Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) విషయంలో కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేండ్ల నుండి చేస్తున్న మోసాన్ని ఈ సారీ జంకూగొంకూ లేకుండా కొనసాగించింది. పంట పండించడానికి రైతు చేసే సమగ్ర ఖర్చు (సి2)కు యాభైశాతం కలిపి ఎంఎస్పి ఇవ్వాలన్న డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచనలను తుంగలో తొక్కుతూ 2022-23 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పి ప్రకటించింది. మొత్తం 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర నిర్థారించగా గతేడాది కంటే గరిష్టంగా నువ్వులకు రూ.523 పెంచగా కనిష్టంగా మొక్కజొన్నకు రూ.92 పెరిగింది. ముఖ్యమైన ఆహారపంట వరి ధాన్యానికి నిరుటి కంటే పెరిగింది వంద రూపాయలే. రైతుల స్థితిగతులపై అధ్యయనానికి యూపీఏ ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో జాతీయ రైతు కమిటీని నియమించగా ఆ కమిటీ రైతులను సంక్షోభం నుండి బయట పడేయడానికి ఎన్నో మేలిమి సిఫారసులు చేసింది. సదరు సిఫారసులను కమిటీ వేసిన యూపీఏ అమలు చేస్తామని చేయలేదు. తామొస్తే కాంగ్రెస్‌లా కాదు, అమలుచేసి తీరతామని 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు సరికదా అనేక విన్యాసాలకు పాల్పడుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో కొందరు కేసు వేయగా, విచారణ సమయంలో ఆ సిఫారసులు అమలు చేయడం సాధ్యం కాదని మోడీ సర్కారు న్యాయస్థానానికి రాతపూర్వక అఫిడవిట్ ఇచ్చింది. ఎంఎస్పి ప్రకటించిన ప్రతిసారి స్వామినాథన్ చెప్పినట్లు ఒకటిన్నర రెట్ల ఎంఎస్పి ఎప్పటి నుండో ఇస్తున్నామని రైతులకు అబద్ధాలు చెబుతోంది.
ఆ వాదన అసంబద్ధం
జాతీయస్థాయిలో వ్యవసాయోత్పత్తుల వ్యయాలు, ధరల కమిషన్ (సిఎసిపి) ప్రతి ఏటా ఎంఎస్పి నిర్ణయించే ముందు మునుపటి ఏడాది పంటలు పండించడానికి రైతులు చేసిన అన్ని ఖర్చులనూ మదింపు చేసి, రాష్ట్రాల సూచనలను బేరీజు వేసుకొని సగటు ఖర్చును గణించి ఎంఎస్‌పిలను సిఫారసు చేస్తుంది. ఆ విధంగానే 2022-23 ఖరీఫ్పంటల ఎంఎస్పిలు సూచించింది. వ్యవసాయ ఉత్పాదకాలకు రైతు వాస్తవికంగా చెల్లించే ఖర్చును 'ఎ2' అన్నారు. రైతు కుటుంబం చేసే శ్రమ విలువను 'ఎఫ్ఎల్'గా పేర్కొన్నారు. ఎ2, ఎఫ్ఎల్తో పాటు భూమి అద్దె, దానిపై వడ్డీలు, పెట్టుబడిపై వడ్డీలు కలిపి సమగ్ర వ్యయాన్ని 'సి2'గా తెలిపారు. స్వామినాథన్ సమగ్ర వ్యయం సి2కు 50శాతం కలిపి ఎంఎస్పి ఇవ్వమని సిఫారసు చేశారు. కానీ మోడీ సర్కారు అందుకు భిన్నంగా ఎ2, ఎఫ్‌ఎల్‌పై 50శాతం కలిపి ఎంఎస్పి ప్రకటించి స్వామినాథన్ సిఫారసులు అమలు చేసేశామని రైతులను కొన్నేళ్లుగా మోసగిస్తోంది. తాజా సిఎసిపి నివేదికలో క్వింటా సాధారణ రకం వరి ఉత్పత్తికి రైతు చేసే సమగ్ర వ్యయం (సి2) రూ.1,805గా పేర్కొన్నారు. దానిపై 50శాతం రూ.902 కలిపితే ఎంఎస్పి రూ.2,707 అవుతుంది. కానీ ప్రభుత్వం రూ.2,040 ప్రకటించింది. వ్యత్యాసం రూ.667. ఒక ఎకరాకు సగటున 20క్వింటాళ్ల వడ్లు పండాయనుకుంటే, క్వింటాకు 667 చొప్పున 20క్వింటాళ్ల మీద రైతుకు కలిగే నష్టం అక్షరాల రూ.13,340. దేశీయంగా ఖరీఫ్, రబీ కలుపుకొని 10కోట్ల ఎకరాల్లో వరి సాగవుతోంది. అంటే రైతులు కోల్పోయేది రూ.1.30 లక్షల కోట్లు. ఇది కేవలం ఒక్క వరి రైతుకు కలిగే నష్టం. ఎంఎస్పి ఉన్న తతిమ్మా అన్ని పంటలకూ లెక్కేస్తే నష్టం అపారం. ఈ వాస్తవాలను మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాచేస్తోంది. అదేంటంటే నిరుడు వరికి 1,940, ఇప్పుడు వంద పెంచామంటోంది. సి2ను కాకుండా ఎ2, ఎఫ్‌ఎల్‌ను ప్రామాణికంగా తీసుకొని ఖర్చు రూ.1,360, దానిపై 50 శాతం కలిపి 2,040 చేశాం అని బుకాయిస్తోంది. సి2 ప్రాతిపదికన ఎంఎస్పి ఇస్తే బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతాయన్న వాదన కూడా అసంబద్ధం. కామన్ వెరైటీ క్వింటా వరికి మద్దతు ధర రూ.2,040 ప్రకటించారు. బియ్యంగా ప్రాసెస్ చేసి అమ్మేందుకు వ్యాపారులు చేసే వ్యయం ఎంత వేసుకున్నా రూ.వెయ్యి కంటే కాదు. క్వింటా బియ్యం రూ.3 వేలు అనుకుంటే కిలో బియ్యం ధర రూ.30 ఉండాలి. ఎక్కడైనా ఆ ధరకు బియ్యం దొరుకుతున్నాయా? ధరల పెరుగుదలకు ప్రభుత్వ నియంత్రణ లోపం, వ్యాపారులు, దళారుల చేతివాటం కారణం తప్ప రైతులకు ఇచ్చే ఎంఎస్పి కాదు.
డబుల్ ఇన్‌కం బూటకం
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని 2016లో మోడీ వాగ్దానం చేశారు. మద్దతుధరలపై స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా రైతుల ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? ఉదాహరణకు వరికి సర్కారు నిర్ణయించిన ఎ2, ఎఫ్‌ఎల్‌పై ఎంఎస్పి ప్రకారం 2018-19లో ఎకరాకు రైతుకు వచ్చిన స్థూల ఆదాయం రూ.10,037, 2019-20లో రూ.10,375, 2020-21లో రూ.8,969, 2021-22లో తాత్కాలిక అంచనా రూ.9,787. ఆదాయాలు అంతకంతకూ తగ్గుతుంటే డబుల్ అవుతున్నాయనడం మోడీ ప్రభుత్వ అసత్య ప్రచారానికి పరాకాష్ట. సిఎసిఎపి నివేదికలోనే కామన్ వెరైటీ వరి ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చు 5.18శాతం పెరగ్గా, పెంచిన ఎంఎస్పి 5.15శాతం. ఈ మదింపు ఎ2, ఎఫ్ఎల్ ఆధారంగా చేసింది. అదే సి2ను పరిగణనలోకి తీసుకుంటే తేడా మరింత భారీగా ఉంటుంది. సజ్జలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, సమస్త పంటల పరిస్థితి ఇంతే.
మలిదశ పోరాటం అవసరం
ఏడున్నరదశాబ్దాల స్వాతంత్య్రభారతంలో ఎంఎస్పి ఫలాలు రైతులకు అందుతున్నది స్వల్పం. వందల్లో పంటలు పండుతుండగా ఎంఎస్పి ఉన్నది కేవలం 23 పంటలకే. వరి, గోధుమ, కొన్ని రకాల పప్పుధాన్యాలకే పరిమితం. దేశ వ్యాప్తంగా పండే వరి ధాన్యంలో పట్టుమని 20శాతానికి కూడా ఎంఎస్పి దక్కట్లేదు. 80శాతంపైన పంటను వ్యాపారులు, దళారులకు తెగనమ్ముకొని రైతులు నష్టపోతున్నారు. ఎంఎస్పి దక్కే దాంట్లోనూ 70-80 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే. దీనికీ మోడీ ప్రభుత్వం యాతం పెట్టింది. రైతులందరినీ కార్పొరేట్ల గుప్పెట్లోకి నెట్టేందుకు మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చింది. రైతులు సమరశీలంగా ఏడాదిపాటు పోరాడి మోడీప్రభుత్వ మెడలువంచి చట్టాలను ఉపసంహరింప జేశారు. ఆ పోరాటంలో పైకొచ్చిన 'అన్ని పంటలకూ మద్దతు ధరలను గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలన్న' ప్రధాన డిమాండ్ అలానే ఉంది. ఆ డిమాండ్ సాధనకై రైతులు మలిదశ పోరాటానికి సిద్ధం కావాలి. లేకపోతే రైతు మ్యూజియానికి పరిమితమయ్యే రోజు ఎంతో దూరం లేదు.
- కె.ఎస్.వి. ప్రసాద్, సెల్ : 9490099019