Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ ప్రధానిగా నరేంద్రమోడీ ఎనిమిదేళ్ళ కాలం పూర్తయింది. ఈ సంవత్సరం తరువాత కొన్ని రాష్ట్రాలకు జరుగనున్న శాసనసభ ఎన్నికలను (ముఖ్యంగా గుజరాత్ రాష్ట్ర ఎన్నికలను) దష్టిలో ఉంచుకొని ఈ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ వార్షికోత్సవానికి గుర్తుగా (మే 30 నుండి జూన్ 15 వరకు) ''సేవ, సుపరిపాలన,పేదల సంక్షేమం'' అనే మూడు నినాదాలను ప్రకటించింది.
ఈ మూడు నినాదాలను పాలక పార్టీ ఎంపిక చేయడం దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుంది. ఎనిమిది సంవత్సరాల కాలంగా, మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పోరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ప్రభుత్వాలు, పాలకవర్గాల పనులను చక్కబెట్టే కార్యనిర్వహక కమిటీలన్న విషయం మనకు తెలిసిందే కానీ, పెట్టుబడిదారుల కోసం ఇంత నిస్సిగ్గుగా పనిచేసిన ప్రభుత్వాన్నీ మనదేశం గతంలో ఎన్నడూ చూడలేదు.
సుపరిపాలన : ధనికులకు అనుకూలమైన చట్టాలు
కార్మికచట్టాల రద్దు : ఇంతకు ముందున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 2019, 2020లలో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కార్మిక చట్టాలలో విలీనం చేశారు. ఇంతకుముందు కార్మికులకు కొద్దిపాటి రక్షణలైనా కల్పించిన చట్టాలను ఈ కొత్త చట్టాలు ధ్వంసం చేస్తున్నాయి. అనేక అంశాలలో ఈ నూతన చట్టాలు యాజమాన్యాలకు సర్వహక్కులను కల్పిస్తున్నాయి. కొత్త చట్టాల కింద రూపొందించాల్సిన నియమనిబంధనలు ఇంకా సిద్ధం కాలేదు, వాటి గురించి రాష్ట్ర ప్రభు త్వాలు ఆలోచించి అమలు చర్యలు చేపట్టాలి. కానీ అనేక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త చట్టాల అమలును ఆర్డినెన్సుల ద్వారా అప్పుడే ప్రారంభించాయి. ఈ కొత్తచట్టాల అమలు ఉద్యోగాల అభద్రతకు, వేతనాల నిలిపివేతకు, పనిపరిస్థితులు దిగజారిపోవడానికి, కార్మికులపై పనిభారం పెరగడానికి దారి తీస్తుంది.
వ్యవసాయ చట్టాలు
2020లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి మూడు చట్టాలను, విద్యుత్తు చట్టానికి సవరణలను తీసుకొచ్చింది. ప్రభుత్వ ధాన్యం సేకరణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి, రైతులకు కనీస మద్దతుధరను కల్పించే యంత్రాంగాన్ని వదిలించుకోడానికి, కాంట్రాక్ట్ వ్యవసాయ విధానాన్ని అనుమతించడానికి, ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను నిలువ ఉంచి, ధరలు నిర్ణయించడానికి వాణిజ్య వర్తకులకు, గుత్తేదారులకు అనుమతించడానికి, రైతులకు సబ్సిడీ ద్వారా విద్యుత్‌ను అందించకుండా తిరస్కరించేందుకు ఈ చట్టాలు ఉద్దేశించబడ్డాయి. దేశ వ్యవసాయ ఉత్పత్తులను, వాణిజ్య వ్యవస్థను కార్పోరేట్లకు అప్పగించేందుకు చేస్తున్న బహిరంగ ప్రయత్నం ఇది. కానీ ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రైతులంతా ఐక్యంగా పోరాటం చేసిన ఫలితంగా సంవత్సరకాలం తరువాత ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఉనికిలో ఉన్న మార్కెట్ల ద్వారా ధాన్యం సేకరణ వ్యవస్థను రహస్యంగా ధ్వంసం చేసే ప్రయత్నం కొనసాగుతున్నది.
వస్తువులు మరియు సేవల పన్ను(జీఎస్టీ)
ప్రస్తుతం ఉనికిలో ఉన్న పన్నుల విధానాన్ని పూర్తిగా పరిశీలించడం ద్వారా, ఇంతకు ముందు రాష్ట్రాల పరిధిలో ఉన్న పన్నుల అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తెచ్చుకుంది. సంక్లిష్టమైన, కష్టసాధ్యమైన ఈ స్లాబ్ విధానం, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కలుగజేస్తూ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ధ్వంసం చేసింది. అదే సమయంలో, 2017 లో జీఎస్టీని విధించడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్మికశక్తిని ఉపయోగించుకోకుండా వేల సంఖ్యలో చిన్న, మధ్య తరహా కంపెనీలను ధ్వంసం చేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు
బొగ్గుగనుల నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా, రక్షణరంగ ఉత్పత్తుల నుండి ఉక్కు దాకా పెట్టుబడులను నియంత్రించే అనేక నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రభుత్వం అనేక రంగాలలో తలుపులు బార్లా తెరిచింది. తద్వారా ఈ రంగాలను, విదేశీ బహూళజాతి కంపెనీలు స్వాధీనం చేసుకోడానికి దారి సుగమం చేసింది. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధిం చిన మార్పులు, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ప్రైవేటీకరణతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇవి భారతదేశంలో శతకోటీశ్వరులుగా ఉన్న కార్పోరేట్ వర్గాల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమించిందని రుజువు చేసే కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు. ఈ కారణంగానే అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు, కార్పొరేట్లు ప్రధానమంత్రి మోడీపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి.
కార్పొరేట్ల సేవలు, సంక్షేమం
కార్పొరేట్ పన్ను కోత : 2019లో కార్పోరేట్ పన్ను రేటును 30శాతం నుండి 22శాతానికి కోత విధించడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది. అంటే దీని ఫలితంగా, కార్పోరేట్ రంగానికి ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల రూపాయల బహుమతిని అందజేసిందని అర్థం. దీనివలన భారీ పెట్టుబడులు వచ్చి, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్న వాదన తప్పు అని రుజువైంది.
కార్పొరేట్లకు ఇతర పన్ను రాయితీలు
2014-15 మరియు 2020-21 మధ్య కాలంలో మోడీప్రభుత్వం 6.15 లక్షల కోట్ల రూపాయలను కార్పోరేట్ పన్ను చెల్లింపు దారులకు రద్దు చేసింది. ఇది కేంద్ర బడ్జెట్పత్రాలే తెలియజేస్తున్నాయి.
ఋణాల రద్దు
ఎనిమిదేండ్ల క్రితం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి 10.72 లక్షల కోట్ల రూపాయల విలువైన ఋణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు రద్దు చేశాయి. ఇది 2021లో సమాచార హక్కుచట్టం కింద 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఎవరు లాభపడ్డారు? ఈ రద్దైన ఋణాలు పెద్ద మొత్తంలో అంటే 100 కోట్లకు పైగా తీసుకున్న ఋణాలే. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఋణాలు తీసుకుని లాభపడింది కార్పొరేట్ రంగానికి చెందిన పెద్దలే.
పెద్ద ఋణాల ఎగవేతదారులు
పూణేకు చెందిన ఒక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందుకున్న సమాధానం ప్రకారం, 1913మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులున్నారనీ, జూన్ 2020 నాటికి వీరు బ్యాంకులకు 1.46 లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని తెలిపింది. వీరీలో వందకోట్లకు పైగా రుణాలు తీసుకుని ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగవేయాలనుకున్నవారు 264 మంది. వీరు బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం 1,08,527 కోట్ల రూపాయలు. కార్పొరేట్ల లాభాలను పెంచే రాయితీలను ఇవ్వడంతోనే సంతప్తి చెందని మోడీ ప్రభుత్వం, దేశంలోని అత్యంత విలువైన భౌతిక ఆస్తులను వారికి కారుచౌకగా అమ్మడం ద్వారా దేశాన్ని లూటీ చేసే పని ప్రారంభించింది. 2014-15 మరియు 2021-22 మధ్య కాలంలో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను 4.86 లక్షల కోట్ల రూపాయలకు అనేకమంది ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. ఆరులక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు 'లీజ్'(అద్దె)కిచ్చే ప్రయత్నం చేస్తున్నది. 'లీజ్' అని పిలువబడే ఈ చర్య 40 సంవత్సరాల కాలం కొనసాగుతుంది. ఇది 'లీజ్' ముసుగులో జరుగుతున్న అమ్మకం తప్ప మరొకటి కాదు.
ప్రజల సంగతేంటి ?
ఒకవైపు ప్రజలు నిరుద్యోగం, చాలీచాలని వేతనాలు, కుటుంబ బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్న ఆకాశాన్నంటే ధరల లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. 'అచ్చేదిన్', 'సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల'ను ఏలినవారు గాలి కొదిలేశారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని మోడీప్రభుత్వం బాకా ఊదుతుంది. కానీ అనేక సంక్షేమ పథకాలు చాలా పరిమితంగా అమ లవుతున్నాయి, ప్రజాపంపిణీ వ్యవస్థలో 10కోట్ల మంది ప్రజలకు భాగస్వామ్యం లేదు. ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 14శాతం మందికి సంవత్సరకాలంలో సగటు పని దినాల్లో పని చేసే అవకాశం లేకుండా పోయింది. ముద్ర పథకం, ఇతర నైపుణ్య సంబంధిత కార్యక్రమాలకు అందించే అనేక రుణాలు నిరుద్యోగ పెరుగుదలను తగ్గించడంలో విఫలం చెందాయి. రెండు సంవత్సరాల క్రితం కుటుంబ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సబ్సిడీని విరమించుకోవడం, వెయ్యి రూపాయలకు పైగా వెచ్చించి కుటుంబాలు గ్యాస్‌ను కొనుగోలు చేయలేకపోవడంతో ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం వంచనగా మారింది. ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ఎక్సైజ్ సుంకం పెంపుదలను కొనసాగిస్తున్న కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బహుశా ప్రజలు గుళ్ళు, మసీదుల వంటి నినాదాల మాయలో పడి పట్టించుకోర నుకుం టున్నారేమోగానీ, ప్రజానీకం ఈ మోసాన్ని గమనిస్తూ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి సన్నద్ధమవుతున్నారు.
- సవేరా
(''పీపుల్స్ డెమొక్రసీ'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్,
9848412451