Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో మళ్లీ కులోన్మాద హత్య జరిగింది. శరణ్య, మోహన్ల కులాలు వేరు. కాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారం తిరగక ముందే శరణ్య సోదరుడు శక్తివేలు తన చెల్లెలిని, ఆమె భర్తను కిరాతకంగా నరికి చంపాడు. కన్న తల్లి తండ్రులు, తోబుట్టువులే ప్రేమగా పెంచుకున్న తమ బిడ్డలను, సహౌదరిలను తమ కులం కాని వాణ్ణి పెళ్లి చేసుకున్నారని రక్త సంబంధాన్ని సహితం మర్చిపోయి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. చక్కగా కాపురాలు చేసుకుంటున్న కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు. తమ కులంకానివాడు తమ పిల్లని ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని నిర్భయంగా హత్యలకు తెగబడుతున్నారు. డబ్బున్నవారైతే కిరాయి హంతకులకి లక్షలాది రూపాయలిచ్చి కిరాతకంగా హత్యలు చేయించడం సర్వ సాధారణమయింది. శరణ్య, మోహన్ల హత్య దేశంలో మొదటిది కాదు చివరిది కాదు. దేశంలో ఇవి నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
ఈ మధ్య తెలంగాణలో కూడా కులోన్మాద హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే 2014 నుండి ఇప్పటి వరకు అధికారికంగా నమోదైన కులోన్మాద హత్యలకు సంభందించిన పోలీసు కేసులు 70కి పైగా ఉన్నాయి. వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉన్నవెన్నో. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన కొన్ని కులోన్మాదహత్యలు పరిశీలిస్తేనే ఇవెంత విచ్చలవిడిగా జరుగుతున్నవో అర్థమవుతుంది. భువనగిరి జిల్లాకి చెందిన రామకృష్ణగౌడ్ని పల్లెపాటి వెంకటేష్ అనే విఆర్ఓ తనకుమార్తెను పెళ్లి చేసుకోనున్నాడని కక్షకట్టి రూ.10లక్షలు సుఫారి ఇచ్చి చంపించాడు. మరోటి హైదరాబాద్ నడిబొడ్డున సరూర్‌నగర్‌లో ప్రజలంతా చూస్తుండగానే బైకులపైవచ్చి రాడ్లు, కత్తులతో దాడిచేసి నాగరాజు అనే దళిత యువకుడిని అతని భార్య అశ్విన్ ముందే, ఆమె సోదరులు మరికొందరు కల్సి దారుణంగా చంపారు.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో రాజేశ్వరి అనే యువతి షేక్ అలీం అనే ముస్లీం యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు రాజేశ్వరి కన్న తండ్రి దేవదాసు కసాయివాడిగా మారి కన్నకూతురునే కడతేర్చాడు. నవంబర్ 19, 2021న వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్సీ కులానికి చెందిన అంజలి ఎస్టీ యువకుడిని ప్రేమించిందని అంజలి కన్నతల్లి సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మలే హత్యచేశారు. తమ కుల కట్టుబాట్లు దాటినందుకే హత్యచేశామని. మా కులం కాని వానితో పెళ్లి వద్దన్నా విననందుకే హత్య చేయాల్సి వచ్చిందని వారు సమర్థించుకున్నారు. మిర్యాలగూడలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమృతభర్త ప్రణరును అమృత తండ్రి, బాబారులే కిరాయి గుండాలతో హత్యచేయించిన విషయం మనందరికీ తెలిసిందే. కారణం దళితుడైన ప్రణరును అమృత ప్రేమించి పెళ్లి చేసుకోవడమే.
కర్నూల్లో ఆదాం స్మిత్‌ను కులాంతర వివాహం చేసుకున్నందుకు గొడ్డల్లతో నరికి, కత్తులతో పొడిచి కర్కశంగా చంపారు. హైదరాబాద్‌లో అవంతిరెడ్డి కులాంతర వివాహం చేసుకున్నందుకు వైశ్య సామాజికవర్గానికి చెందిన హేమంత్‌కుమార్‌ను అవంతిరెడ్డి తండ్రి, మామ తదితర సమీప బంధువులే కిరాయి గుండాల సహకారంతో ఘోరంగా హత్యచేశారు. భువనగిరిలో స్వాతిరెడ్డి ఆమె భర్త రజక సామాజిక వర్గానికి చెందిన నరేష్‌లను స్వాతి తండ్రి, ఆయన సమీప బందువులే ఘోరంగా హత్యచేశారు. ఇలాంటి కులోన్మాద హత్యలు దేశంలో నిత్యం జరుగుతునే ఉన్నాయి. మహారాష్ట్ర ఔరంగబాద్ జిల్లాకి చెందిన కీర్తీదోర్ను కులాంతర వివాహం చేసుకున్నందుకు స్వయాన తమ్ముడే తల నరికి, సెల్పీ దిగి కుల ధర్మాన్ని కాపాడానని చాటుకున్నాడు. గతంలో తమిళనాడులో సంచలనం సృష్టించిన కౌసల్య భర్త హత్య కూడా ఈ కోవకు చెందిందే. కౌసల్య భర్త దళితుడైన శంకర్‌ను కౌసల్య తండ్రి, సమీపబందువులేహత్య చేశారు.
పంజాబ్‌కు చెందిన కావ్య భర్త అభిషేక్‌ను కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు హత్య చేశారు. ఇక్కడా అక్కడా అని లేదు, దేశనలుమూలలా తమకులం వారితో కాకుండా వేరే కులం లేదా మతం వారిని పెళ్లి చేసుకున్నవారిని అమానుషంగా హత్య చేస్తున్నారు. అవన్నీ నూటికి నూరుపాళ్లు కుల దురంహంకార హత్యలే. ఈహత్యలన్నీ సమీప రక్తసంబంధీకులు చేస్తున్నవే. కానీ, ఇవి అరుదుగా, ఎప్పుడో ఒకప్పుడు జరుగుతున్న ఘటనలుగా ప్రాధాన్యతలేని వార్తలుగా పరిగణించ బడుతున్నాయి. ఇక్కడ పేర్కొన్నవన్నీ ఈమధ్య జరిగినవే. తరతరాల చరిత్రలో ఇలాంటి వెన్నెన్నో. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడం ఫలితంగా ఈ మాత్రమైనా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ హత్యలన్నీ తమ పిల్లలు కులాంతర వివాహాలు చేసుకోవడం ద్వారా తమ కుటుంబ పరువు తీశారని వారి తల్లితండ్రులు, తోబుట్టువులు తదితర సమీప రక్తసంబంధికులే చేయడం ఘోరమైన విషయం. ఆధిపత్యకులాల వారు తమ పరువు, తమకులం పరువు పోతుందని ఈ ఘోరాలకుపాల్పడుతున్నారు. కులాంతర వివాహాం చేసుకునే వారంటేనే రెండు వేర్వేరు కులాలవారన్న మాట. ఇందులో ఒకరిది పైకులంగా, ఇంకొకరిది కింది కులంగా భావించబడటం సహజం. తమకులం కంటే తక్కువ కులమని బావించిన ప్రతి సందర్భంలో పై కులాలవారు దాడులు దౌర్జన్యాలు హత్యలు చేస్తున్నారు. కులాంతర వివాహాన్ని వ్యతిరేకించని తల్లిదండ్రులను కూడా వారి కులమంతా అవమానపరుస్తున్నది. కులాంతర వివాహం చేసుకున్న తమ పిల్లలను శిక్షించాలని కులమంతా వారిని వేదిస్తున్నది. కులాంతర వివాహాలు చేస్తున్న వారైనా, ప్రోత్సాహిస్తున్నవారైనా ధర్మం తప్పినట్లు కుల సమాజం భావిస్తున్నది. హంతకులుగా మారుతున్న రక్తసంబంధికులెవరూ తాము చేసింది తప్పనుకోరు. పైగా తాము కుల ధర్మాన్ని కాపాడటానికి చేశామని గర్వంగా ఫీల్ అవుతుంటారు. తాము చేసింది తప్పని పశ్చాతాపం వెల్లడించిన వారు బహు అరుదు.
భారతదేశంలోని కుల వ్యవస్థను లోతుగా అధ్యయనం చేసిన ప్రముఖ విదేశీ, స్వదేశీ సామాజిక శాస్త్రవేత్తలంతా కుల వ్యవస్థ కొనసాగింపులో స్వకుల వివాహాల పాత్రే కీలకమెలాగో చెప్పారు. బాహ్య వివాహాలు(తమ కులాలు కాకుండా బయటి కులాల నుండి) ఒక నియమమైతే కుల వ్యవస్థే మిగలదంటారు అంబేద్కర్.
ప్రపంచంలో మన భారతీయ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్న ఈకుల వ్యవస్థను నిర్మూలించడానికి మహౌద్యమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. జరగాల్సిన మహౌద్యమంలో కీలకమైన కులాంతర వివాహాలు చాలా పరిమితంగా జరుగుతున్నాయి. ఎవరో కొందరు కులాలకతీతంగా ప్రేమించుకొని తెగించి వివాహాలు చేసుకొన్నవారు దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు గురవుతున్నారు. ఈమధ్య జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఎవరికైనా ఈ విషయమే బోధపడుతుంది.
పరువుహత్యలు కావు... కులోన్మాదహత్యలు
ఈ దుర్మార్గ కులోన్మాద హత్యలను నిరసించాలి, అసహ్యించుకోవాలి, ఖండించాలి, హంతకులను సమాజం వెలివేయాలి. నాగరిక సమాజం ఏదైనా చేయాల్సందిదే. కాని ఈ అమానుష చర్యలు ఎలా తప్పో చెప్పి, వాటిని ఖండించాల్సిన మేధావులే తమలో కులతత్వం నింపుకొని విద్రోహకర పాత్రనిర్వహిస్తున్నారు. తమ ఆత్మగౌరవం, పరువు కాపాడుకోవడానికే హత్యలను చేయాల్సివస్తుందని, హంతకుల పట్ల సానుభూతి కలిగించడానికి, బాధితుల పట్ల అసహ్యత పెంచడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కని, పెంచి, చదివించి, ప్రయోజకులను చేస్తే ప్రేమ దోమని తల్లిదండ్రులకు ద్రోహం చేయడం న్యాయమా? అంటూ హంతకులను సమర్థిస్తూ టీవీలలో చర్చలు, పేపర్లలో రచనలు, సినిమాలలో డైలాగుల ద్వారా చెప్పించడం తెలిసిందే. ''పరువు హత్య''ల పేరిట కులోన్మాదులు చేసే హత్యలను ప్రశంసిస్తారు. పరువును కాపాడటానికి అనివార్యంగా హత్య చేయాల్సివచ్చిందని, అవి సమర్థనీయ మైనవన్నట్లుగా ప్రచారం చేస్తుంటారు.
స్వకులవివాహాలు మాత్రమే చేసుకోవాలని, అదే ధర్మమని, ఆ ధర్మాన్ని ఉల్లఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్షలు విధించాలని మన ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఈ అమానుష హత్యలన్నిటికీ కారణం ఈ మనుధర్మశాస్త్రాల ప్రభావమేననడం అతిశయోక్తి కాదు. వీటిని విడి విడిగా చూడకూడదు. ఈ హత్యలన్నీ చేయించేది వేల సంవత్సరాల మన దుష్ట సంస్కృతే. ఈ హత్యలన్నీ ఈ దుష్ట సంస్కృతి ఫలితమే. ఇది వందల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో ఇంకి పోయింది. ప్రతి మనిషిలో నరనరాన జీర్ణించుకొని పోయింది. మన సంస్కృతి అన్నా, హిందూ సంస్కృతి అన్నా, బ్రాహ్మణీయ సంస్కృతి అన్నా మనువాద సంస్కృతే. ఈ మనువాదానికి పుట్టిన బిడ్డే ఈకులవాద సంస్కృతి. మనుషుల మధ్య శాశ్వత అడ్డు గోడలు సృష్టిస్తూ అంటరాని తనం, వివక్షలపేరిట అత్యధికులను తరతరాలుగా పశువుల కంటే హీనంగా చూస్తున్నది ఈకుల వ్యవస్థే. దీనిపై పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది.
- జి.రాములు
సెల్:9490098006