Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటు కానుంది. కొలంబియాలో ఏడు దశాబ్దాల క్రితం 1948 ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి జార్జి ఎలిసెర్ గైటెన్‌న్ను హత్య చేశారు. అప్పటి నుంచి అక్కడ జరిగిన అనేక పరిణామాల్లో వామపక్ష శక్తులను అణచివేశారు. తాజాగా ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి తుది విడత ఎన్నికలలో వామపక్ష, పురోగామి ''చారిత్రాత్మక ఒప్పంద'' కూటమి అభ్యర్థి గుస్తావ్ పెట్రో విజయం సాధించారు. పెట్రోకు 50.5శాతం ఓట్లు రావటంతో విజేతగా ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. తొలి విడత రెండు వారాల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్థి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. ఇప్పుడు రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 47.3శాతం వచ్చాయి.
ఎన్నికల్లో పెట్రో విజయం లాటిన్ అమెరికాలోని ఇతర వామపక్ష పాలిత దేశాలు, ఇతర చోట్ల ఆనందాతిరేకాలతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఏ విధంగానైనా సరే పెట్రోను ఓడించాలని చూసిన అమెరికా, మితవాద శక్తులకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్లరీత్యా పెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. పార్లమెంటులోని ఈ పొందిక రానున్న నాలుగు సంవత్సరాల్లో వామపక్ష ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలను ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. గుస్తావ్ పెట్రోను అభినందిస్తూ వామపక్షాలకు చెందిన అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్, చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్, పెరూ అధ్యక్షుడు పెరో కాజిలో, బొలీవియా అధినేత లూయిస్ ఆర్సీ, మెక్సికో అధినేత లోపెజ్ ఒబ్రాడోర్, వెనెజులా నేత నికొలస్ మదురో సందేశాలను పంపారు.
అనేక లాటిన్ అమెరికా దేశాల్లో మాదిరే కొలంబియాలో కూడా ఉదారవాద విధానాలతో లబ్దిపొందిన శక్తుల పలుకుబడి తక్కువేమీ కాదు. అందుకే ఈ మార్పును కూడా కొందరు విప్లవంగా పిలుస్తున్నారు. తొలిసారిగా దేశ చరిత్రలో ఆఫ్రికన్ సంతతికి చెందిన (ఆఫ్రో-కొలంబియన్) ఫ్రాన్సిమార్క్వెజ్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మానవహక్కుల, పర్యావరణ హక్కుల ఉధ్యమకారిణిగా ఉన్నారు. గుస్తావ్ పెట్రో ఎం19 గెరిల్లాగా 1980 దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజధాని బగోటా మేయర్‌గా పనిచేసి ప్రజల మన్ననలందుకున్నారు. మంచి ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్మికవర్గం, ఇతర సామాజిక తరగతులు పెట్రో మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొలంబియా మితవాద శక్తులు దుర్మార్గాలకు మారుపేరు. వారికి అమెరికా, ఇతర దేశాల మితవాదుల అండదండలు, కార్పొరేట్ల మద్దతు పూర్తిగా ఉంది. ప్రస్తుతానికి విధిలేక పెట్రో గెలుపును అభినందించినప్పటికీ ఎలాంటి కుట్రలకు పాల్పడతారో చెప్పలేం. అనేక లాటిన్ అమెరికా దేశాల్లో అలాంటి పరిణామాలు జరినందున వామపక్ష శక్తులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న పాలకులు పక్కనే ఉన్న వెనెజులాతో శత్రుపూరితంగా ఉన్నారు. తాను అధికారానికి వస్తే సంబంధాలు నెలకొల్పుకుంటానని పెట్రో ప్రకటించారు.
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఫ్రాన్సియా 1981లో ఒక కష్టజీవుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గని కార్మికుడు, తల్లి మంత్రసాని. ఫ్రాన్సియా కూడా బాలకార్మికురాలిగా బంగారు గనిలో పని చేశారు. తరువాత ఇంటిపని కార్మికురాలిగా ఉంది. పదహారేండ్లకే తల్లయింది. ఇద్దరు బిడ్డల తరువాత ఆమె శాంటియాగో విశ్వ విద్యాలయంలో చేరి లాయర్‌గా పట్టా పుచ్చుకుంది. బాల్యం నుంచీ గనుల వాతావరణంలో పెరగటం, గనులు కంపెనీలకు అప్పగించేందుకు అడవుల నుంచి సమీప గ్రామాల నుంచి వేలాది మందిని తొలగించటం, అడవుల నరికివేతను చూసి ఉద్యమకారిణిగా మారింది. గనుల వలన కాలుష్యంగా మారిన ఒక నదిని పరిరక్షించాలని సాగించిన ఆందోళనలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పర్యావరణ నోబెల్ బహుమతిగా ప్రసిద్ది చెందిన గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ బహుమతిని పొందారు. స్థానిక తెగల ఆమోదం లేకుండా అక్రమంగా అనుమతించిన గనుల రద్దు కోరుతూ ఆమె ముందుకు రావటంతో గనుల యజమానుల అండతో ఏర్పడిన సాయుధ ముఠాలు ఆమెను బెదిరించాయి. దాంతో ఆమె 2014లో తన నివాసాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తనతో పాటు బలవంతంగా గెంటివేసిన ఆఫ్రో-కొలంబియన్లను సమీకరించి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని బగోటాకు వచ్చారు. అక్రమ గనుల నుంచి తమ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేశారు. గెరిల్లా సంస్థతో శాంతి చర్చలకు ప్రభుత్వం పూనుకున్నపుడు నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతో మరొకసారి ఆమెను సాయుధ ముఠాలు బెదిరించటమే కాదు హత్యా ప్రయత్నం కూడా చేశాయి. ఆమె మంచి వక్త కూడా. పోరుబిడ్డగా గణుతికెక్కటం, విస్మరణకు గురైన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు, ఆమె సామాజిక తరగతి వంటి అనేక అంశాలు వామపక్ష కూటమిలో ఉపాధ్యక్షపదవికి ఆమెను ముందుకు తెచ్చాయి.
ఎన్నికల ప్రచారంలో ఆమె అర్హత గురించి ప్రత్యర్థులు ప్రశ్నించారు, ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం ఎంత, గుస్తావ్ పెట్రోతో కలసి దేశాన్ని పాలించేందుకు ఉన్న అర్హత ఏమిటి వంటి ప్రశ్నలను తాను అనేక మంది నుంచి ఎదుర్కొన్నానని ఫ్రాన్సియా చెప్పారు. తమను గౌరవప్రదంగా బతకనిచ్చేందుకు తనను ప్రశ్నించిన వారు ఎందుకు అనుమతించలేదు, ఎనభై లక్షల మందిమీద దశాబ్దాల తరబడి హింసకొనసాగేందుకు వారి అనుభవాన్ని ఎందుకు వినియోగించినట్లు, దేశ ప్రజలందరూ శాంతితో బతికేందుకు వారి అనుభవం ఎందుకు పనికిరాలేదని తనలో తాను ప్రశ్నించుకునేదాన్నని ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్పారు. ఎన్నికల్లో విజయం ఖరారైన తరువాత అభిమానులనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో తన విజయాన్ని సామాజిక, మైనారిటీ తరగతుల పోరాటానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఒకవైపు మితవాద - పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాలపాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి, కొలంబియాలో వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హత్యాకాండకు కారకుడు. ప్లాన్ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్ డ్యూక్ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనవారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఆ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది.
ఈ వామపక్ష విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు కొందరు చూస్తున్నారు. లాటిన్ అమెరికాలో వామపక్షాల గెలుపు వాటి భావజాలం మీద ఉన్న అభిమానం కంటే అవి ముందుకు తెచ్చిన ప్రజాకర్షక విధానాల వల్లనే జనం వాటివైపు మొగ్గుతున్నట్లు సూత్రీకరిస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్ అమెరికా దేశాల్లో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్, అమెరికా ఆదేశించిన విధానాలను అమలు జరిపిన పాలకులు... కార్పొరేట్లకు పెద్ద పీటవేసి జనాన్ని విస్మరించిన కారణంగా అక్కడ తలెత్తిన నిరసన, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. అందుకోసం అనేక దేశాల్లో నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా తలెత్తిన సాయుధ తిరుగుబాట్లకు వామపక్ష శక్తులు నాయకత్వం వహించాయి. ఈ ప్రాంత దేశాల్లో ఎంతగా అణచివేతకు పూనుకుంటే అంతగా తిరుగుబాట్లు ఉండటంతో పాలకవర్గాలు మిలిటరీ నియంతలకు బదులు పచ్చిమితవాద శక్తులను, వారికి అండగా కిరాయి మూకలను రంగంలోకి దింపాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రహసన ప్రాయంగా మార్చినప్పటికీ ఎన్నికలకు అవకాశం ఉండటంతో వామపక్ష శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని అధికారాన్ని పొందు తున్నాయి. దశాబ్దాల తరబడి అణచివేత, దోపిడీకి గురైన సామాన్యులకు కావాల్సింది తక్షణ ఉపశమనం. లాటిన్ అమెరికా వామపక్ష శక్తులంటే అవన్నీ కమూ ్యనిస్టు పార్టీలు కాదు. కొన్ని సంస్కరణలతో దోపిడీ నుంచి విముక్తి కలిగించవచ్చని నమ్మేశక్తులు, కొందరు అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే వారు, అణచివేత, దోపిడీ వ్యతిరేక పోరాటంలో వామపక్ష శక్తులకు దగ్గరైన ప్రజాతంత్ర శక్తులూ వాటిలో ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఏకీభావం ఉన్న ఏకైక అంశం ప్రజాస్వామ్యం, కష్టజీవులకు తక్షణ ఉపశమనమే. అందువలన ప్రస్తుతం లాటిన్ అమెరికా వామపక్ష శక్తులు అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేసేవి కాదు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఆ విధానాలకు ఉన్న పరిమితులు అర్థం అవుతున్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే దోపిడీ శక్తులు తమ మౌలిక పునాదులకు ముప్పులేదని భావిస్తున్న కారణంగానే పరిమితంగానైనా సంక్షేమ చర్యలను ఆమోదిస్తున్నాయి. వాటిని కూడా సహించలేని దశ వస్తే లాటిన్ అమెరికా పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288