Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య ఏమిటిటంటే పర్యావరణ కాలుష్యం అని టక్కున చెప్పొచ్చు. అంతేనా నిరుద్యోగం, పాలకుల అలసత్వం, కొందరి మీద అతి ప్రేమ, కొందరి మీద పగ, కొందరే కోటీశ్వరులు కావడం, ఎందరో పేదరిక సూచీ కిందికి పోవడం, యుధ్ధాలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసరాల ధరలు పెరగడం ఇలాంటివన్నీ లేవా అంటే ఉన్నాయి. ఐతే వాతావరణం గురించి, మన భూమి ఉనికి గురించి చెప్పుకుంటే పర్యావరణమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. అసలు ఈ భూమి, ఈ భూమి మీద నీరు ఉంటేనే కదా మనమందరం ఉండేది, మన భావి తరాలు జీవించేది అలాంటిది ఈ భూ మండలాన్ని రోజు రోజుకూ వేడెక్కించి, మానవ నివాస యోగ్యం కాకుండా చేసి, ఇతర గ్రహాలపై ఎక్కడన్నా కాస్త స్థలం ఉందేమో అని మానవుడు చేస్తున్న ప్రయత్నాలను చూస్తే నవ్వొస్తుంది కదా!
ఇక అర్జంటుగా భూమి మీద, నదుల్లో, సముద్రాల్లో పేరుకుపోయిన కాలుష్య పధార్థాలను ఏరివేసి వాటిని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావడం మంచిదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో చెబుతున్నారు. చెత్తను సేకరించి దాన్ని రీసైక్లింగ్ అంటే మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావడం ఎలా అని ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, చిన్నా పెద్దా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడచిపోతూనే ఉంటాయి. పనులు ముందుకు రావు. అందుకే అలాంటి చెత్తను ముందు క్లీన్ చేసేయాలని సామాజిక పర్యావరణవేత్తలు చెబుతుంటారు. కాబట్టి భూమి పైన చెత్త ఏ రూపంలో ఉన్నా అది ప్రపంచానికి మంచిది కాదు కాబట్టి దాన్ని వెంటనే శుభ్రం చేసేయాలని తీసుకున్న నిర్ణయం మస్తు మస్తుగా మన ఆలోచనలను ముందుకు తీసుకుపోతుంది. ఈపని ఎప్పుడో చేసి ఉండవలసింది, ఇప్పటికే సమయం ఐపోయిందన్న పరేషాన్ పక్కన పెట్టి ఎలాంటి చెత్తను సాఫ్ చేయాలన్నదానిపై మనం దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్‌కు వేస్టంతా ఒక వైపు, పేపరు, చెక్క ఇలా వివిధ వ్యర్ధపదార్థాలను వేటికి వాటిని వేరు చేసి తిరిగి వాడుకోవడం ఈ రీసైక్లింగ్ ప్రత్యేకత. దాన్ని నిజ జీవితంలో అంటే నిజ రాజకీయ జీవులు ఎలా ఎన్నిరకాలుగా ఈ రీసైక్లుంగును వాడుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం.
అలా క్లీన్ చేయడమేమోగానీ, గూండాలుగా, దందాలు చేసేవాళ్ళుగా, పోలీసు రికార్డుల్లో ఉన్నవాళ్ళను కొద్దిగా క్లీన్ చేసి, ఇంకొద్దిగా వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చి తమ తమ పార్టీల్లోకి తీసుకొని, వాళ్ళకొచ్చిన మాటలతోనే మాట్లాడించి ముందుకుపోవడం చూస్తుంటే మాటలు బూతులు రెండూ ఒకటేనా అనిపిస్తుంది. ప్రజలెటుపోయినా పరవాలేదుగానీ తమ పార్టీ అధికారంలోకి రావాలి, ఈపాటికే వచ్చి ఉంటే సీట్లు పెంచుకోవాలి, అసలు సభలో సీట్లన్నీ మనమే గెలవాలి లాంటి గొంతెమ్మ కోర్కెలు కూడా చూడొచ్చు. ఆ ఎపిసోడ్ మీద కూడా త్వరలో రాసుకుందాం, చదువుకుందాం, అయ్యబాబోరు అని ముక్కు మీద వేలేసుకుందాం. లేదంటే మాస్కు పెట్టుకుందాం నోరు, ముక్కు రెండూ మూసుకుపోతారు. ఎందుకంటే దానివల్ల ప్రయొజనాలు చాలా ఉన్నాయి ఒకటి కాలుష్యం వల్ల చెడు వాసనలు మన ముక్కును చేరవు, కరోనా రాదు, నోరు తెరచి మాట్లాడినా ఎవ్వరికీ సరిగా వినబడదు. ఇప్పుడు కావలసింది నోరు మూసుకున్నవారే, ఏమి చూసినా నోరెత్తని వాళ్ళే అని మన పైనున్న నాయకులు కోరుకుంటున్నారు. అందుకే బుల్డోజరు న్యాయం అమలవుతున్నా నోరుమెదపని వ్యక్తులనేకాదు, పార్టీలను, భావజాలాలను కూడా చూడొచ్చు.
ఒకాయనెవరో గాఢి విజయకుమార్ అంట, గతంలో పోలీసుల రికార్డుల్లో ఉన్నాడని వాట్సప్పుల్లో ఫోటొలు పెట్టి రాశారు, ఇతర సోషల్ మీడి యాలో కూడా. రేరు ఖబడ్దార్, అది మా విజరుకుమార్ది కాదు దాన్ని మార్ఫింగ్ చేసారు, మళ్ళీ ఇలాంటివి పెట్టారో తోలు తీస్తాం అని వాటికి రిప్లై కూడా వచ్చి ఉండవచ్చు. ఫోటోను మార్ఫింగ్ చేయొచ్చు కాని పోలీసు రికార్డులను ఎలా మారుస్తారు అని చెప్పినా ఊరుకోరు. అరే మీ పార్టీలో కూడా రకరకాల దందాలు చేసేవాళ్ళు ఉన్నారు, అసలు మిమ్మల్ని చూసే కద మేము నేర్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఇంకో కేవల్ రెడ్డి లేదా మరొకరు ఇలా రకరకాల పార్టీల్లోకి పోయినోళ్ళను మనం చూడొచ్చు. వీళ్ళను రీసైకిల్ చేసి తమవాడిగా చేసుకున్నోళ్ళను మనం చూడొచ్చు. రాజకీయాలను వదిలేసినా మళ్ళీ తమకు అనుకూలంగా వాడుకోవడానికి వాళ్ళకు మన రాజ్యాంగం వీలు కల్పించింది. అంటే రాజ్యాంగాన్ని వీళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారుగానీ, అదేమీ ఇలా చేయండని చెప్పలేదని గుర్తుంచుకోవాలి. అవేమిటంటే రాజకీయ గౌరవ పదవులు. అప్పుడు ముఖ్యమంత్రులను, మంత్రులను, ప్రతిపక్ష నాయకులను భయపెట్టొచ్చు. ఉద్యోగాలు యువతకేమోగానీ తమ పార్టీ వాళ్ళకు మాత్రం ఇస్తూనే ఉన్నారు. తాక్కాలిక ఉద్యోగాలు కల్పించి అగ్నిపథ్ లాంటి ప్రయోగాలు చేయడం కూడా డబ్బులు మిగిలించుకొని తమ ఇతర అవసరాలకు వాడుకోవడానికే అని కొందరు చెప్పడంలో నిజాలూ ఉన్నాయని మేధావులు చెబుతూనే ఉన్నారు. ఈ రీసైక్లింగ్‌లో ఇన్ని సంవత్సరాలూ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వదిలేసిన వారిని కూడా వాడుతున్నారు. బాగా చదువుకున్నోళ్ళను, ఉద్యోగాలు వెలగబెట్టి ఇంటిదగ్గర కూచున్నోళ్ళను తమకు అనుకూలమైన సందేశాలను తయారు చేయడానికి, ప్రజల మనస్సులను మార్చే ప్రయోగాలు చేయడానికి, ప్రజల దృష్టి మరల్చి తొందరగా, ఇంకా ఇంకా తొందరగా వినాశనం వైపు ఎలా తీసుకుపోవాలో అన్న విషయంలో వాడుకుంటున్నారు. పాపం వాళ్ళకు తెలుసునో లేదో కానీ, మంచికి అనుకొని చెడుకు ఉపయోగపడే వాళ్ళ జాబితాలోకి వాళ్ళు రీసైకిల్ చేయబడుతున్నారు.
అరే ఇదేమీ కొత్త కాదు... ఒక దేశానికి చెందిన క్రికెట్ కెప్టెన్ దేశమంతా తిరిగి క్రీడాకారులను వెతికి మరీ పట్టుకొని టీంలో చేర్చుకుని వరల్డు కప్పు కూడా కొట్టాడు, అందులో భాగంగానే ఒక వీధి రౌడీకి కాస్త బ్యాటింగ్ నేర్పి టీములో చేర్చుకున్నాడు అని కూడా మనకు చెప్పొచ్చు. వాడి పని ఒక్కటే, అదేమంటే బ్యాటింగ్ ఎలా చేసినా అవతలి జట్టు సభ్యుల్ని తన నోటితో, చేష్టలతో పక్కదారి పట్టించడం, విసుగు తెప్పించడం. ఇదేమీ కొత్త కాదు, బాడీ లైన్ బౌలింగ్ లాంటివి చాలా పాతవే అని కూడా కొందరు చెప్పొచ్చు. ఇది మహాభారతం కాలమ్నుండి కూడా వస్తోంది, శల్యుడి లాంటివాళ్ళనూ ఈ పనికే వాడారు అని కూడా ఇంకొందరు చెప్పొచ్చు. మొత్తం మీద చెత్త మనుషుల రూపంలో ఉన్నా దాన్ని రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చునన్నది సారాంశం.
- జంధ్యాల రఘుబాబు
9849753298