Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు ఉపాధ్యాయులకు బాగా గౌరవం లభించేదని, వారు బాగా పని చేసేవారని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు కన్పించడం లేదని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే వారి అభిప్రాయాలు పూర్తిగా ఒప్పని గానీ, పూర్తిగా తప్పనిగానీ చెప్పడం లేదు. ఒక అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉపాధ్యాయులు సంధికాలంలో ఉన్నారు. ఇక్కడ వారు తీసుకునే జీతభత్యాల గురించి చర్చిండం లేదు. ఆధునిక సమాజంలో వారు పోషించాల్సిన పాత్ర గురించి మాత్రమే చర్చ. ఉపాధ్యాయులకు ఇప్పటివరకు రెండు సంధి కాలాలు వచ్చాయి. (ఇక్కడ సంధి కాలం అంటే ఒక సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితుల నుంచి మరో సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితుల వైపు అడుగుపెట్టే దశ).
తొలి సంధికాలం(1960-1990)
ఈ కాలంలో పాఠశాలలు 95శాతం పైగా ప్రభుత్వ రంగంలో ఉండేవి. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు కూడా లేవు. ఉపాధ్యాయుడిని బతకలేక బడిపంతులు అనేవారు. ఉపాధ్యాయులలోఎక్కువ మంది పనిచేసే గ్రామాల్లోనే ఉండేవారు. గ్రామాల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉండేవారు. అందువల్ల ఏ చిన్న పనికైనా గ్రామస్థులు ఉపాధ్యాయులపైనే ఎక్కువగా ఆధారపడేవారు. పాఠశాలలకు ఎక్కువగా ఉన్నత వర్గాల పిల్లలే వచ్చేవారు. గణితం, తెలుగు సబ్జెక్టులలో ఎక్కువ బోధన జరిగేది. కూరగాయలు, బియ్యం తదితర వ్యవసాయ ఉత్పత్తులు రైతుల నుంచి ఉపాధ్యాయులకు అందేవి. పాఠశాలల్లో పెద్దగా మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. దాతల నుంచి స్పందన బావుండేది. కార్పొరేట్ పాఠశాలల సంస్కృతి లేదు. నిమ్నవర్గాల వారు అప్పటికి ఇంకా చదువుకు దూరంగానే ఉన్నారు. మిగతా రంగాలు పెద్దగా అభివృద్ధి చెందని రోజులవి. ఉపాధ్యాయులకు పెద్దగా బదిలీలు ఉండేవి కావు. 1990 తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి. ప్రయివేటు రంగం ఊపందుకుంది. తొలిసారి 1990లో సంధికాలాన్ని ఎదుర్కొన్నారు. ఇతర రంగాలు బాగా అభివృద్ధి చెందడంతో యువత ఉపాధ్యాయ రంగం వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సంధి కాలంలో ఉపాధ్యాయులకు జీతాలు పెంచాలని వివిధ కమిషన్లు సూచించాయి.
రెండవ సంధికాలం(1990-2020)
ఈ కాలంలో అనేక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపట్టడం ప్రారంభమైంది. సబ్జెకుల సంఖ్య పెరిగింది. ఉపాధ్యాయులు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లారు. బదిలీలు తరచుగా జరిగేవి. అనేక మంది చేసిన పోరాటాల వల్ల ఉపాధ్యాయులకు హక్కులు వచ్చాయి. ఉద్యోగ భద్రత వచ్చింది. వారిలో పోటీతత్వం పెరిగింది. పాఠశాలల్లో పెరిగిన సౌకర్యాల వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరోవైపు ప్రయివేటు రంగం విస్తరించింది. పెద్ద సంఖ్యలో ప్రయివేటు స్కూల్స్ ఏర్పడ్డాయి. కార్పొరేట్ సంస్కృతి పెరిగింది. 2010 తర్వాత క్రమేణా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం మొదలైంది. బోధనలో వివిధ పద్ధతులు వచ్చాయి. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి పాలకుల ఆశాస్త్రీయ విధానాలు ప్రధాన కారణంగా మారాయి. విద్యా రంగానికి నిధుల కేటాయింపు తగ్గింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో బోధనా రంగంలో పలు మార్పులు వచ్చాయి. ఆన్లైన్ విధానానికి ప్రాముఖ్యత పెరిగిపోయింది. పేద విద్యార్థులకు దీని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. విద్యపై పెట్టే ఖర్చుని వృథా అని పాలకులు భావించరాదు. విద్యాలయాలు ఆదాయ కేంద్రాలు కాదు, భావి తరాలను తయారు చేసే కేంద్రాలని గుర్తించాలి. ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తులుగా ఉండరాదు. విద్యార్థులలో వివిధ రకాల క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. మంచి చెడులని బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఇవ్వాలి. విద్యా రంగంలో ఫలితాలు రావాలంటే దీర్ఘ కాలం పడుతుంది. అందుకే హడావుడి నిర్ణయాల వల్ల విద్యారంగంలో ఆశించిన ఫలితాలు పొందలేం. ఉపాధ్యాయులు కూడా సమాజంతో మరింత మమేకం కావాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు అటు పాలకులు నిర్ధేశించిన విద్యా లక్ష్యాలను, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలనూ నెరవేర్చాలి. ఈ సంధి కాలాన్ని ఉపాధ్యాయులు అధిగమిస్తారని ఆశిసిద్దాం.
- ఎం. రాం ప్రదీప్, సెల్: 9492712836