Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత యువతరానికి అగ్నిగుండాన్ని తయారుచేస్తున్నట్టు కేంద్రప్రభుత్వ ''అగ్నిపథ్'' ప్రకటన స్పష్టం చేస్తున్నది. మిలిటరీ నియామకాల్లో యువతను నియమించుకోవడం కోసం పదిహేడున్నరేండ్ల నుంచి ఇరవయ్యొకటిన్నరేండ్ల వయసు కలిగిన పిల్లలందరూ అర్హులంటూ, అట్లాం టివారికి భారతసైన్యంలో అవకాశం కల్పించి నాలుగేండ్ల పాటు ఉపాధి కల్పించి, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి సాగనంపే ఒక కొత్త పథకానికి ''అగ్నిపథ్''గా నామకరణం చేస్తూ, వారందరినీ ''అగ్నివీరులు''గా పేర్కొంటూ కేంద్రం 45వేల ఖాళీలను ప్రకటించింది. అయితే నాలుగేండ్లకాలం మాత్రమే ఉపయోగించుకునే ఆలోచనలోని మతలబే మిటన్నదే ప్రశ్న! ఇరవైరెండేళ్ళు దాటితే ముసలి వాళ్ళవుతారా? సైనికులుగా పనిచేయడానికి పనికిరారా? కేవలం ఆరుమాసాలు మాత్రమే శిక్షణపొందే మైనర్లు, అప్పగించబోయే విధి పట్ల అవగాహన ఎలా కుదుర్చుకుంటారు? ఈ ప్రకటన ఎలా ఉన్నదంటే, దేహదారుఢ్యం గల చిన్న పిల్లలను కేవలం మానవరూపంలోని ఆయుధాలుగా ఉపయోగించుకుని, వారిలో పరిపక్వత రాగానే వదిలించుకోవాలనే ఉగ్రవాదసంస్థల ఆలోచనలా కనిపిస్తున్నది! ఈ నియామకాల సందర్భంగా ఆరు నెలలు ఇచ్చే ట్రైనింగ్ కూడా నామమాత్రమేనని చెప్పకనే చెబుతున్నారు. మిలిటరీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న యువతకు ఇకపై దీర్ఘకాలిక సర్వీసు, రిటైర్మెంట్ తరువాత లభించే పెన్షన్సదుపాయాల వంటివేవీ ఉండవని కూడా ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. దీంతో అధికారులనేమో జీవితకాలానికి నియమించుకుని, సైనికులను మాత్రం తాత్కాలికంగా నియమించుకుంటారా అంటూ దేశ వ్యాప్తంగా యువతరంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
యువకులు తమ భవిష్యత్తును తామే భూస్థాపితం చేసుకునేలా ఈ పథకం ద్వారా పాలకులే స్వయంగా ప్రణాళిక వేశారు. నిజానికి 17 ఏండ్ల వయసు పిల్లలు అనగా కేవలం పదవతరగతి లేదా ఇంటర్మీడియట్ మాత్రమే పాసైన వాళ్ళు అని అర్థం. నిరుద్యోగం పెరిగివున్న సమాజంలో ఉపాధి లభిస్తుందంటే పిల్లలు ఎగబడటం మామూలే! అందుచేత ఇలా ఇంటర్మీడియట్ మాత్రమే పాస్ అయిన వాళ్ళని నియమించుకోవడం ద్వారా వారిని పై చదువులకు దూరం చేసే ప్రక్రియ కాదా ఇది? ఏడాదికి నాలుగులక్షల ఎనబైవేల(4,80,000) ప్యాకేజీతో పాటు, నాలుగేండ్ల తర్వాత దాదాపు పదకొండులక్షల దాకా కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు! ఉపాధి దొరుకుతుందనే ఆశతో పైచదువులు చదువుకోకుండా ఈ ఉద్యోగాల్లో చేరి, నాలుగేండ్లు సైన్యంలో పనిచేసి, ఆ తర్వాత రిటైర్ అయ్యి, పెన్షన్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన తర్వాత వీరందరి పరిస్థితి ఏమిటి? చాలీచాలని చదువుతో మార్కెట్లో ఎలాంటి ఉపాధి దొరుకుతుంది వీరికి?
ఇలా పదవీ విరమణ పొందిన వారిలో 25శాతం మందికి మాత్రమే ప్రత్యామ్నాయ ఉపాధికి అవకాశాలు కల్పిస్తామనీ, మిగతా 75శాతం మంది తమ
మార్గాన్ని తామే వెతుక్కోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తున్నది. 17,18 ఏండ్ల పిల్లలు నాలుగేండ్లు సైన్యంలో పని చేసిన తర్వాత అనగా 22, 23 ఏండ్ల వయసులో అటు చదువును పునః ప్రారంభించలేక, ఇటు గౌరవప్రదమైన ఉపాధిలేక, కేవలం నాలుగేండ్లలో సంపాదించిన ఆ పదకొండు లక్షల డబ్బుతో ఎలా జీవించాలి?! ఈలా రొటైర్ అయిన వారివల్ల ప్రతి ఏటా నిరుద్యోగుల సఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న సైనికులకు అనేక చోట్ల క్వార్టర్స్ సదుపాయాన్ని కల్పించి కుటుంభంతో సహా ఉండే అవకాశాన్నిచ్చారు. ''17.5-22 ఏళ్ళ వయసున్న వాళ్ళైతే పెళ్ళిల్లు కావు కాబట్టి క్వార్టర్లు కల్పించే ఆ ఖర్చు కూడా వుండదు'' అనే ఉద్దేశం ఈ పథకం వెనక లేదని చెప్పలేం. ఒక్క సారి ఎన్నికైతే చాలు జీవితకాలం రాజభోగం అనుభవించే సదుపాయాలేమో రాజకీయ నాయకులకు..! దేశాన్ని కాపాడే సైనికులకేమో ఈ దుస్థితి...! ఇదేనా వీరి దేశభక్తి...? కేంద్రప్రభుత్వం ''ప్రతిష్టాత్మకంగా'' భావించి ఇరవైతొమ్మిది కార్మికచట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చి అమలుకు సిద్ధంగా ఉంచడంలోనూ సారాంశం ఇదే. అంటే, కేంద్రం 'ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్' అనే మొదటి బాంబును ఏకంగా సైన్యంలోకే విసిరిందన్నమాట. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు కేవలం యుక్తవయసులో ఉన్నవాళ్లను మాత్రమే నియమించుకొని, ఓ పదిపదిహేను సంవత్సరాలు చేయించుకుని ఇంటికి పంపిస్తూ, వారి భవిష్యత్తుకు ఎలాంటి పూచీలేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఉపాధి కల్పించవలసిన కేంద్రప్రభుత్వమే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ అనే పేరు పెట్టకుండానే కేవలం నాలుగేండ్ల కోసం అత్యంత
విలువైన యువశక్తిని వాడుకొని వదిలేయాలని చూస్తున్నది. ఇది చాలా దారుణం. జూలై ఒకటవ తారీఖు నుండి కొత్త కార్మిక చట్టాలు అమలు జరగబోతున్నాయని గత పక్షంరోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ ఒప్పందం నియామకాలకు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. రక్షణరంగానికి కేటాయిస్తున్న బడ్జెట్లో సగానికిపైగా జీత భత్యాలు, పెన్షన్లకే ఖర్చవుతుందని, పరోక్షంగా సైనికులను అవమాన పరుస్తున్న వార్తలను ప్రచారం లో పెడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌తో కలుపుకొని మొత్తం 14 లక్షల మంది పని చేస్తున్న భారత డిఫెన్స్ సెక్టార్ ప్రపంచంలో రెండోది. భారత్ కేటాయిస్తున్న బడ్జెట్ ప్రపంచంలో మూడవది. ఏడు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశం, అన్నింటికి మించి దాయాదులతో అనవసరపు కయ్యానికి ఆజ్యం పోస్తున్న సందర్భంలో రక్షణ వ్యయం బాగా పెరిగిన మాట వాస్తవమే. రాజకీయ విధానాన్ని సరిదిద్దుకోకుండా రక్షణఖర్చును పెంచుకుంటూ దానిని అమలు జరిపే అమాయకులైన సైనికుల పొట్ట కొట్టే ఆలోచన చేయడం అత్యంత దారుణమైన విషయం. యువకులైన సైనికులను నియమించుకోవడంలో తప్పులేదు కానీ, వారి భవిష్యత్తును అంధకారంలో వేసేలా పెన్షన్ లేకుండా, ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా పంపించేయడం అమానుషం. కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి విధానానికి చొరవ చూపినప్పుడు ప్రైవేటు సంస్థల సంగతేంటి? పుష్కలంగా లభించే మానవ వనరును సుధీర్ఘకాలం పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో వినియోగించడానికి సరైన ప్రణాళికలు వేయాల్సింది పోయి, ఇలా యువతరం భవిశ్యత్తును అంధకారంలోకి నెట్టే నిర్ణయాలు చేయడం మానవత్వంలేని, మితిమీరిన పెట్టుబడిదారీ ఫాసిస్టు వ్యవస్థలోనే సాధ్యం.
- జి. తిరుపతయ్య
9951300016