Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే 12, 2022న కాశ్మీర్ పండిట్ యువకుడు రాహుల్‌భట్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 25, 2022న టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్భట్ ఉగ్రవాదుల ఘాతుకానికి గురైంది. ఆమె వెంట ఉన్న పదేండ్ల మేనల్లుడు తీవ్రగాయాలపాలయ్యాడు. మే 31, 2022 నాడు కుల్గామ్ జిల్లాలో రజినిబాల అనే పాఠశాల ఉపాధ్యాయురాలిని పాఠశాలలోనే కాల్చి చంపారు. ఆమె చితి చల్లారకముందే జూన్ 2, 2022న శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఒక బ్యాంకు ఉద్యోగి దుండగుల తూటాలకు బలయ్యాడు. 20రోజుల్లో నాలుగు ఘటనలు. గత ఆరునెలల్లో ఇలాంటివి సుమారు ఇరవైవరకు జరిగాయని వార్తలు.
మే 29, 2019న మోడీ ప్రభుత్వం రెండవసారి పదవిలోకి వచ్చింది. రెండవసారి వచ్చి మూడేండ్లు అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆగస్టు 5, 2019 అధికారంలోకి వచ్చిన రెండు నెలల వారం రోజులకు జమ్మూ కాశ్మీర్‌ని రాష్ట్రహౌదా నుండి తప్పించి, జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌లుగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, ఇప్పుడు కాశ్మీర్ యావత్తు ప్రశాంతమైందని చాటుకున్నారు. దాని పేరు చెప్పుకునే బీహార్ ఎన్నికలు గెలిచారు. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్నదేమిటి అని చూస్తే, అక్కడి శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని అవగతమవుతుంది.
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, అంటే ఆ ప్రాంతమంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయినా ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉన్నారు. కాశ్మీరీ పండిట్లు, ఇతర హిందువులు వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలకు బలవుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. కాశ్మీరీ పండిట్లు తమకు రక్షణ కరువని, అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ కుటుంబాలలో చాలామంది ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన కింద ప్రభుత్వోద్యోగులుగా ఉన్నారు. వారికి భద్రత కరువైంది. వాళ్ళు సమూహంగా కాశ్మీర్ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలాలనుకుంటున్నారు. లేదా తమకు సరైన రక్షణ కల్పించమని వేడుకుంటున్నారు. కానీ వారికి ఆ రక్షణ దొరకటం లేదు. తనకు ఉగ్రవాద బెదిరింపులు వస్తున్నాయని, తనని ట్రాన్స్ఫర్ చేయమని రజినిబాల ప్రభుత్వానికి విజ్ఞుప్తులు పంపుతూనే ఉన్నా ఆమె విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాంటి వాళ్ళు మరెందరో..? అంతే కాదు, రజినిబాల హత్య తరువాత కాశ్మీరీ పండిట్లు ఏకమొత్తంగా బయటపడాలని పెట్టేబేడా సర్దుకుంటుంటే, వాళ్ళు కాశ్మీర్ వదలకుండా వాళ్ళ నివాస ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. వాళ్ళ జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించరు. పైగా వాళ్ళని అక్కడ నుండి కదలకుండా పోలీసు పహారా... ప్రభుత్వ ఉద్దేశమేమిటో అర్థంకాకుండా ఉంది.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే... 1990లో కాశ్మీరీ పండిట్లపైఉగ్రవాదుల దాడి జరిగి, వాళ్ళు కాశ్మీరీలోయను వదలి పారిపోయినప్పుడూ, ఇప్పుడూ కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం 85మంది బీజేపీ సభ్యుల సహకారంతోనే నిలబడి ఉంది. ఆనాడు బీజేపీ సభ్యులెవరూ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకోలేదు. అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ బీజేపీకి చెందిన వ్యక్తే. అయినా ఆనాడు ఆయన వారికి రక్షణ కల్పించటం అటుంచి, వాళ్ళని అక్కడినుంచి వెళ్లిపొమ్మని సలహా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కేంద్రంలో 300పైచిలుకు సభ్యులతో పూర్తి మెజారిటీలో ప్రభుత్వం ఉండటమే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి కాశ్మీర్‌ని తమ అధీనంలో ఉంచుకున్నాక కూడా అక్కడ ఉగ్రవాదం తగ్గకపోగా పెరిగింది. బీజేపీ సమర్థితుడే అయిన ఒక కాశ్మీరీపండిట్ మాటల్లో చెప్పాలంటే ఇప్పటి పరిస్థితి 1990 కంటే ఆధ్వాన్నంగా ఉంది. ఇంకా ఎంత కాలం ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుందో వేచి చూడాలి.
కాశ్మీరీపండిట్లపై ''కాశ్మీర్‌ఫైల్స్'' సినిమా తీసిన వివేక్ అగ్నిహౌత్రి ఆ సినిమాను 15/16 కోట్లతో నిర్మించి సుమారు 340కోట్లకు పైగా సంపాదించాడని పత్రికల వార్తలు. పైగా ఆసినిమాని అందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రా మంత్రులందరు 'హిందువు అన్న వాడు ప్రతిఒక్కడు చూడవలసిన సినిమా'' అని ప్రమోట్ చేశారు. వారిపై సానుభూతి పేరుతో సినిమా నిర్మించిన అగ్నిహౌత్రి ఇప్పుడు కాశ్మీర్లో పండిట్లపై జరుగుతున్న మారణహౌమానికి ఎందుకు స్పందించటం లేదు? ఇప్పుడు నోరు పడిపోయిందా..? ఆ వచ్చిన డబ్బుతో ఆయనిప్పుడు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఆ సినిమా కాశ్మీరీ పండిట్లపై సానుభూతి కలిగించలేదుకానీ, ముస్లింల మీద ద్వేషాన్ని మాత్రం రగిలించింది. సినిమా హాళ్ళలోనే ముస్లింలను చంపండి, నరకండి అనే నినాదాలు ఇచ్చారంటే, అది రగిల్చిన విద్వేషాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు కాశ్మీర్ ఇలా రగిలిపోతుంటే, ప్రభుత్వం మాత్రం తన రెండవ ప్రభుత్వ మూడేండ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు జల్సాలు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాశ్మీర్‌లోని హిందువులందరికి సరియైన రక్షణ కల్పించాలని, అక్కడ రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని భారత దేశ ఏకాగ్రత, సమగ్రతను కోరుకునే భారతీయులందరు కోరుకోవడంలో తప్పేమీలేదు.
- ఫీచర్ పాలిటిక్స్ డెస్క్