Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాదపు వంచనా శిల్పానికి అవధులు లేవు. ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాలలో నయా ఫాసిస్టు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వీటిని ఆయా దేశాలలోని బడా బూర్జువా వర్గం సాకుతోంది (వీళ్ళంతా ప్రపంచ ఫైనాన్సు పెట్టుబడితో జత కట్టారు). ఈ ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను అమలు జరుపుతున్నాయి. అలా అమలు చేయడంలో తమదైన క్రూర విధానాలను పాటిస్తున్నాయి. తక్కిన దేశాల్లో నయా ఫాసిస్టు మూకలు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. తమకు గనుక అధికారం వస్తే అధికారంలో ఉన్న దేశాల్లో నయా ఫాసిస్టు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తామూ అదే విధంగా చేస్తామని తమకు పోషకులుగా ఉంటున్న బడా బూర్జువా వర్గానికి హామీ లిస్తున్నాయి. మొత్తం మీద నయా ఉదారవాద శక్తులకు, నయా ఫాసిస్టు శక్తులకు మధ్య పొత్తు అనేది అన్ని చోట్లా ఉనికిలోకి వచ్చింది.
నయా ఉదారవాదం చాలా కాలం వరకూ ''సమాజంలో ప్రతీ ఒక్కరూ నయా ఉదారవాద విధానాల వలన ప్రయోజనం పొందుతారు. సంపన్నుల దగ్గర ఎక్కువగా పోగుబడిన సంపద అంతిమంగా దిగువకు ప్రవహించి అందరికీ చేరుతుంది'' అని చెప్పి నమ్మబలికి నెట్టుకు వచ్చింది. కాని అటువంటి హామీలతో ప్రజల్ని నమ్మించడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడిన తర్వాత ''సంపద అంతిమంగా ప్రజల వద్దకు ప్రవహిస్తుంది'' అన్న సిద్ధాంతం పట్ల ప్రజల్లో ఏ మాత్రమూ నమ్మకం కలగడం లేదు. ప్రజల్ని నమ్మించడం సాధ్యం కానప్పుడు వారిలో తలెత్తే ప్రతిఘటనను అణచిపెట్టి ఉంచాల్సి వస్తుంది. వారి వ్యతిరేకతను పక్కదోవపట్టించే విధంగా భిన్న మతాల ప్రజల మధ్య, భిన్న తెగల ప్రజల మధ్య, లేదా భిన్న ప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టడం దోపిడీ వర్గాలకు అవసరం అవుతుంది. ఈ పని చేసిపెట్టడానికి వారికి నయా ఫాసిస్టు శక్తుల అవసరం కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి ఘర్షణలను రేపడంలో వాళ్ళు సిద్ధహస్తులు.
నయా ఫాసిస్టు శక్తులతో కూటమి ఏర్పరచడం వలన నయా ఉదారవాద శక్తులకు ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. నయా ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చాక, వారెంతగా నయా ఉదారవాద శక్తుల ప్రయోజనాలను (కార్పొరేట్ల ప్రయోజనాలను) నెరవేర్చడానికి పూనుకున్నా, వాళ్ళు నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడే సంక్షోభాన్ని నివారించలేరు, దాన్నుంచి ఆర్థిక వ్యవస్థను బైటపడేయలేరు. స్థూల డిమాండ్‌ను (ప్రజల కొనుగోలుశక్తిని) పెంచినప్పుడే మార్కెట్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులు చెల్లుబాటు అవుతాయి. అలా స్థూల డిమాండ్‌ను పెంచాలంటే అందుకు ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అటువంటి జోక్యానికి అంగీకరించదు. అలాగే సంపన్నుల మీద పన్నులను పెంచడానికి గాని, ప్రభుత్వం తన బడ్జెట్ యొక్క ద్రవ్యలోటును పెంచడానికి గాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. ఇటువంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం తన ఖర్చు పెంచలేదు. తన వ్యయాన్ని పెంచకుండా మార్కెట్లో డిమాండ్‌ను పెంచే విధంగా జోక్యం చేసుకోలేదు. అందుచేత ఈ నయా ఫాసిస్టు ప్రభుత్వాలు కూడా సంక్షోభం తీవ్రం అయేకొద్దీ ప్రజల్లో తమ పలుకుబడిని కోల్పోతాయి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంక్షోభానికి, దాని పర్యవసానాలకు కారణం ఆ నయా ఫాసిస్టు శక్తులేనని, నయా ఉదారవాద విధానాలలో ఏ దోషమూ లేదని చెప్పి నయా ఉదారవాద శక్తులు తమను తాము కాపాడుకుంటాయి.
ప్రస్తుతం మూడవ ప్రపంచ దేశాల్లో మేధావుల మధ్య ఆర్థికాభివృద్ధి గురించి జరిగే చర్చలను తెరవెనుక నుండి నడిపించేది బ్రెట్టన్‌వుడ్ సంస్థలే. అలా నియంత్రించ గలుగుతున్నందున అవి ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి నయా ఫాసిస్టు శక్తుల పాలనే కారణమన్న ప్రచారం చేయడం సులువుగా సాధ్యపడుతుంది. అటువంటి ప్రచారాన్ని అభ్యుదయకర సిద్ధాంతాలను బలపరిచే మేథావులు కూడా స్వీకరిస్తారు. వారందరూ నయా ఫాసిస్టు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ శక్తులకు వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి వారు తేలికగా ఆకర్షితులవుతారు. నిస్సహాయంగా ఉన్న మైనారిటీల మీద విద్వేషపూరిత ప్రచారం, దాడులు జరగడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలు, శ్రామిక ప్రజల మీద అది సాగించే దాడులు-ఇవన్నీ నయా ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని కూడగట్టే కర్తవ్యాన్ని తక్షణం ముందుకు తీసుకొస్తాయి. అందుచేత వామపక్ష శక్తులలో సైతం కొందరు ఈ ప్రచారాన్ని స్వీకరించే అవకాశం ఉంది. అంతే కాదు, ప్రజల ఆర్థిక కడగండ్లకు కారణం కేవలం నయా ఫాసిస్టు శక్తుల విధానాలేనని నొక్కి చెప్పకపోతే, నయా ఫాసిస్టు శక్తులమీద నేరుగా పోరాడడానికి భయపడుతున్నారనే విమర్శకు తాము గురికావలసి వస్తుందేమోనన్న ఆందోళన కూడా ఈ ప్రచారాన్ని స్వీకరించడానికి దోహదం చేస్తుంది. నయా ఫాసిస్టు శక్తులే ఈ ఆర్థిక సంక్షోభానికంతటికీ కారణం అని గనుక గట్టిగా చెప్పకపోతే అత్యంత దుర్మార్గమైన, అత్యంత విద్వేషపూరితమైన, అత్యంత గర్హనీయమైన ప్రభుత్వాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తమను విమర్శిస్తారన్న ఆందోళన కలిగి, బ్రెట్టన్‌వుడ్ సంస్థల ప్రోత్సాహంతో నడిచే ప్రచారాన్ని సమర్థించడానికి సిద్ధపడతారు.
ఈ క్రమంలో ఎక్కడా నయా ఉదారవాద శక్తులు తెరమీద కనిపించవు. అందుచేత నయా ఫాసిస్టు శక్తులను అధికారం నుండి గెంటివేసినప్పటికీ, ఒక కొత్త ఉదారవాద స్వభావం కల, ఫాసిస్టు లక్షణాలులేని ప్రభుత్వాన్ని ఏర్పరచడం తేలికవుతుంది. అలా ఏర్పడిన ప్రభుత్వాల ద్వారా తమ నయా ఉదారవాద విధానాలను యథావిధిగా కొనసాగించవచ్చు. అలా ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా సంక్షోభాన్ని నివారించలేదు. నయా ఉదారవాద విధానాల్లోనే ఆ సంక్షోభానికి కారణాలు దాగున్నాయి. ఆ విషయం ముందే వివరించాం. అందుచేత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద కూడా ప్రజలకు అసంతృప్తి పెరగక తప్పదు. అప్పుడు మళ్లీ నయా ఫాసిస్టు శక్తులు రంగం మీదకి వస్తాయి. ఆ విధంగా నయా ఫాసిస్టు శక్తులు ఒకసారి, ఉదారవాద రాజకీయ శక్తులు మరొకసారి అధికారాన్ని మార్చుకుంటూ. మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను మాత్రం ఏ ఆటంకమూ లేకుండా కొనసాగించే విధంగా రాజకీయాలు నడుస్తాయి. మరోపక్క శ్రామికవర్గ ప్రజానీకం మాత్రం ఈ సంక్షోభపు కష్ట నష్టాలన్నింటినీ భరించాల్సి వస్తుంది.
ఈ విధమైన రాజకీయాలకు మన భారతదేశమే ఒక సరైన ఉదాహరణ. 2014లో మోడీ మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాడు. అప్పుడే ప్రజలు ఆర్థిక సంక్షోభం తాలూకు కష్టాలను చవిచూడటం మొదలైంది. ఆ కష్టాలన్నింటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వపు చేతకానితనమే కారణమని, అది బలహీనమైనదని ప్రచారం జరిగిందే తప్ప ఆ సంక్షోభానికి నయా ఉదారవాద విధానాలు కారణమన్న వాస్తవాన్ని ఎక్కడా ప్రచారంచేయలేదు. అధికారంలోకి వచ్చాక మోడీ మరింత తీవ్ర స్థాయిలో అదే నయా ఉదారవాద విధానాలను అమలు చేయసాగాడు. నిరుద్యోగం మరింత పెరుగుతూ వచ్చింది. ప్రజల ఆదాయాలు పడిపోతూనే ఉన్నాయి. 2012-13 నుండి 2017-18 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజల తలసరి వినియోగం ఏకంగా 9శాతం పడిపోయిందని నేషనల్ శాంపిల్ సర్వేలో బైటపడినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఆ వాస్తవం ఎంత కుదిపివేసిందంటే ప్రభుత్వం వెంటనే ఆ వార్తను ప్రచురించకుండా నిలిపివేసింది. నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించే విధానాన్నే నిలిపివేసింది. స్వాతంత్య్రం వచ్చిన ఏడాది ప్రఖ్యాతి గాంచిన గణాంక శాస్త్రవేత్త పి.సి మహలనోబిస్ సారథ్యంలో అభివృద్ధి చేసిన సర్వే విధానాన్ని ఆ విధంగా అటకెక్కించారు.
ఇక కరోనా మహమ్మారి పరిస్థితులను మరింత జటిలం చేసింది. అయితే, ఆ మహమ్మారి తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా నిరుద్యోగం తారాస్థాయిలోనే కొనసాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో చెలరేగిపోతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు పెరుగుతున్నాయి. కాని ఆ నిరసనల్లో అత్యధిక భాగం మోడీ విధానాలదే ప్రధాన కారణం అన్నట్టు సాగుతున్నాయి తప్ప వాటిలో ఎక్కడా నయా ఉదారవాద విధానాల ప్రసక్తే కానరావడం లేదు. మోడీ ప్రభుత్వమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన బాధ్యత వహించాలి. అందులో సందేహంలేదు. కాని మోడీ ప్రభుత్వ దోషం అది అత్యుత్సాహంగా అమలు చేసిన నయా ఉదారవాద విధానాల్లో ఉంది. వాటితోబాటు పెద్ద నోట్ల రద్దు వంటి తనదైన స్వంత తప్పుడు విధానాలను కూడా చేపట్టింది. అది వాస్తవం. ఆ నోట్లరద్దు వలన చిన్న ఉత్పత్తిదారులు చితికిపోయారు. ప్రజానీకం నానా అవస్థలూ పడ్డారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేసిన జిఎస్టి కూడా చిన్న ఉత్పత్తుల రంగాన్ని చావుదెబ్బ తీసింది. అయితే ఈ జీఎస్టీ విధానాన్ని ప్రపంచబ్యాంకు ప్రోత్సహించింది. దానిని తొలుత ముందుకు తెచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. ఆ విషయం మరిచిపోకూడదు.
ఈ మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద చట్రం వెలుపల ఎటువంటి విధానాలను అమలు చేసినప్పటికీ, ప్రస్తుత సంక్షోభానికి అటువంటి విధానాలు ప్రధాన కారణం కాజాలవు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయంటే దానికి కారణం నయా ఉదారవాద విధానాలను అమలు చేయడమే. కాని ఏ దేశంలో చూసినా, అక్కడ జరుగుతున్న చర్చల్లో ఎక్కడా ఈ నయా ఉదారవాద విధానాల గురించిన చర్చ కనిపించడం లేదు. శ్రీలంకలో సంక్షోభానికి కారణం రాజపక్స ప్రభుత్వపు తప్పులేనంటున్నారు. ఇండియాలో సంక్షోభానికి కారణం మోడీ ప్రభుత్వపు తప్పులేనంటున్నారు. ఆఫ్రికా దేశాల్లోని సంక్షోభాలకు కారణం ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధమేనంటున్నారు.
సామ్రాజ్యవాదపు వంచనా శిల్పాన్ని ఇక్కడే మనం చూడవచ్చు. ఇప్పడు సామ్రాజ్యవాద శక్తుల పరిస్థితి ''బొమ్మ పడితే గెలుపు నాది, బొరుసు పడితే ఓటమి నీది'' అన్నట్టుంది. పరిస్థితి సానుకూలంగా, నిరాటంకంగా సాగిపోతున్నంత కాలమూ ఆ ఘనత అంతా నయా ఉదారవాద విధానాలదే అని చెప్పుకున్నారు. మొదట్లో వచ్చిన జీడీపీ వృద్ధి అంతా ఆ విధానాల పుణ్యమే అని చాటుకున్నారు. ఇప్పుడు సంక్షోభం ముదిరేసరికి ఆ నేరమంతా నయా ఫాసిస్టు శక్తులదేనని అంటున్నారు. ఆ శక్తులను పైకిఎగదోసింది ఎవరు? ఈ నయా ఉదారవాదులు, సామ్రాజ్యవాదులు కారా? ఆ నయా ఫాసిస్టు శక్తులనే ఉపయోగించి శ్రామిక ప్రజానీకపు ఐక్యతను దెబ్బ తీసి, మెజారిటీ మతస్తులు, మైనారిటీలు అంటూ విభజించి ఘర్షణలను ఎగదోసి, తెరచాటున కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టలేదా? అదే నయా ఫాసిస్టు శక్తులదే మొత్తం పాపం అంతా అన్నట్టు ఇప్పుడు ప్రచారం చేసి తాము తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
'ఘాసీరాం కొత్వాల్' అన్న మరాఠీ నాటకంలో నానా ఫడ్నవీస్ అనే పాలకుడు తన రాజ్యంలో దుర్మార్గపు చర్యలన్నింటినీ తన నమ్మినబంటుగా ఉన్న ఒకడిద్వారా అమలు జరిపిస్తాడు. ఆ నమ్మినబంటు పేరు ఘాసీరాం. తీరా ప్రజలు ఆ దుర్మార్గపు చర్యలను వ్యతిరేకిస్తూ తిరగబడ్డాక ఆ పాలకుడు ఘాసీరాం ను పదవి నుంచి బర్తరఫ్ చేస్తాడు. దాంతో ప్రజలు ఆ పాలకుడిని మెచ్చుకుంటారు. నయా ఫాసిస్టులంతా ఆ ఘాసీరాం లాంటివాళ్ళే. వాళ్ళు అధికారంలో ఉంటే ఒకవైపు నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తూనే, మరోవైపు ఫాసిస్టు చర్యలకు కూడా తెగబడతారు. వారి చర్యలు మితిమీరి, ప్రజానీకం తిరగబడితే, పాలకులు ఆ నయా ఫాసిస్టు శక్తులను అధికారం నుండి తప్పించవచ్చు. ఈ క్రమంలో ఆ పాలకుల నయా ఉదారవాద విధానాలకు మాత్రం ఎటువంటి సవాలూ ఎదురుకాదు.
నయా ఫాసిస్టులను వారు తలెత్తిన కాలం నాటి ఆర్థిక పరిస్థితుల నుండి విడదీసి చూస్తే, నయా ఫాసిస్టు ప్రభుత్వం అనేది వాస్తవానికి నయా ఉదారవాద శక్తుల, నయా ఫాసిస్టు శక్తుల కూటమి ఆధారంగా నడుస్తున్న సంగతి విస్మరిస్తే అది చాలా పొరపాటు. మరీ మఖ్యంగా రాజకీయాలు అనేవి ఆర్థిక విధానాలతో సంబంధం లేనివి అన్నట్టు చూడడం ఒక ఉదారవాద లక్షణం. దానిని పొరపాటున కూడా వామపక్ష శక్తులు అనుకరించకూడదు.
- ప్రభాత్ పట్నాయక్
స్వేచ్ఛానుసరణ