Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్, గన్ కల్చర్ ప్రమాదకర స్థాయిలో విచ్చలవిడిగా పెరుగుతున్నది. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టిస్తున్న ఈ విష సంస్కృతికి యువత మున్నెన్నడూ లేనివిధంగా బలిపీఠమెక్కుతున్నది. జరుగుతున్న అమానవీయ దోపిడీ అక్రమాలను ప్రశ్నించకుండా యువతను జీవశ్ఛవంలా నిర్వీర్యం గావించేందుకు పాలకులు బుద్ధిపూర్వకంగా చేసే కుటిల యత్నమే ఇదని వేరుగా చెప్పక్కల్లేదు.
అయితే యువత నిర్వీర్యం గావడంతో పాటు సంఘంలో శాంతిభద్రతలు పెద్ద ఎత్తున విచ్ఛిన్నమవుతున్నాయి. హింస క్షణక్షణానికి పెచ్చరిల్లిపోతున్నది. ఇందుకు అనివార్యంగా పిల్లలు, అమాయకులు పెద్ద ఎత్తున బలైపోవడమే అతిపెద్ద విషాదం. ఒకసారి హింసాయుతమైన విషసంస్కృతి ముదిరి పాకానపడ్డ తర్వాత పాలకులు కూడా చేతులెత్తక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల అగ్రదేశం అమెరికాలో జరుగుతున్నదదే. పద్దెనిమిదేండ్లు వచ్చీరాగానే ఓ కుర్రోడు ఓ తుపాకీ కొనుక్కుని అమాంతం ఓ స్కూలులో ప్రవేశించి పిట్టలను కాల్చినట్టు 21మంది పిల్లలను పొట్టన పెట్టుకోవడం, అనంతరం అధ్యక్షుడు జోబైడెన్ తన నిస్సహాయతను వ్యక్తం చేయడం అందరూ ఎరిగిందే. మన దేశ పాలకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. చెడు నాగరికతకు - నైతికతకు మధ్యనున్న గీతను చెరిపేస్తున్నారు. పాలకులు గుడ్లప్పగించి చూస్తుంటే హత్యలు, అత్యాచారాలు ఆగుతాయా? పాలన అన్న తర్వాత ఓ సశాస్త్రీయ ప్రణాళిక అవసరం. ధైర్యంతో కూడిన చిత్తశుద్ధి అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం మరీ అవసరం. ఆ సోయి లేకపోతే ప్రజలే పాలకుల మెడలు వంచి సోయి తెచ్చుకునేలా బాధ్యతను చేపట్టాలి. అందుకు పెద్ద సంగ్రామమే చేయాలి. తదనుగుణమైన సాంస్కృతిక విప్లవం అవశ్యం.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ యువజన విధానం - 2021 (నేషనల్ యూత్ పాలసీ)లో ఈ ఛాయలు ఏమీ కనిపించవు. 2030 వరకు యువజనాభివృద్ధిని సాధించే దిశగా ఈ పాలసీ రూపకల్పన జరిగింది. గతంలో మాదిరిగానే '1. విద్య, 2. ఉపాధి (స్వయం ఉపాధి, వ్యాపారం, పరిశ్రమల నిర్వహణ) 3. ఆరోగ్యం, క్రీడలు 4. నాయకత్వ లక్షణాలు. ఈ అభివృద్ధిలో యువత సాధికారతకు కట్టుబడాలి' అని చెప్పుకున్నది. గతంలో సామాజిక న్యాయం లేదు. ఇప్పుడు అదికూడా చేర్చింది. పైకి ఎంత సొగసైన మాటలు ఉల్లేఖించినా, అంతర్గతంగా అమలు పరిచే రాజకీయ సంకల్పం లేనప్పుడు పైన పటారం లోన లొటారంగా మారుతుంది ఏదైనా. కుండకు చిల్లులు పెట్టి పైనుండి ఎన్ని నీళ్ళు పోసినా ఏమి ప్రయోజనం?
మరో పక్క నూతన విద్యావిధానం (2020)లోని ముఖ్యాంశాలన్నింటినీ ఈ యువజన విధానం బలపరుస్తున్నట్టు తెలిపారు. ఆ విద్యావిధానం ఇప్పటికే అశాస్త్రీయంగా కాషాయికరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణలకై మూసపద్ధతిలో ఉన్నదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పైగా నిరుపేద పిల్లలు పెద్దఎత్తున బడి విద్యను మధ్యలోనే మానేసేవిధంగానూ (డ్రాప్ అవుట్స్ పెరిగేలా) చేస్తున్నది. అలాగే పెద్ద పెద్ద ఉన్నత చదువులు, ఉద్యోగాలు, పదవులు కొద్దిమంది ధనవంతుల పిల్లలకు మాత్రమే దక్కేలా కుట్రపూరిత చర్యలు కనిపిస్తున్నాయని వారు ఆందోళన పడుతున్నారు. 'విద్యావిధానంలో సమూల మార్పు అంటే ఇదేనా..? అని ఎద్దేవా చేస్తున్నారు.
యువత దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర వహించే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవాలంటే విద్యతో పాటు తగు సానుకూల సంస్కృతి చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే చదువు - సంస్కృతి పెనవేసుకునే ఉంటాయి. విద్యా విధానాన్ని తిరోగమనంలో నడిపిస్తూ యువజన విధానాన్ని పురోగమనంలో నడిపించడం ఎలా సాధ్యం?
కాగా, ఇటీవల మన హైదరాబాద్ నగరం జూబ్లిహిల్స్‌లో ఓ మైనర్ బాలికపై ఓ పబ్ (ఆమ్నేషియా) ఆధారంగానే సామూహిక అత్యాచారం జరిగిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో పాల్గొన్నవారు ఎక్కువ మంది మైనర్లు (18ఏండ్ల లోపువారు). వీరంతా ధనవంతులు, రాజకీయంగా పలుకుబడి కలిగినవారి బిడ్డలు. సరైన వయసు రాకమునుపే పెద్ద పెద్ద బెంజికార్లు, ఇన్నోవా కార్లు డ్రైవ్ చేస్తూ, పబ్‌ల కెళ్ళి తాగి తందనాలు ఆడుతూ, ఆడపిల్లలను యధేచ్ఛగా, విచ్చలవిడిగా సామూహికంగా వాడుకోవచ్చు (అనుభవించవచ్చు) అనే దుస్థితిలోకి ఎందుకు నెట్టబడుతున్నారు? పబ్‌లకు ఆ విధంగా ఎందుకు లైసెన్స్‌లు ఇస్తున్నారు? ఇందులో ప్రభుత్వ పాత్ర ఎంత? సమాజం పాత్ర ఎంత? తల్లిదండ్రుల పాత్ర ఎంత? అనే విషయం చర్చగా నడుస్తున్నది. మరి అలాంటి పబ్‌లు మన హైదరాబాద్ నగరంలోనే దాదాపు 150 ఉన్నాయి. ఇది విశ్వనగరమా? యువతను బలికొనే విషనగరమా? అనే ప్రశ్న ఉదయిస్తున్నది. నిందితులకు శిక్షపడ్డప్పుడూ వారి జీవితాలు దెబ్బతింటాయి. దిశాకేసులో నేర నిరూపణ కాకమునుపే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటే చట్టం, న్యాయం సక్రమంగా వ్యవహరించలేకపోతున్నట్టు తెలిసిపోతూనే ఉన్నది.
ఇక డ్రగ్స్ విషయానికొస్తే ప్రతిచోట ఇది చీకటి వ్యాపారంగా వేల కోట్లపై సాగుతున్నది. మన హైదరాబాద్‌లోనే ఇది యూనివర్సిటీలు, కాలేజీలు దాటుకుని పాఠశాల పిల్లల్ని కూడా నీడలా వెంటాడటం ఎంత దారుణం? ఇలా యువతలో తెలియకుండానే హింసను ప్రేరేపించే క్రేజీకల్చర్ ఒకదానివెంట ఒకటి స్లోపాయిజన్‌లా విస్తరిస్తున్నది. డాన్స్, గన్స్, రక్తం మడుగు, అర్థనగ అందమైన దుస్తులు, వజ్రాల ఆభరణాలు, సంగీత మధురిమలతో పాటు తుపాకుల శబ్దాలు, బాంబుల మోతలు, స్టైల్‌గా ఉండే రంగు రంగుల వాహనాలు, గ్రేస్ భంగిమలు, క్రీగంటి చూపులు వెరసి హీరోయిజం అంటే ఇదే కదా! అనే విధంగా మ్యూజిక్ వీడియోలు యువతను విపరీతంగా వెర్రెక్కిస్తున్నాయి.
పంజాబ్ గాయకుడు 'సిద్దూ' మ్యూజిక్ వీడియోల మాదిరిగానే అతగాని హత్య కూడా అలానే జరగడం తాజా ఉదాహరణ. గ్యాంగ్స్టర్స్ హింసా వ్యామోహ సంస్కృతి ప్రతిబింబించే వీడియోలు నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇది దిగజారిన హాలివుడ్ సంస్కృతిలో భాగమే. దేశభక్తిలో ముందుండాల్సిన యువత ఇలాంటి విష సంస్కృతి ఊబిలో కూరుకుపోవడం ఎంత ఘోరం?
'డబ్బు కోసం ఏమైనా చేస్తాం.. ఎంతకైనా తెగిస్తాం. విలాసవంతమైన జీవితం గడుపుతాం, భోగాలను అనుభవిస్తాం, అందుకోసం చంపుతాం లేకుంటే చస్తాం' అనే హీనమైన ఆత్మబలిదాన సంస్కృతికి యువత చేరుకుంటున్నది. మన దేశ ప్రగతి నిర్మాణంలో ఎలా భాగస్వామవ్వాలో మరచిపోతున్నది.
ఇతరులను బెదిరించడం, మత్తుకు బానిసలు కావడం, భౌతిక దాడులకు లైంగిక అకృత్యాలకు పాల్పడటం, దౌర్జన్యాలకు తెగబడటం, అంతిమంగా హత్యలకు దిగటం యువతలో చెలరేగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 40శాతం మంది యువతీ యువకులు ఈ దుర్ఘటనలకు గురవుతున్నారు. మన దేశంలో 2020లో జరిగిన హత్యా మరణాల్లో దాదాపు పదిశాతంపైగా అంటే మూడువేల మరణాలు యువతవల్లే సంభవించాయని తెలుస్తున్నది. భారత్‌లో అధికంగా ఉన్న యువత కదలికలను ఎప్పటికప్పుడు గమనించాల్సిన పరిస్థితి నేడు అనివార్యంగా ఏర్పడిందని ఉన్నత స్థాయి మానసిక శాస్త్రజ్ఞులు, అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే అది రానున్న కాలంలో ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయగల ఓ ఛోదకశక్తి అని వారు నమ్ముతున్నారు. రానున్న కాలంలో భారత యువత విష సంస్కృతికి బలవుతుందా? లేక ప్రపంచాన్ని నడిపించే చోదకశక్తి కాగల సాధికారత వైపు పయనిస్తుందా? అనేదే నేడు మన ముందున్న ప్రశ్న.
- కె. శాంతారావు
సెల్:9959745723