Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో మానవుడు ఎంతో శ్రమించి ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. నూటికి 90శాతం మంది ప్రజలు ఏదో ఒక పనిచేసుకుంటూ, నిజాయితీగా జీవిస్తుంటారు. ఉన్నంతలో జీవితాన్ని గడుపుతారు. వారసత్వంగా వచ్చే కొన్ని సాంప్రదాయాలని పాటిస్తుంటారు. పండుగలని, పబ్బాలని జరుపుకుంటారు. తమకు తోచిన సహాయాన్ని ఎదుటివారికి చేస్తుంటారు. ఇక మిగిలిన పదిశాతంలో రాజకీయ నాయకులు, భూస్వాములు, మత ప్రభోధకులు, బడా పారిశ్రామిక వేత్తలు వుంటారు. వీరు పైకి విభిన్న మార్గాలు ఎంచుకున్నట్లు అనిపించినా, అంతర్గతంగా వీరి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా వీరి పనులు మాత్రం ఆగవు. వీరికి రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదో ఒక విధంగా అధికారంలో ఉండటం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులను దోచుకోవడం.
రాజకీయ నాయకులకు అధికారంలోకి రావడానికి కులం, మతం ఒక ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం వారు ప్రజలని ఎప్పుడూ ఏవో ఒక భావోద్వేగాల మధ్య ఉంచుతారు. దీని వల్ల వివిధ వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులకు 90శాతం మంది ప్రజలలో ఓ రెండు నుంచి ఐదు శాతం మంది ప్రజలు అనుచర గణంగా వుంటారు. ఇందులో ఉన్నత విద్యా వంతులు, మేధావులు కూడా వుంటారు. వీరు తమ మాటల చాతుర్యంతో వివిధ పార్టీల భావజాలాన్ని ప్రజల మధ్యకు తీసుకెళతారు. ఇందుకు మీడియా కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. ప్రజలు తమకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పన గురించి మర్చిపోయి కులం, మతం పేరుతో కొట్టుకునే స్థాయికి వెళతారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ధోరణులు పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే సమిధలు అవుతున్నారు. భావోద్వేగాలతో ఉన్నప్పుడు ప్రజలు తమ యొక్క స్వతంత్ర ఆలోచనలు కోల్పోతారు. ఫలితంగా సమాజంలో హింసాత్మక సంఘటనలు పెరుగుతాయి.
ఒక మతం వారు నమ్మే విశ్వాసాలని, ఇంకో మతం వారు మూఢ నమ్మకాలుగా భావిస్తారు. వాస్తవానికి ఇవన్నీ ప్రాచీన విశ్వాసాలే. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచేందుకు కృషి చేసేవారికి తగిన ప్రోత్సహం లేకపోవడం వల్లే ఇటువంటి ధోరణులు పెరుగుతున్నాయి. పూలే, అంబేద్కర్ వంటి మహనీయులు మన దేశంలో, మార్టిన్ లూథర్ కింగ్, లింకన్, మండేలా వంటి గొప్ప నాయకులు వివిధ దేశాల్లో అణగారిన వర్గాల వారి హక్కుల కోసం ఎనలేని కృషి చేశారు. అభివృద్ధి అంటే మానవ హక్కుల రక్షణ, నిరక్షరాస్యత నిర్మూలన, శిశు మరణాలు, బాల్య వివాహాలని వీలైనంత వరకు తగ్గించడం, ప్రజలందరికీ పౌష్టికాహారం అందించడం అనేవి ప్రధానమైనవి.
మానవ హక్కులలో జీవించే హక్కు ప్రధానమైనది. ఒక మనిషిని కులం, మతం, వర్గం లేదా ప్రాంతం పేరుతో కించపరిస్తే అతని జీవించే హక్కుని కాలరాసినట్లే. మానవ వాదం ద్వారానే మనుషుల హక్కులు కాపాడబడతాయి. విద్యార్థులు, యువత ఇటువంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ ఆలోచనలు పెంచుకొని, సర్వ సమానత్వం కోసం కృషి చేయాలి.
- యం. రాం ప్రదీప్
సెల్:9492712836