Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దెబ్బ మీద దెబ్బ! అమెరికా అధినేత జో బైడెన్‌ను గుక్కతిప్పుకోనివ్వటం లేదు. ఇంటా బయటా ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమించాలో అర్థం కావటం లేదు. 510రోజుల అధికారం తరువాత వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జోబైడెన్ అంటే విముఖత చూపిన వారు అధికంగా ఉండగా సుముఖత వెల్లడించిన వారు గణనీయంగా తగ్గారు. ముఖ్యంగా కుర్రకారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. 2018లో డోనాల్డ్ ట్రంప్‌ను బలపరిచిన కనిష్ట సంఖ్యకంటే బైడెన్ పరిస్థితి దిగజారింది. ఏడాదిన్నరలో ఎంత మార్పు! దీనికి కారణాలు అర్థంగానివేమీ కాదు. రికార్డుల మీద రికార్డులు బద్దలవుతున్నాయి. 2021మే నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 0.1శాతం కాస్తా ఏడాది తిరిగే సరికి 8.6శాతానికి పెరిగి నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. ఇది నవంబరులో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీని దెబ్బకొట్టేదిగా మారిందన్న వార్తలు అధికారపార్టీని కలవరపెడుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో మెజారిటీ లేకున్నా అధ్యక్షుడి అధికారాలకు ఎలాంటి ఢోకా ఉండదు గానీ, ప్రతిపక్షంతో ప్రతిదానికీ తలనొప్పి తప్పదు. రెండు సంవత్సరాల క్రితం కరోనాను నిర్లక్ష్యం చేసిన డోనాల్డ్ ట్రంప్ జనాగ్రహానికిగురై రెండవ దఫా ఎన్నికల్లో మట్టికరిచాడు. ముందుచూపులేని బైడెన్ ఏలుబడి ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో తెలియదు.
మన దేశంలో ద్రవ్యోల్బణానికి జనం దగ్గర వస్తులు కొనడానికి కొనుగోలుశక్తి లేకపోవటం ఒక ప్రధాన కారణం. కాగా అమెరికాలో దానికి విరుద్దంగా కొనుగోలు చేద్దామంటే సరకులు లేకపోవటం అన్నది గమనించాలి. కరోనా కాలంలో కోట్లాది మందికి ఉపాధిలేక అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యానికి లోనైంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం భయపెడుతోంది. 1991-2019 కాలంలో వార్షిక ద్రవ్యోల్బణం సగటున నెలకు 2.3శాతం ఉండగా కేవలం నాలుగు సార్లు మాత్రమే మధ్యలో ఐదుశాతాన్ని తాకింది. తాజా పరిస్థితికి ఉక్రెయిన్ సంక్షోభం కూడా ఒక కారణమే. దానికి పూర్తి బాధ్యత బైడెన్‌దే. ఆ వివాదాన్ని కొనసాగించి రష్యాను దెబ్బతీయాలని చూస్తే అది తన మెడకే చుట్టుకుంది. వడ్డీరేట్లు పెంచినా అదుపుకావటం లేదు. వృద్ధి రేటును దెబ్బతీసి కొత్త సమస్యకు బీజం వేస్తోంది. 1994 తరువాత తొలిసారిగా 0.75శాతం ఒకేసారి వడ్డీ రేటును పెంచుతూ బుధవారంనాడు ప్రకటించారు. ట్రంప్ ఏలుబడిలో చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి విరామం పలికితే ఎలా ఉంటుందని బైడెన్ అడిగినట్లు వార్తలు. చైనా వస్తువులపై ఎడాపెడా ట్రంప్ విధించిన దిగుమతి పన్నులను తగ్గిస్తే లేదా రద్దు చేస్తే ఒకటి నుంచి ఒకటిన్నరశాతం వరకు ద్రవ్యోల్బణం తగ్గవచ్చని అంచనా. చైనా వస్తువులపై అమెరికా పెంచిన దిగుమతి పన్నుల కారణంగా అక్కడి కార్పొరేషన్లు జనం మీద 1.7లక్షల కోట్ల డాలర్ల భారాన్ని మోపాయి, ఇది ఏటా ప్రతి కుటుంబం మీద పదమూడు వందల డాలర్ల ఖర్చును పెంచింది. వీటిని రద్దు చేసినా, తగ్గించినా చైనాకు లొంగిపోయినట్లు రిపబ్లికన్లు దాడి చేసే అవకాశం ఉంది.
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు జవజీవాలను కల్పించేందుకు - అది కార్పొరేట్ల కోసమే కావచ్చు - అమెరికా ప్రభుత్వం 5.4లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. వాటిలో జనానికి నేరుగా అందించిన నగదు కూడా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదలలో దీనివాటా మూడుశాతం ఉందని అంచనా. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత డిమాండ్‌ను పెంచటం, తగినన్ని సరఫరాలు లేకపోవటం, ఉక్రెయిన్ వివాదం కారణంగా రికార్డు స్థాయిలో చమురు ధరల పెరుగుదల, ఒకటేమిటి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు అనేక అంశాలు ఈ పరిస్థితికి దోహదం చేశాయి. తాత్కాలికంగా ఇబ్బందులంటే కామోసనుకున్నాం గానీ చూస్తుంటే పరిస్థితి అలా లేదని అమెరికన్లు భావిస్తున్నట్లు వార్తలు. ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు రెండుశాతానికి అదుపు చేస్తామని చెబుతున్న మాటలను ఇప్పుడెవరూ నమ్మటం లేదు. అనుకున్నదాని కంటే పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులే చెబుతున్నారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి కొట్టుకున్నట్లుగా ఇప్పుడు అగ్రరాజ్యం పరిస్థితి ఉంది. ప్రపంచానికి ఆర్థిక పాఠాలు చెప్పే అమెరికన్లు తమకు ఎదురుకానున్న ముప్పును ఎందుకు పసిగట్టలేదన్నది ప్రశ్న.