Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోటెత్తిన వరద పొంగులా యువశక్తి పెల్లుబుకుతున్నది. సరైన చెలియకట్ట లేకపోతే గట్లు తెంచుకుని ఎటువైపైనా ప్రవహిస్తుంది. విద్య - ఉపాధి - సత్సంస్కృతి ద్వారానే యువశక్తిని సరైన దారిలో పెట్టగలం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఎక్కడికక్కడ ఆగ్రహాగ్ని జ్వాలలు రాజేస్తున్నది. భారత సైనిక త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన సైన్యాన్ని నియమించుకోవాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఈ పథకాన్ని ఆదరాబాదరగా తీసుకువచ్చింది.
'ఈ కొంత కాలం కొలువులేంది? అదీ రక్షణరంగంలో... మేం జీవితాలను ఫణం పెట్టేందుకు సైతం వెనుకాడని రీతిలో సైన్యంలో చేరాలన్న ఏకైక లక్ష్యంతో ఏండ్ల తరబడి కఠోర శిక్షణ పొందుతుంటే.. పిడుగుపాటులా ఈ దుర్మార్గం ఏమిటి? పాలకులకు కనీస సోయి ఉండదా? దేశభక్తి అంటూ వేదికలెక్కి రంకెలు వేయడం కాదు కదా... ప్రాణాలర్పించడంకన్నా దేశభక్తి ఏం ఉంటుంది? ఇది మా ఆశలతో, ఆశయాలతో, కలలతో చెలగాటం ఆడటం కాదా..? అని సైనిక ఉద్యోగంకై శిక్షణ పొందుతున్న యువత ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నది. ఇండియన్ ఆర్మీలవర్స్ పేరుతో ఇప్పుడు ఆందోళనకు దిగింది. తక్షణం బేషరతుగా ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కట్టలు తెంచుకున్న కోపావేశాలతో యువత దేశంలో పలుచోట్ల రైళ్ళకు నిప్పుపెట్టింది. బస్‌లను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. బీహార్‌లో అయితే ఏకంగా బీజేపీ కార్యాలయంపైనే దాడి చేసింది. ఇప్పుడు ఈ యువతను ఎలా శాంతపరచాలో తెలియక ప్రభుత్వం తలపట్టుకు కూర్చున్నది.
ఈ పథకం ద్వారా ఎంపికైన వారు నాలుగేండ్లు మాత్రమే సైన్యంలో (ఆ ఉద్యోగంలో) ఉంటారు. ఆ తర్వాత విధిగా బయటకు పోవాల్సిందే. పోనీ ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత వారికి ఏమైనా పింఛన్ గ్రాట్యుటీ ఉంటుందా? అంటే అదీ ఉండదు. సైన్యంలోని భారీ జీతాలు, పింఛన్ సదుపాయాలు ఎగ్గొంటేందుకే కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టిందని మాజీ సైనికాధికారులు విమర్శిస్తున్నారు.
ప్రాణమున్న సైనికుల జీతాలకు జీవనోపాదులకు ఇలా కోతలు విధించి, ప్రాణంలేని ఆయుధ సామాగ్రి కొనుగోళ్ళకు అధిక మొత్తాలు వెచ్చించడం అమానవీయం కాదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.
17 - 21ఏండ్లలోపు వారిని ఈ 'అగ్నిఫథ్' పథకం ద్వారా సైన్యంలోకి తీసుకుంటారు. అలా ఏడాదికి 45వేల మందిని త్రివిధ దళాల్లో రిక్రూట్ చేసుకుంటారు. నెలకు రూ.30- 40వేల జీతం అందిస్తారు. నాలుగేండ్ల తర్వాత కేవలం 25శాతం మందిని మాత్రమే ఉద్యోగంలో ఉంచి మిగిలిన 75శాతం మందిని ఇంటికి పంపిస్తారు. అందుకే అగ్నిపథ్ పధకాన్ని తక్షణమే రద్దుచేసి, సైన్యంలో రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ పథకం వలన సాయుధ దళాల శక్తి సామర్థ్యాల్లో నాణ్యత లోపించడం తో పాటు, రాజీవైఖరి అలవడే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించింది. కనీస ఉద్యోగ భద్రత ఇవ్వకుండా అత్యున్నత త్యాగానికి సిద్ధపడా లని యువతకు పిలుపునివ్వడం నేరంగాక మరేమిటని ప్రశ్నించింది.
అసలు పౌరులకు జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా మన భారత రాజ్యాంగం ఏనాడో గుర్తించింది. 21వ అధికరణం అదే చెపుతుంది. మరి ఈ హక్కు సక్రమంగా అమలు కావాలంటే, పౌరులకు సరైన జీవనోపాదులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని వేరుగా చెప్పక్కర్లేదు. కాబట్టి పని చేసే హక్కును చట్టబద్దమైన హక్కుగా పాలకులు గుర్తించాలి. ఇది గుర్తించకపోగా ఇలాంటి 'అగ్నిపథ్' పథకాలు ప్రవేశపెట్టడం అంటే హక్కులతో చెలగాటమేనని యువజన సంఘాల నాయకులు అంటున్నారు. ఉపాధి - ఉద్యోగం అంటేనే ఓ పని సంస్కృతి. ఉపాధి కేంద్రంగా సాగే కుటుంబ సామాజిక జీవన విధానం. భూత - భవిష్యత్ తరాల సామాజిక - సాంస్కృ తిక పని పద్ధతులను వర్తమన పని పద్ధతులు ఆ విధంగా అనుసంధానం చేస్తాయి. ఇదో పరిణామం. అలా గాక రాజకీయ స్వార్థంతో ఇలా సంకుచిత విచ్ఛిన్నకర పద్ధతులు అవలంభిస్తే ఫలితాలు ఇలాగే ఎదురవుతాయి.
అసలు ఈ సమస్యకు మూలం నిరుద్యోగం అని అందరికీ తెలిసిందే. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు అని 2014లో ప్రధాని మోడీ చెప్పిన మాటలకు కాలం చెల్లింది. ఈ తర్వాత నోట్ల రద్దు, జీఎస్టి, పేదల ఉపాధిని చావుదెబ్బ తీసాయి. నల్లడబ్బు తెచ్చి ప్రజల ఖాతాల్లో 15లక్షలు జమచేసి స్వయం ఉపాధికి పూలబాటలు పరుస్తామన్న మోడీ మాటలు వట్టి మాయమాటలని తేలిపోయింది. ఈ తర్వాత కరోనా వచ్చి నరకం చూపించింది.
ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదేండ్లలో అరవై లక్షల ఉద్యోగాల భర్తీ అని తాజాగా తాయిలాలు విసిరింది. తదనుగుణంగా ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు అంటూ ఆర్భాట ప్రకటనలు వెల్లువెత్తాయి. అసలు నిజం ఏమిటంటే ఈ 10లక్షల ఉద్యోగాల్లో 90శాతం గతం నుండి ఖాళీ అయినవే. అంటే కొత్తగా కల్పించేవి పదిశాతం మాత్రమే అన్నమాట.
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఏడుశాతానికి ఎగబాకి ఉన్నది. గత ఏడాదితో పోల్చితే రెట్టింపు అయింది. ఏటా కొటిన్నర మంది యువత శ్రమ చేసేందుకు ఉపాధి రంగంలోకి అడుగిడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో కనీసం మూడింట ఒకవంతు మంది శారీరకమైన శ్రమ చేయడానికి సిద్దపడేవారే. ఈ వాస్తవాలను గమనించకుండా పైపై లేపనాలతో ఉడుకు రక్తం ఉప్పొంగే యువతను ఎవరైనా ఎలా చల్లబరచగలరు?
కార్పొరేట్లకు నిసిగ్గుగా దాసోహమవుతున్న ఈ బీజేపీ ప్రభుత్వ పాలనలో ఇంతకన్నా మెరుగైన విధానాలు ఇకముందు కూడా ఉండవు. చట్టాలన్నింటిని కార్పొరేట్లకు చుట్టాలుగా మారుస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం కాదు కదా బతకడానికి తగ్గ కనీస ఆదాయం కూడా కష్టజీవికి లభించడం లేదు. జాబ్ క్యాలండర్ ఉండదు. సరైన ప్రణాళిక ఉండదు. అన్నింటినీ ఓట్ల కాటాలోనే తూచాలనుకుంటే ఎలా? గదిలో పెట్టి పిల్లిని కొడితే ఎప్పటికైనా ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
- కె. శాంతారావు
సెల్:9959745723