Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ జిల్లా, ఖిలావరంగల్ మండలం జక్కలోద్ది భూముల రగడ కొత్తదేమీ కాదు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములపై ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ఆ పోరాటంలో ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆనాటి తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్రస్తుత వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లతో పాటుగా మరో 34మంది... అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జక్కలోద్దిలో ఆక్రమణకు గురైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఉద్యమాలు నడిపితే ఆ ఉద్యమానికి రైతు సంఘాలు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఆ సందర్భంగా ప్రభుత్వం ఆ 34మందిపై కేసులు పెట్టగా, ఆ కేసులో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ1గా ఉన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏ7గా ఉన్నారు. కానీ ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదూ, పేదలకు పంచనూలేదు. కానీ, ఈ ''పెద్ద మనుషులే'' తిరిగి ఆ కబ్జాకోరులకు అనుకూలురుగా మారిపోయారు. చివరికి ఈ పెద్దమనుషులూ, ఆ కబ్జాకోరులూ అంతా కలిసి ప్రస్తుత అధికారపార్టీ టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అండ. అందుకే ఈ భూములపై ఇండ్ల స్థలాలు కావాలని పేదలంతా ఉద్యమిస్తుంటే, ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. అరెస్టులు చేస్తున్నది. అక్రమ కేసులు పెడుతున్నది.
వరంగల్ నగరానికి మొదటిసారి గెలిచి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ నగరాన్ని గుడిసెలులేని నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. ఇంటిస్థలం అవసరంలేదు, నేనే స్థలం కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానన్నారు. కానీ వరంగల్ నగరంలో నేటికీ సుమారు 40వేల కుటుంబాలు గుడిసెల్లోనే నివసిస్తున్నాయి. ఇక్కడి పేదోడి గుడిసెలేవీ భవంతులుగా మారలేదు. కానీ, పభుత్వం మాత్రం మాట మార్చింది. పోనీ ఈ గుడిసెలను రెగ్యులరైజేషన్ చేయడానికి తీసుకు వచ్చిన జీఓ58 అయినా అమలు చేసారా అంటే అదీ లేదు. ఇదీ వరంగల్ నగరంలో ఉన్న గుడిసె వాసుల దుస్థితి. ఇదిలావుంటే, ఈ నగరంలో కిరాయి ఇండ్లల్లో నివసిస్తున్న సుమారు రెండు లక్షల మంది పేదలు, కిరాయిలు కట్టలేక కిందామీదా పడుతున్నారు. వీరంతా ఇంటిస్థలం కావాలని కోరుతూ, గడిచిన ఎనిమిది సంవత్సరాల నుండి అనేకమార్లు అర్జీలు పెట్టుకుంటే వాటన్నిటినీ బుట్ట దాఖలు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వామపక్షపార్టీలు, ప్రధానంగా సీపీఐ(ఎం) నగరంలో ఇంటి స్థలంలేని పేదల కుటుంబాలపై సర్వే చేస్తే ఆ సంఖ్య లక్షల్లో ఉందని తేలింది. కమ్యూనిస్టులు ఈ సమస్యను అనేకసార్లు దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుండి ఉలుకూ పలుకూ లేదు. అందుకే వరంగల్ నగరం మరోసారి, 15 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండ్లస్థలాల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో ప్రజలు ప్రభుత్వ భూములను గుర్తించారు. సమరభేరీ మోగించారు. ఇప్పుడు నగరంలో సుమారు పది కేంద్రాల్లో ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది.
ఈ అన్ని కేంద్రాల్లో జక్కలొద్ది ప్రధాన కేంద్రంగా మారింది. మే 8 ఉదయం 10 గంటలకు పేదలంతా వచ్చి ఎర్రజెండాలు పాతి గుడిసెలేసుకున్నారు. 38రోజులు గడిచిపోయాయి. ప్రభుత్వం మొదటినుంచీ ఈ భూముల నుండి పేదలను ఖాలీచేయించడానికే అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. జూన్ ఎనిమిదో తారీఖు తెల్లవారుజామున మూడు గంటలకు గాఢ నిద్రలో ఉన్న పేదలపైన బుల్డోజర్లతో దాడి చేసింది. పోలీసుబలగాలు, స్పెషల్ బెటాలియన్ల సహకారంతో గుడిసెలకు నిప్పంటించి తగలబెట్టారు. దీనికి ముందు కరెంట్ కట్‌చేశారు. నీటి సౌకర్యాన్ని బంద్ చేశారు. పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్లను అడ్డంగా వేసి రహదారులన్నీ మూసివేశారు. మున్సిపల్ చెత్తను తీసుకొచ్చి రోడ్లకు అడ్డంగా పోశారు. కొంత మంది రౌడీమూకలను పోగేసి గంజాయి, మత్తుమందు తాగించి, మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున సుపారీ ఇచ్చి పేదలపైన దాడి చేయించారు. బీరు సీసాలు, కత్తులు, కర్రలను ఆయుధంగా చేసుకొని మహిళలు, వృద్దులు అన్న విచక్షణలేకుండా పేదలపై దాడికి పూనుకున్నారు. ఆ నేల నెత్తురోడింది. అయినా ప్రజలు చెదిరిపోలేదు. మరింత ఐక్యంగా నిలబడ్డారు.
ఈ పోరాటానికి మద్దతుగా వస్తోన్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్‌లను మార్గమధ్యంలోనే రాయపర్తి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. స్థానిక సీపీఐ(ఎం) నాయకులను ముందురోజు రాత్రే అక్రమంగా అరెస్టు చేశారు. మరుసటిరోజు కామ్రేడ్ ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి రాములు, ఇతర రాష్ట్ర నాయకత్వ బృందాన్ని, రహదారులన్నీ మూసేసి పోలీసులు అడ్డుకుంటే, ప్రజలు వారు ఏర్పాటు, చేసుకున్న కాలినడక దారిలో తమ పోరాటకేంద్రానికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్బంధాలు ఎంత తీవ్రం చేసినా ప్రజలు మాత్రం పోరాటపటిమను వదలలేదు. పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ, సర్కారువారికి పేదలంటే గిట్టదు కదా... అందుకే ఈ పోలీసు బలగాలు, స్పెషల్ బెటాలియన్లు, రెవెన్యూ అధికారులు, ప్రయివేటు గుండాలను వెంటబెట్టుకొని ప్రజలపై దాడులూ, దౌర్జన్యాలతో గుడిసెలన్నీ నేలమట్టం చేశారు. నిప్పంటించారు. పేదలంతా బోరున ఏడుస్తుంటే అత్యంత దారుణంగా లాఠీలు ఝుళిపించారు. వంటసామాను, మంచాలు, కంచాలను కూడా తీసుకోనివ్వలేదు. తెచ్చుకున్న తిండిగింజలు సైతం మంటల్లో తగులబెట్టారు. ఒక గుడిసెలో 30రోజుల నుండి నివాసం ఉంటున్న ఒక గర్భిణీ స్త్రీ ఓ పసిగుడ్డుకు జన్మనిచ్చింది. పచ్చిబాలింత అన్న కనికరం కూడా లేకుండా మానవత్వాన్ని మరిచి ఆమెను గుడిసెనుండి గెంటి నిప్పంటించారు. సుమారు 1100 మందిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. నాయకులను కార్యకర్తలను అరెస్టులు చేశారు. తిరిగొచ్చిన పేదలందరూ తగలబెట్టిన గుడిసెలను చూసి భగ్గున మండారు. మేము ఈ భూమిని వదలమంటూ ప్రతినబూనారు. మరుసటిరోజే మరోసారి పోలీసులు భారీస్థాయిలో పేదలమీద, మహిళలమీద లాఠీఛార్జి చేశారు. పోలీసు డేరాలు ఏర్పాటు చేసుకొని భూమికి కాపలాగా ఉంటున్నారు. అయినా పేదలు ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తిరిగి భూమిమీదికి రావడం ప్రారంభించారు.
పేదలు 60గజాల జాగా అడిగితే ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వం, వందల ఎకరాల ప్రభుత్వ భూమి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, పలుకుబడి కలిగిన బడాబాబుల చేతుల్లో ఉన్నా చోద్యం చూస్తోంది. ఈ ప్రభుత్వం పేదల పక్షమా? లేక భూ కబ్జాదారుల పక్షమా?
- ఎం. సాగర్
సెల్ 7013805411