Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లూరి సీతారామరాజు తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలలో ఎంతో ప్రేమాభిమానాలను చూరగొన్న విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు. తన సహచరులైన గాం గంటం దొర, గాం మల్లుదొర, పడాలు, అగ్గిరాజు తదితరులతో కలిసి బ్రిటిష్ సామ్రాజ్యంపై యుద్ధం చేశాడు. ఈ సంవత్సరం రామరాజు 125వ జయంతి సంవత్సరం, మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరంతో కలిసి వచ్చింది. సంఫ్‌ుపరివార్‌కు సహజసిద్ధంగా అబ్బిన, బతకనేర్చిన పద్ధతి ప్రకారం అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సంఫ్‌ుపరివార్ సిద్ధాంతానికి అంకితమైన కార్యకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటించి, రామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, 'నివాళులు అర్పించే పనిలో ఉన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు నడయాడిన ప్రాంతాన్ని ''అభివృద్ధి'' చేయాలనే దానిపై అమితమైన ఆసక్తి వెలిబుచ్చుతున్నారు. నిజానికి వారు ఎంత ప్రయాసపడ్డా, గంగలో నీళ్లన్నీ తెచ్చిశుద్ధి చేసుకున్నా లేక అరేబియా అత్తర్లన్నీ పూసుకున్నా దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఉద్దేశ్యపూర్వకంగానే బహుదూరంగా ఉన్నారన్న విషయం దాచినా దాగని సత్యం.
'ప్రజలకు, ముఖ్యంగా యువతకు అల్లూరి సీతారామరాజు మహౌన్నత జీవితం గురించి కేంద్రప్రభుత్వం బోధ పరచాలని కోరుకుంటున్నది' అని ప్రకటించారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్‌రెడ్డి. ఈసందర్భాన్ని బీజేపీ ఏవిధంగా సొంత ప్రయోజనాలకు వాడుకోదలుచుకున్నదో ఇది వివరిస్తుంది. మంత్రిగారి ప్రకటన ప్రకారం, విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేస్తారట. అల్లూరి పుట్టిన, విద్యనభ్యసించిన స్థలాన్ని, ఆయన పోరాటం చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారట. అంటే రామరాజును స్వాతంత్య్ర పోరాటంలో ఒక పౌరాణిక వ్యక్తిలాగా కీర్తించటానికే ఈ ప్రాజెక్టు.
రాజ్యాధికారం చేతిలో ఉండటంతో సంఫ్‌ుపరివార్ తన ఎజెండాను పూర్తిస్థాయిలో ముందుకు తీసికెళుతున్నది. దాని పదాతిదళం కూడా ఈ విషయంలో సోమరిగా కూర్చోనిలేదు. చరిత్రను వక్రీకరించటంలోనూ, అబద్ధాలు సృష్టించటంలోనూ, బ్రిటిష్ దమన నీతికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటానికి మతతత్వ రంగులు రుద్దటంలో తలమునకలయి ఉన్నారు. అతనికి ఉన్నతకుల గుర్తింపును ఇవ్వడమే కాకుండా, రామరాజును 'హిందూ రుషి' గానూ, 'మతం వల్లసాధించిన శక్తితో జ్ఞానసంపన్నుడైన సన్యాసి' గానూ చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల అనేక భాషల్లో రూపొందిన తెలుగు సినిమా చారిత్రక వాస్తవాలను ప్రచారంలో పెట్టటానికి బదులు రామరాజు చరిత్రను చిత్రవిచిత్ర కల్పితాలతో నింపి ఆ విధంగా వీరికి మేలు చేసింది.
ప్రొఫెసర్ మురళి పేర్కొన్నట్లు... అల్లూరి సీతారామరాజు 'రూపం అనేక కల్పనలతో తయారుచేయబడ్డది'. పొడవైన ఎర్రటి ఖద్దర్ చొక్కా నిక్కరు వేసుకుని గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీలలో తిరుగుతుండేవాడు. వైద్య మూలికలు పంచుతూ, జ్యోతిష్యం, హస్త సాముద్రికాలను కూడా చెపుతూఉండేవాడు. అతని నిరాడంబర జీవనవిధానం, ఇతరులకు సహాయం చేసే స్వభావం గిరిజన ప్రజల నుండి గౌరవ మర్యాదలను పొందాయి. వారు అతనికి మంత్ర శక్తులను ఆపాదించారు. ఈ అపోహలకు రాజు అడ్డుపడలేదు. జనవరి30, 1922లో కేడిపేట ఏజెన్సీ డి.ఎస్.పి. విచారిస్తున్నప్పుడు ప్రజలు 'తననొక పవిత్ర వ్యక్తి'గా చూస్తున్నారని, తను 'పితూరీ'ని ప్రారంభిస్తున్నట్టు నమ్ముతున్నారని, ''ప్రతి ఒక్కరు వచ్చి, తనని అడిగేవారని, అటువంటిది ఏమిలేదని తను ఖండించినప్పటికీ, ఆ ఖండనను చాలామంది అంగీకరించలేదు'' అని చెప్పిన్నట్టు ఆ నివేదికలు సూచిస్తున్నాయి.
అనేక మంది స్వాతంత్య్ర పోరాట యోధులు, 20వ శతాబ్దం తొలిదశకాలలో ప్రజలను సమీకరించటానికి మతభావనలను, చిహ్నాలను వాడుకున్నారు. స్కూల్లో రామరాజు క్లాస్మేట్ అయిన అన్నపూర్ణయ్య ''రామరాజు అయితే ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవాడు కానీ పాలవంటి అతని ఆధ్యాత్మికతలో చక్కెర లాంటి దేశభక్తి ఖచ్చితంగా మిళితమై ఉండేది'' అన్నాడు. ఏమైనా, దీని అర్థం రాజు మతతత్వవాది కాదు. ఇతర మతాల పట్ల వివక్షత చూపలేదు. అతను నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను, కుల వివక్షతలను వ్యతిరేకించాడు.
రాజు కుటుంబ వారసుల్లో ఒకరిని ఉటంకిస్తూ వచ్చిన అధ్యయనాల్లో అతని (రాజు) తల్లి సనాతన ధర్మాన్ని పాటించేవారని, నిమ్న కులాల వ్యక్తులను తమ ఇంట్లోకి రానిచ్చేవారు కాదని పేర్కొంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన రాజు ఆ సనాతన విశ్వాసాలను అనుసరించలేదు. పైగా దీనికి విరుద్ధంగా వివక్షతల అమలుకు వ్యతిరేకిగా ఉన్నాడు. గిరిజన ప్రజలతో బాగా కలిసిపోయేవాడు, వారి ఇళ్ళల్లో బస చేసేవాడు, వారితో కలిసి భోజనం చేసేవాడు, వారిలో ఒకరిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వారి సామజిక-ఆర్థిక సమస్యల పట్ల సానుభూతితో ఉండేవాడు.
రామరాజును 'హిందూ మత నాయకుడు'గా చూపాలని ఆర్ఎస్ఎస్-బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలు ఆయన వారసత్వానికి జరుగుతున్న ఘోర అపచారం. అదేవిధంగా కులసంస్థలు రామరాజు పుట్టుకను బట్టి కులాన్ని ఆపాదించటం కూడా నేరమే. ఆయన విశాల మానవతా ప్రపంచ దృక్పథాన్ని తిరస్కరించడం తప్ప ఇది మరొకటి కాదు
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రామరాజు చేసిన తిరుగుబాటు ఆనాడు ఉన్న (1920 తొలినాళ్ళల్లో) వలసవాద ప్రభుత్వం పట్ల ప్రజలలోవున్న తీవ్ర వ్యతిరేకతకు ప్రతిరూపంగా ఉన్నది. మన్యం ప్రాంతంలోని గిరిజనులలో రాజకీయ చైతన్యం పెంచటంలో రామరాజు దోహదపడ్డాడు. తరువాత ఆ మన్యప్రాంతమే అతని పోరాట కార్యక్రమాలకు కేంద్రంగా ఉండింది. గిరిజనుల సాధకబాధకాలను ఉపయోగించుకుని, వారిని ప్రేరేపించి, వారి ఆగ్రహాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రూపుదిద్దాడు. 1860 నాటినుంచి మన్యం ప్రాంతం గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు నడవటం చూసింది. కానీ, 1922-1924 మధ్యకాలంలో రామరాజు చేసిన తిరుగుబాటు గుణాత్మకంగా భిన్నమైనది. ఈ తిరుగుబాటు స్వభావరీత్యా కూడా భిన్నమైనది. ప్రొఫెసర్ మురళి ఇలా రాశారు... ''మునుపటి తిరుగుబాట్లవరుసలో కాకుండా, రాజు వలసవాద వ్యతిరేక భావజాలంతో గిరిజనుల వ్యక్తిగత కష్టాలను జోడించగలిగాడు. తద్వారా కొండిపాంత ప్రజలలో కొత్త సామూహిక రాజకీయ చైతన్యాన్ని సృష్టించగలిగాడు. ఇదే అతని తిరుగుబాటును నిజమైన ప్రజల తిరుగుబాటుగా మార్చింది.''
పోడు వ్యవసాయం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులు పోగుచేసుకునే హక్కును నిషేధించిన వలసరాజ్యంపై రామరాజు తిరుగుబాటు ప్రధానంగా జరిగింది. బ్రిటిష్ వారి పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు రోడ్లు వేయటం లాంటి వివిధ పనులలో గిరిజనులను పెట్టుకునేవారు. ఆ కాంట్రాక్టర్లు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా కూడా ఈ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటుకు సంబంధించిన కారణాలివి. ''ప్రభుత్వం వేస్తున్న రహదారి పనులలో బలవంతంగా పనిచేయించటం, వ్యవసాయ సంక్షోభం, అధికారుల బాధలకు గురియైన మాజీ మునసబులు, మాజీ ముఠాదార్లతో ఏజెన్సీ మండటానికి సిద్ధంగా ఉన్న భాస్వరం లాగా ఉండింది. అదే గిరిజనులను పోరాటంలోకి నెట్టింది''అని ఒక అధికారి రాశాడు. బ్రిటిషర్ల ఆర్థిక సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన తిరుగుబాటు ఇది.
ఈ తిరుగుబాటుతో బ్రిటిష్‌వారు అదిరిపోయారు. రామరాజును పట్టుకోవటానికి, తిరుగుబాటును అణచటానికి పెద్దఎత్తున సైనిక బలగాలను దింపారు. రాజును పట్టుకోవటంలో పోలీసులు విఫలం అవటంతో, గెరిల్లా యుద్ధతంత్రాలలో ఆరితేరిన మలబార్ స్పెషల్ పోలీసులను బ్రిటిష్ దింపింది. ఆ తరువాత ఈ బలగాలకు అస్సాం రైఫిల్స్‌ను జతకలిపింది. ఈ కార్యక్రమానికి బ్రిటిషర్లు మొత్తంగా ఆనాటి రూ.40లక్షలు ఖర్చు చేయాల్సివచ్చింది. గ్రామాలను తగులబెట్టారు, పంటలను ధ్వంసం చేసారు, ఆడవారిని బలాత్కరించారు, ప్రజలను అమానుషమైన పద్ధతిలో రకరకాలుగా హింసించారు. ఇంత క్రూరమైన అత్యాచారాలు తమపై జరిగినప్పటికీ ప్రజలు తిరుగుబాటు పట్ల అంకితభావంతో ఉన్నారు. ఎన్నడూ రామరాజునిగాని, అతని తిరుగుబాటు బృందానికి గాని ద్రోహం చేయలేదు. 1924లో రామరాజును పట్టుకుని కాల్చిన తరువాతనే బ్రిటిష్‌వారు గాలి పీల్చుకోగలిగారు. అప్పటికి రామరాజు వయస్సు 27ఏండ్లు.
రామరాజు యొక్క వారసత్వం ఆర్థికదోపిడీకి, కులవివక్షకు వ్యతిరేకంగా, సామరస్యంతో ఉండటం కోసం నిలబడటంలో ఉంది. ఇది సంఫ్‌ుపరివార్ డీఎన్ఏకే వ్యతిరేకం. బ్రిటిష్ వలస పాలనతో పోరాడిన చరిత్ర వారికి లేదు. పోరాడి సాధించుకున్న సార్వభౌమత్వం, స్వాతంత్య్రంపై రాజీపడటానికి బీజేపీ నాయకత్వలోని ప్రభుత్వం నానావిధాలుగా ప్రయాస పడుతున్నది.
సమ్మిళిత (ఇన్‌క్లూజివ్) సమాజాన్ని నిర్మిస్తామని ఎన్ని బడాయి మాటలు చెప్పినప్పటికీ ఆర్ఎస్ఎస్-బీజేపీల చేతలు మాత్రం 'అగ్రకుల' ఆధిపత్యం వైపేనని సూచిస్తున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు, దేశం నలుమూలలా దళితులు, ఆదివాసీలపై జరిగే దాడులు, అకృత్యాలపై బహిరంగంగాను, చాటుమాటుగా తెలిపే మద్దతు, దళితులు, ఆదివాసీలకు మద్దతుగా నిజంగా ఉపయోగపడే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తూ పోవటం, వీటితోపాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాలు చేయటానికి నిరాకరించటం-ఇవన్నీ నిమ్న కులాల పట్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్లకున్న స్వాభావిక ధోరణికి రుజువులు.
ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ప్రజలు అనుసరించే మత విశ్వాసాల ఆధారంగా బుద్ధిపూర్వకంగా వారి మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం, ఎవరు ఏదుస్తులు వేసుకోవాలో, ఏమి తినాలో లాంటివన్నీ రామరాజు దేని కోసం నిలబడ్డాడో దానికి విరుద్ధం. పైన చెప్పిన ఈ కారణాలతో, ఆర్ఎస్ఎస్-బీజేపీలకు అల్లూరి సీతారామరాజును సొంతం చేసుకునే మాట అటుంచి, ఆయనను గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని వాస్తవాలను వక్రీకరించేందుకు సంఫ్‌ుపరివార్ ప్రయత్నిస్తున్నది. స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో సంఫ్‌ుపరివార్‌కు లేని పాత్రను ఆపాదించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నది. వలసపాలన నుండి దేశస్వాతంత్య్రం కోసం మాత్రమే కాక, కులమతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్షతను చూపే తిరోగమన పద్ధతులు, ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడిన ఎందరో అమరులున్నారు. 'గుర్తింపునకు నోచుకోని అమరవీరుల' జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయాసపడుతున్నది. స్వాతంత్య్ర సమరయోధుడు రామరాజును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలుగువారిలో పట్టు సాధించవచ్చని కలలు కంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం వంటి వాటితో సహా తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచివేయడానికి బీజేపీ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.
ప్రజలకున్న జ్ఞాపకశక్తి తక్కువది కాదు. మరచిపోయి క్షమించేస్థితిలో వారులేరని పాపం! బీజేపీ గ్రహించలేక పోతున్నది. అల్లూరి సీతారామరాజు బోధించిన ఒక విషయం ప్రజలకు బాగా గుర్తుంది... 'దేశ శ్రేయస్సు కోసం, మీరు చేయవలసినది ఏమీ లేదు, పోరాటం కొనసాగించటమే.'
- ఆర్. అరుణ్‌కుమార్
అనువాదం: కర్లపాలెం