Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నలుగురికి నచ్చినది.. నాకసలే ఇక నచ్చదురో.. నరులెవ్వరు నడువనిది ఆ రూట్లో నడిచెదరో' ఇదీ టక్కరి దొంగ సినిమాలోని పాట. కొంత సృజనాత్మకంగా ఆలోచించే టోళ్ల గురించి చెప్పుకోవచ్చు. ఇది ఒక కోణమే. ఇంకో రకంగా ఎడ్డెమంటే తెడ్డెమనేటోళ్ల గురించి కూడా అనుకోవచ్చండి. గీ కోవలోకే బండి సంజరు సారొస్తడు. అంతేగాదు ఆ పార్టీ నేతలూ వస్తరు. ఎందుకంటరా? దేశమంతటా అగ్నిపథ్ పథకం వద్దో లక్కమా అని మిలిటరీ కొలువులకు ప్రిపేరయ్యే పోరగాండ్లంతా నెత్తీనోరూ బాదుకుంటున్నరు. బీజేపీ.. కాంగ్రెస్.. టీఆర్ఎస్ ఈ పార్టీ ఆ పార్టీ పాలిత రాష్ట్ర్రం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఎంతకీ కేంద్ర సర్కారు స్పందించకపోయేసరికి కోపం నశాలానికెక్కి ఆగమాగం జేయబట్టే. బస్సుల అద్దాలు పగులగొడుతున్నరు. రైళ్లకు నిప్పులు పెడుతున్నారు. గింత జరుగుతున్నా.. రోమ్ నగరం తగులబడుతుంటే రాజు ఫిడేల్ వాయించిన చందంగా ప్రధాని మోడీ తన మౌనదీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు.బీజేపీ నేతలేమో మోడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర..బొట్ర అంటూ నిందారోపణలు చేయబట్టే. ఇగ ఎక్కడ మన మైలేజ్ తగ్గుతుందో అనుకున్నడో ఏమోగానీ మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజరు సార్ ఒక్కడుగు ముందుకేసి 'దేశభక్తి ఉన్న యువకులు భరతమాతకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించే గొప్ప పథకం అగ్నిపథ్. ఆర్మీలో చేరాలనుకునే యువకులకు ఇదొక గొప్ప వరం. ఈ విధ్వంసానికి, అగ్నిపథ్ స్కీమ్‌కి ముడిపెట్టి మాట్లాడటం సిగ్గుచేటు. ఇది టీఆర్ఎస్ కుట్ర' అని ప్రకటన ఒదిలేశాడు. గీ ముచ్చట చూసి నాలుగేండ్ల సంది ఇల్లూవాకిలి వదిలి పిజికల్, మెడికల్ టెస్టులలో పాసై సైనిక కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతంతా ముక్కుమీద వేలేసు కుంటున్నరు. అందరిది ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి అన్నట్టు బండి గిట్ల మాట్లాడుతున్నడేందిర బై అని గుస్సా అవుతున్నరు.
- ఎ.ప్రశాంత్