Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ సర్కారు 14.6.2022న ప్రకటించిన 3.5ఏండ్ల కురచకాల ఒప్పంద కొత్త సేనా నియామకాల పథకానికి అగ్నిపథం అని, సైనికులకు అగ్నివీరులని సినిమా పేర్లు పెట్టింది. ఈ అగ్నికి అర్థం ఏలికలకే ఎరుక.
పెన్షన్ ఖర్చు తగ్గించటం అగ్నిపథం ప్రాథమిక లక్ష్యం. ప్రభుత్వ సేవకుని పెన్షన్‌కు 20ఏండ్ల సర్వీస్, పూర్తి పెన్షన్‌కు 33ఏండ్ల సర్వీస్ ఉండాలి. ప్రజా ప్రతినిధులు మాత్రం ఒక్క రోజు పనిచేసినా జీవితాంతం పెన్షన్ వస్తుంది. 790మంది ఎంపీలు, 4,121మంది ఎమ్మెల్యేలు, 454మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మాజీ, పూర్వ సభ్యుల సంఖ్యకు లెక్కలేదు. పార్లమెంటు సభ్యుల నెలసరి కనీస పెన్షన్ రూ.25 వేలు. తర్వాతి ప్రతి ఏడాది సేవకు రూ.2 వేలు కలుస్తుంది. ఒకే వ్యక్తి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేస్తే మూడు పెన్షన్లు వస్తాయి. మంత్రికి మంత్రి జీతం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీతం, పెన్షన్ మూడూ వస్తాయి. ఒక సభ్యునికి పెన్షన్, జీతం రెండూ ఇస్తారు. సభకు హాజరేకాని నటులు వైజయంతిమాల, రేఖ, చిరంజీవి, సచిన్ తెండూల్కర్, పారిశ్రామిక వేత్తలు సంజయ్ దాల్మి, రాహుల్ బజాజ్ వంటివారు కూడా పెన్షన్లు తీసుకుంటు న్నారు. పైగా ఈ ఎంపీల జీతభత్యాలు, పెన్షన్లు న్యాయసమ్మతమని 2018లో మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. కానీ సైన్యాని కి మాత్రం న్యాయసమ్మతం కాదన్నమాట!
సైన్యానికి యౌవనరూపాన్నివ్వడం అగ్నిపథం మరో ఉద్దేశ్యమట! నేటి సగటు 32ఏండ్ల కంటే కొత్త పథకంతో చేకూరగల 26ఏండ్ల సగటు ఎంత ప్రయోజనమో? క్రమేపీ యువత, అనుభవజ్ఞుల నిష్పత్తిని 1:1గా మారుస్తారట. యుద్ధంలో శిక్షణ, అనుభవం, నైపుణ్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి. పూర్వపు 1.5ఏండ్ల శిక్షణ కంటే 6నెల్ల శిక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందా? మూడోవంతు శిక్షణతో వృత్తి నైపుణ్య ప్రత్యేక శిక్షణ, సాధన లేని కిండర్ గార్టన్ సైనికులు బ్రహ్మౌస్, పినాక, వజ్ర వంటి అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగలరా?
ఉపాధి కల్పన అగ్నిపథ్ మరో ప్రయోజనమని రాజకీయ ప్రకటన. ఇది నిరుద్యోగాన్ని తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి, సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందట! 50 కోట్ల నిరుద్యోగ పర్వంలో 50 వేల తాత్కాలిక ఉద్యోగాలు ఇంత పని చేస్తాయా? అసమర్థనీయ కోవిడ్ కారణంతో ఆపిన సైనిక ఖాళీలు 1.30 లక్షలు. నేటిదాకా ఏడాదికి 65 వేల సైనిక ఉద్యోగాలు ఇచ్చేవారు. అగ్నిపథంలో ఈ ఏడు 46 వేలు, వచ్చే ఏడాది నుండి 50 వేల మందిని నియమిస్తారు. అంటే ఉపాధి ఏడాదికి 15 వేలు తగ్గింది. మరి పెరిగిందెక్కడీ కుల, మత, ప్రాంత ఆధారిత నియామకాలు రద్దవుతాయని మరో ప్రకటన. ప్రభుత్వం ప్రస్తావించిన రెజిమెంటల్ పద్దతి బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించి అమలుచేసింది. 75ఏండ్ల భారత ప్రభుత్వాలు ఈ పద్ధతి ప్రయోజనాలను గుర్తించాయి. రెజిమెంట్ల, యూనిట్/సబ్ యూనిట్ల పొందిక యుద్ధంలో ప్రధాన ప్రేరణనిస్తుంది. వీటిలో కులమతప్రాంత ప్రాతిపదిక లేదు. ప్రతి రెజిమెంటులో దేశం మొత్తం నుండి అన్ని కులమత పౌరుల నియామకం జరుగుతుంది.
మోడీ నమూనాగా తీసుకున్న ఇజ్రాయిల్ సైన్యంలో ఐచ్ఛిక, నిర్బంధ అని రెండు రకాల సైన్యం ఉంది. నిర్బంధకాలం ఇజ్రాయిల్‌లో మగవారికి 30 నెలలు, స్త్రీలకు 22 నెలలు. దక్షిణ కొరియాలో పదాతి, నావికా, వైమానిక దళాలకు వరుసగా 21, 24, 25 నెలలు. చైనా, అమెరికాలలో నిర్బంధకాలం 2 నుండి 8 ఏండ్లు. రష్యా, బ్రెజిల్‌లలో ఇది 12 నెలలు. 120 రోజుల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శక్తివంతమైన రష్యా చిన్న దేశం ఉక్రెయిన్ పై పూర్తి ఆధిపత్యం సాధించలేక పోడానికి తాత్కాలిక సైన్యమే ప్రధాన కారణం. తాత్కాలిక సైన్యంలో చిత్తశుద్ధి, నిబద్దత ఉండవు. రష్యా పట్టుకున్న శకటాలపై ఈ సైన్యం సోవియట్, కమ్యూనిస్టు జెండాలను ఎగరేసింది. సార్వజనీన నిర్బంధ ఇజ్రాయిల్ ప్రజాసైన్యం అవాస్తవం. ఇజ్రాయిల్‌లో 18ఏండ్ల వారు నిర్బంధ తాత్కాలిక సైన్యంలో చేరాలి. ''సంప్రదాయవాద'' యూదులను, అరబ్-ఇజ్రాయిలీలను ఉద్దేశపూర్వకంగా మినహాయించారు. ప్రజలు సైన్యంలో చేరటంలేదు. చేరేవారి సంఖ్య 35శాతానికి పడిపోయింది. ఇజ్రాయిల్ తన సైనికుల సేవాకాల పరిమితిని తగ్గించింది. 2,500 అధికార పదవులను కోసింది. లక్ష పోరాట యోధులను తొలగించింది. 30శాతం సైనిక సిబ్బందిని తగ్గించింది. జాతీయ నిర్బంధ ఇజ్రాయిల్ రక్షణరంగం ప్రజాప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. చిన్న వృత్తి సైన్యంగా మారింది. అర్హత గల, ప్రత్యేకించి పోరాటశ్రేణి అధికారులు సైన్యం వదిలిపోయారు. ఈ ఇజ్రాయిల్ నమూనా సైన్యం, మన మోడీ ప్రభుత్వ స్వానుకూల అభిలాషితాలోచన. సూత్రబద్దంగా ఇజ్రాయిల్ సైనిక దుర్గతి మనకూ దాపురించగలదు.
ఈ ''అగ్నిపథం''లో 4 ఏండ్ల తర్వాత 25శాతం యోగ్యులు 4ఏండ్ల సేవను కోల్పోయి కొనసాగుతారు. 75శాతం అయోగ్యులు ఇంటికి పోతారు. అంటే ప్రాథమిక నియామకంలో అయోగ్యులను తీసుకుంటారా? ఈ 75శాతం అగ్నివీరులు క్రమశిక్షణతో తర్వాతి తరంలో ఆత్మగౌరవ భావాన్ని నింపుతారట! బీజేపీ కార్యాలయాల భద్రత సిబ్బందిగా అగ్నివీరులకు ప్రాధాన్యతనిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్ఘీయ అన్నారు. ఇదీ అగ్నివీరులకు బీజేపీ ఇచ్చే ఆత్మగౌరవం. సంఫ్‌ు అనుకూలురు సైన్యంలో కొనసాగుతారు. బయటికి వచ్చేవారు సంఫ్‌ు అనుబంధ ధర్మసేన, భజరంగ్ దళాలలో శిక్షకులుగా, సభ్యులుగా మారగలరు.
తాత్కాలిక సైన్యం అపాయకరమని, చిత్తశుద్ధి, నిబద్దత ఉండవని, కొద్ది శిక్షణతో, కురచ ఉద్యోగంతో క్రమశిక్షణ అలవడదని, నైపుణ్యత రాదని పలువురు పూర్వ సైనికాధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం వారి సలహాలను పెడచెవిన పెట్టింది. స్వపక్షపాతుల పాఠాలను వినిపిస్తోంది. 12 లక్షల సైన్యంలో 25శాతం (3 లక్షలు) తాత్కాలిక అగ్నివీరులు, 75శాతం (9 లక్షలు) శాశ్వత సైన్యం. ప్రతి ఏడాదీ తీసుకునే 50 వేల తాత్కాలిక సైన్యం నుంచి 25:75 నిష్పత్తి కొనసాగుతుంది. 50:50 ప్రభుత్వ హామీ నెరవేరదు. ప్రస్తుత సైన్యం 17-62 ఏండ్లకు పదవీవిరమరణ చేస్తుంది. ఇప్పుడున్న సైనిక శిక్షణ సౌకర్యాలు 20ఏండ్లలో సైనికులను తయారుచేయడానికే సరిపడటంలేదు. 3.5 ఏండ్ల కాలవ్యవధి అగ్నివీరుల తర్ఫీదుకు చాలుతుందా? సైన్యంలో చేరడానికి కేవలం దేశభక్తి మాత్రమే ప్రేరణ కాదు. మంచి స్థిర జీతభత్యాలు, విశ్రాంత జీవితంలోనూ కొనసాగే సౌకర్యాలు కూడా ప్రేరణ. అదేమిటోగానీ, అత్యంత దేశభక్తులైన మోడీ, అమిత్ షాల జన్మభూమి గుజరాత్ లాంటి రాజకీయ ప్రాధాన్యత గల వాణిజ్యవర్గాల రాష్ట్రాల పౌరులు సైన్యంలో చేరరు. ఇది సైన్యంలో సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తోంది. ఇకపై ''ప్రత్యేక ప్రయోజనాల'' కోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పౌరులు అగ్నిపథంలో ఎక్కువగా చేరతారు! జమ్మూ కశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మత సమతుల్యత తారుమారయినట్లు సైనిక సామాజిక సమతుల్యత కూడా తలకిందులు అవుతుంది. ఊహాకల్పిత లెక్కలతో సైనికబలం పెరగదు. నూతన ఫాసిస్టు జాతీయవాదం కలహాలు సృష్టించి దేశాన్ని చీల్చే అపాయకర అగ్నివీర రాజకీయ సైన్యాన్ని తయారుచేస్తుంది. దేశాన్ని రక్షించే, సమగ్రతసమైక్యతలను కాపాడే సామాజిక దేశభక్త సైన్యాన్ని నిర్మించదు. నిరుద్యోగం నింగికి ఎగసి ప్రజలు ఆకలితో మాడుతున్న దేశంలో దేశభక్తి, జాతీయతల పునరుజ్జీవనం జరగవు.
మోడీ 2013 ఎన్నికల ప్రచారంలో సైనికుల 'ఒక పదవి ఒక పెన్షన్' పథకాన్ని సమర్థించి గెలిచారు. 2022లో పూర్తిగా వెనక్కు తిరిగి 'పదవి లేదు పెన్షన్ లేదు' పథకాన్ని అమలుచేస్తున్నారు. సెల్:9490204545
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
9490204545