయి. దేశంలో 720 జిల్లాలోని 1,18,274 పాఠశాలల్లో 34,01,158 విద్యార్థులకు నిర్వహించిన న్యాస్ పరీక్ష క్రోడీకరించిన వివరాలు ప్రస్తుత దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. చివరిసారిగా జాతీయ సాధన సర్వేను 2017లో చేపట్టారు. అప్పటితో పోలిస్తే పంజాబ్, రాజస్థాన్, కేరళ, జమ్ము కాశ్మీర్, చండీగర్ రాష్ట్రాలు మినహ తక్కిన రాష్ట్రాల్లో అభ్యసన సామర్థ్యాలు, స్థాయి ప్రమాణాల్లో పతనం తీవ్రంగా ఆందోళన పరుస్తున్నది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఫలితాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కరోనా సమయంలో దేశంలో 33శాతం విద్యార్థులు అభ్యసన సమస్యలు ఎదుర్కొన్నారు. దేశంలో 24శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగిం చడానికి డిజిటల్ ఉపకరణాలు అందుబాటులో లేవని న్యాస్ ఫలితాలు స్పష్టం చేశాయి. చాలా రాష్ట్రాల్లో మూడో తరగతి విద్యార్థులు చిన్న చిన్న పదాలు, గేయాలు సైతం చెప్పలేక పోతున్నారు. త్రిభుజం, చతురస్రం వైశాల్యాలను గణించడంలో, సంఖ్యలు గుర్తించి చదవడంలో ఐదవ తరగతి పిల్లలు విఫలమవుతున్నారు. ఎనిమిదో తరగతి పిల్లలు పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించలేకపోతున్నారు. పదవ తరగతి వారు సైతం మాతృభాషలో, ఆంగ్లంలో పదాలు వాక్యాలను చదవలేక పోయారు.
తెలంగాణలో దిగజారిన ప్రమాణాలు...
పాఠశాల దశలో మంచి బోధన పటిష్ట విద్యా సౌదానికి గట్టి పునాది వేస్తుంది. కానీ అటువంటి మేలిమి బోధన తెలంగాణ రాష్ట్రంలో అందని ద్రాక్షగా మారుతోంది. జాతీయ సాధన సర్వే ఫలితాలే దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 4701 పాఠశాలల్లో 1,45,420 మంది విద్యార్థులకు నిర్వహించిన జాతీయ సాధన సర్వేలో ఫలితాలు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యాయి. 2017 న్యాస్ ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి అన్ని తరగతుల విద్యా సామర్థ్యాలు తగ్గాయి.
విద్యా ప్రమాణాలు క్షీణించడానికి కారణాలెన్నో...
పాఠశాల విద్యలో విద్యా ప్రమాణాలు దిగజారటానికి ''కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు'' అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, కొన్ని చోట్ల తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా లేకపోవడం, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు లేకపోవడం, బోధనా స్థాయి పాఠ్యాంశాలను దాటి విస్తరించకపోవడం, ఉపాధ్యాయుల పనితీరు, బోధన నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన సంస్కరణలు తీసుకు రాకపోవడం, విద్యారంగం మీద ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయకపోవడం, కరోనా మహమ్మారి విలయ తాండవం వల్ల విద్యార్థులు బడికి దూరం కావడం మొదలైనవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జాతీయ సాధన సర్వే ఫలితాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దృష్ట్యా ధీటైన దిద్దుబాటు చర్యలు అవసరం. బోధనా సిబ్బందికి శాస్త్రీయపద్ధతిలో డిజిటల్ శిక్షణ ఇప్పించాలి. అలాగే విద్యా రంగం మీద ప్రభుత్వం మరిన్ని నిధులు ఖర్చు చేయాలి. విద్యారంగంలో ఇష్టారాజ్యంగా అవకతవకలకు పాల్పడుతూ అడ్డదిడ్డంగా నిధులు ఖర్చు చేసిన వారిని నిలదీసి వారిని జవాబుదారీగా మార్చే ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో తక్షణ మౌలిక వసతులైన మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీరు, తరగతి గదులు కల్పించాలి. తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలి. ఆర్థిక వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యారంగంలో సంస్కరణలకు చోటు కల్పించాలి. పాఠ్యాంశాల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చేర్చుతూ వాటిపై ఉపాధ్యాయు లకు శిక్షణ కార్యక్రమాలు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలి. అప్పుడే బడి భవితకు నారుమడి అవుతుంది.
- అంకం నరేష్
సెల్:6301650324