Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తి, డిమాండ్ మధ్య అసమతుల్యం వలన ఏర్పడే ప్రధాన పరిణామం. అయితే నేడు ద్రవ్యోల్బణం అంచనాలపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వంటి సంస్థలు ఇస్తున్న నివేదికలు, చేస్తున్న విశ్లేషణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 7.79శాతంగా నమోదయ్యి, 8ఏండ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలలపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థిర పరిచిన 6శాతం కంటే ఎక్కువగా నమోదయ్యింది. సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రియల్ 2022 మధ్య వ్యవధిలోనే కన్సూమర్ ఫుడ్ ప్రైస్ ద్రవ్యోల్బణం 0.68శాతం నుండి 8.38శాతంకు చేరి గతంలో ఎన్నడూలేని అత్యధిక స్థాయికి చేరింది. ఇటీవల 'డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (డిపిఐఐటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే, 2022 నాటికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపిఐ) 15.9శాతంగా నమోదై 24ఏండ్ల గరిష్టస్థాయికి చేరింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వెయిటేజ్ పరంగా క్రూడాయిల్, సహజ వాయువు 79.5శాతం, వెజిటబుల్స్ 56.4శాతం, ఆహార పదార్థాలు 12.3శాతం, ఇంధన, విద్యుత్ 40.6శాతం, వస్తూత్పత్తి 10.1శాతం మేరకు పెంపుదలను నమోదుచేశాయి.
అదుపుతప్పిన ద్రవ్యోల్బణ స్థాయిపట్ల ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వంటి నియంత్రణా సంస్థలు, పెరిగిన ధరల భారం నుంచి సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కల్పించడాన్ని విస్మరించి, కార్పొరేట్ల కనుసన్నలలో వారి ఆకాంక్షలు, అంచనాలను సంతృప్తిపరిచే విధంగా రూపాంతరం చెందుతున్న వైనం గమనార్హం.
నేడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పేర్కొంటున్న ద్రవ్యోల్బణ వృద్ధిరేటు, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, చేస్తున్న విశ్లేషణలలో, ధరాభారాల నుంచి రక్షణ కోసం నిరీక్షిస్తున్న సామాన్య ప్రజానీకానికి జవాబు దారీతనం కొరవడింది. ఒకవైపు ఆహార పదార్థాల, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి, ఆహార భద్రత ప్రమాదంలో పడి సామాన్య ప్రజలు తమ వాస్తవ ఆదాయాన్ని కోల్పోతున్న తరుణంలో, విశాల ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వాలు, సంస్కరణ ముసుగులో సంపన్నుల ప్రయోజనాలకే మొగ్గుచూపుతున్నాయి.
ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసే అంశం. వస్తువుల అమ్మకం ద్వారా సముపార్జించిన కరెన్సీని భవిష్యత్తులో మార్పుచేసుకోవాలనే అమ్మకందారుని యొక్క విధానంపైన ఆధారపడే గుణాత్మక ద్రవ్యోల్బణ ప్రభావం, ద్రవ్య సప్లయి చలామణి సమీకరణాల ప్రాతిపదికన ధరల పెరుగుదలకు సంబంధించిన పరిమాణ్మక ద్రవ్యోల్బణ ధోరణులు, ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలలో తయారయిన వస్తుసేవల ధరలకు సంబంధించిన కొన్ని రంగాల ద్రవ్యోల్బణ పోకడలు, వివిధ పారిశ్రామిక వ్యాపార సంస్థలు లాభాలను పెంచుకునేందుకు అమ్మకం, ఉత్పత్తి ధరలనుపెంచడం వలన ఏర్పడే ధర శక్తి నిర్ణయ ద్రవ్యోల్బణ రూపాలు, ప్రభుత్వ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ చేయడం వలన ఏర్పడే కోశ సంబంధ ద్రవ్యోల్బణం వంటి విధానాలన్నింటిని ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చవిచూస్తోంది.
నిత్యావసర వస్తువుల ధరలు ప్రభుత్వ ప్రకటిత ద్రవ్యోల్బణ స్థాయికన్నా అతి వేగంగానూ, అనేకరెట్లు పెరిగిపోవటం ఆర్థిక వ్యవస్థలోని నియంత్రణా సంస్థలు ఆవిష్కరించని వాస్తవ దృశ్యం. ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విధానంలోని లొసుగులు, ధరల వాస్తవ పెరుగుదలను ప్రతిబింబించటంలేదు.
ధరల పెరుగుదల స్థాయి 3శాతంగా ఉంటే 'పాకుతున్న ద్రవ్యోల్బణం'గా, 3 నుంచి 4శాతం మధ్యలో ఉంటే పేర్కొనే 'నడుస్తున్న ద్రవ్యోల్బణం'గా, ధరల పెరుగుదల 10శాతంగా ఉంటే 'పరిగెత్తే ద్రవ్యోల్బణం'గా, అంతకు మించి పెరుగుతున్న ద్రవ్యోల్బ ణాన్ని 'దూకుతున్న ద్రవ్యోల్బణం'గా నియంత్రణా వ్యవస్థలు నిర్వచించిన ఈ అన్ని స్థాయిలను దాటి ప్రస్తుతం ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థను పరిహసిస్తోంది.
దిగుమతులు, ఉత్పత్తి కారకాల ఖర్చులో పెంపుదల వంటి వ్యయ ప్రేరేపిత కారణాలు, ద్రవ్య సప్లయి పెరుగుదల, విధాన నిర్ణయాల అనిశ్చితి వంటి ద్రవ్య సంబంధ అంశాలు, బడ్జెట్‌లోటు, ద్రవ్య చలామణి ఎక్కువ అవ్వడం, వస్తుసేవల కృత్రిమ కొరత, ఉత్పత్తి తక్కువ అవ్వటం వలన డిమాండ్ పెరగడం వంటి డిమాండ్ ప్రేరేపిత కారణాలతో పాటు హెచ్చు పన్నురేట్లు, ఉత్పత్తి దారులు అధిక లాభాల స్వీకరణను ఆశించడం వంటివి ద్రవ్యోల్బణ పెరుగుదలకు కొన్ని కారకాలు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్ఐఇ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం పట్టణ నిరుద్యోగిత 9.22శాతం, గ్రామీణ నిరుద్యోగిత 7.60శాతంగా నమోదై నిరుద్యోగితా రేటు మూడు దశాబ్దాల హెచ్చుస్థాయికి చేరిన పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొనివున్నాయి. ఉపాధి అవకాశాలు పెరగకుండా మార్కెట్లో ఉత్పత్తి అయిన సరుకుల గిరాకీ పెరగదు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఇది సాధ్యపడుతుంది.
ధరాభారం నుంచి ప్రజానీకాన్ని పరిరక్షించ డానికి ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేయడం అనివార్యం. బియ్యం, గోధుమలు, పప్పులు, వంటనూనెలు వంటి నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి అందించడమే ప్రత్యామ్నా రరయం. వ్యవసాయ ఉత్పత్తులపై ఫ్యూచర్, ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నిషేధించడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై సుంకాలను తగ్గించడం, నిత్యావసర వస్తువుల చట్టాన్ని పరిపుష్టం చేసి అక్రమ నిల్వదారులపైన, కృత్రిమ కొరత సృష్టించేవారిపైన కఠిన చర్యలు చేపట్టడం ఆవశ్యం.
'ఒకే దేశం-ఒకే పన్ను' నినాదంతో అర్థరాత్రి ప్రత్యేక పార్లమెంట్‌ను కొలువుతీర్చిన ప్రభుత్వ పెద్దలు, అదుపుతప్పిన ద్రవ్యోల్బణ కారణంగా పెరిగిన ధరలపై సైతం నిర్దాక్షణ్యంగా జీఎస్టీ వసూలు చేసి ద్రవ్యోల్బణ పరిస్థితులను ప్రభుత్వ ఆదాయ వనరుగా పరిగణించే స్థాయికి దిగజారడం ఆక్షేపణీయం. ఒక్క నెలలోనే జీఎస్టీ వసూళ్ళు 1.68లక్షల కోట్ల స్థాయికి చేరడమే దీనికి నిదర్శనం. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో అత్యధిక పన్ను వసూళ్ళ నమోదు ప్రజామోదం కాజాలదు. ఆర్థిక వ్యవస్థకు 'అమృత కాలం' రానున్నదన్న ఆర్థిక మంత్రి ప్రసంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం.
ధరల పెరుగుదల వలన పేద, సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు పార్లమెంట్లో ప్రతిబింబించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పొంచివున్న పెను ప్రమాదం. విశాల ప్రజా శ్రేయస్సుకోరే ప్రజా ప్రతినిధులు, పెరిగిన ధరలతో ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు, పెల్లుబుకు తున్న నిరసనలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి తగిన ప్రత్యామ్నాయా లతో సామాన్యులకి సత్వర ఉపసమనం కలిగించే ఉద్దీపనకు రూపకల్పన చేయాల్సిన తరుణమిది.
- జి. కిషోర్‌కుమార్
సెల్: 9440905501