Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 17, 2022న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రయివేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకచట్టం తీసుకువస్తామనీ, 2022-23 విద్యా సంవత్సరంలోనే చట్టం అమలులోనికి తీసుకువస్తామనీ చెప్పారు. కానీ, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం, విద్యాశాఖ ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఫలితంగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లకోసం వెళ్ళిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మతిరుగుతోంది.
కరోనా కాలంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ప్రయివేటు యాజమాన్యాలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి. ఇది అత్యంత దుర్మార్గం. కరోనా కాలంలో ఆదాయాలు లేక, ఉద్యోగాలు కోల్పోయి జీవనమే అగమ్యగోచరంగా మారింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలేమో అడ్డూఅదుపు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసాయి. ఈ విద్యాసంవత్సరం కూడా 20-50శాతం వరకు పెంచి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి.
అమీర్‌పేట్‌లోని ఒక కార్పొరేట్ స్కూళ్లో 1వ తరగతి విద్యార్థికి రూ.2 లక్షల 30 వేలు ఫీజు. 3వ తరగతి విద్యార్థికి రూ.2 లక్షల 56 వేలు ఫీజు నిర్ణయించారు. కరోనా డిస్కౌంట్ పోను రూ.2 లక్షల 11 వేలు కట్టించుకుంటున్నారు. మొత్తం ఫీజును మూడు దఫాలుగా చెల్లించాలని యాజమాన్యాలు తల్లిదండ్రులకు వివరించాయి. ఇంత పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యాలు ఫీజుల దోపిడీకి పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
రాష్ట్రంలో ఏటా రూ.12.50వేల కోట్ల విద్యావ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి, పేద కుటుంబాల కష్టార్జితంలో సగం ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లకే పోతోంది. కొన్ని కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఒక ప్రయివేటు పాఠశాలలో గత సంవత్సరం రూ.62 వేల ఫీజు ఉంది. ఈ సారి ఏకంగా రూ.80 వేలకు పెంచింది. పుస్తకాలు, యూనిఫామ్స్, ట్రాన్స్‌పోర్టు ఫీజులు అదనం. ఎల్బి నగర్‌లోని మరొక పాఠశాలలో 5వ తరగతికి గత సంవత్సరం రూ.36 వేలు ఉండగా ఇప్పుడు రూ.50 వేలుగా నిర్ణయించింది. దాదాపు 40శాతం ఫీజులు పెరిగాయి. వనస్థలిపురంలో ఒక ప్రయివేటు పాఠశాల అడ్మిషన్ పేరిట ఏకంగా రూ.40 వేలు కట్టించుకుంటున్నది. రెగ్యులర్ ట్యూషన్ ఫీజు కింద మరో రూ.60 వేలు. ఇలా వసూళ్లకు పాల్పడుతూ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల స్థాయిలో ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు దండుకుంటున్నాయి.
ట్రాన్స్‌పోర్టు ఫీజుల బాదుడు
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని స్కూళ్లల్లో ట్రాన్స్‌పోర్టు ఫీజులను విపరీతంగా పెంచాయి. 3, 5, 10 స్లాబ్‌లుగా విభజించి కిలోమీటర్ల చొప్పున స్లాబ్‌లు నిర్ణయించి 10కిలోమీటర్ల లోపు ఉంటే ఏడాదికి రూ.60వేలు చెల్లించాలంటున్నారు. ట్రాన్స్‌పోర్టు ఫీజు తల్లిదండ్రులు నెలనెలా కడతామంటే కుదరదు ఖచ్చితంగా ముందస్తుగానే చెల్లించాలని నిబంధనలు పెడుతున్నారు. గతంలో 5 కిలోమీటర్లకు రూ.15 వేలు వసూలు చేయగా ఇప్పుడు ఏకంగా రూ.25 వేలకు పెంచారు. పిల్లల ఫీజులతో పాటు రవాణ ఫీజులతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతున్నది.
ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఏది?
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చేస్తాం. కార్పొరేట్స్కూళ్లు, కాలేజీలను తరిమేస్తామని ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఢంకా బజాయించారు. కానీ, తెలంగాణలో కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లు ఇష్టారాజ్యాంగా ఫీజులు వసూలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రయివేటు సూళ్ల యాజమాన్యాలు జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ అసమర్థత అవకాశవాదంతో ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ళు ఆడిందే ఆటగా తయారయ్యింది. ప్రయివేటు స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణకు సంబంధించి జీవో 1/1994 వచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్ఈ) ఏర్పాటు చేస్తూ 2009లో వచ్చిన జీఓ నెం.91ని యాజమాన్యాలు హైకోర్టులో కొట్టివేయించాయి. కనిష్టఫీజు రూ.7,800, గరిష్ట ఫీజు రూ.12,000 ఉండాలని 2010లో వచ్చిన జీఓ42ని కూడా స్టే చేయించాయి. తల్లిదండ్రుల ఆందోళన, విద్యా ఉద్యమాలు, ప్రతిపక్షాల విమర్శల ఫలితంగా ప్రభుత్వం జీఓలు యిచ్చినా, వాటిలో ఏదో ఒక లోపాన్ని జొప్పించి కోర్టుల్లో నిలబడకుండా ప్రభుత్వం పరోక్షంగా యాజమాన్యాలకే తోడ్పడుతోంది.
పేద కుటుంబాల పిల్లలకు 25శాతం సీట్లను రిజర్వ్ చేసి ప్రయివేటు స్కూళ్ళల్లో ఫ్రీఎడ్యుకేషన్ ఇవ్వాలని, అన్నీ అర్హతలు ఉన్నవారినే టీచర్స్‌గా నియమించి పూర్తిజీతాలు చెల్లించాలనే వాటితో పాటు, విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధనా అమలు కావటంలేదు. ఫీజులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో 2016 మార్చి 30న అసెంబ్లీలో విద్యారంగంపై జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంలో రాష్ట్రంలో స్కూళ్లు, ఫీజుల సమస్య తీవ్రంగానే ఉందని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఫీజుల నియంత్రణకు త్వరలో ఉత్తర్వులను ఇస్తామని సభాముఖంగా హామీ యిచ్చారు. ఆరేండ్ల కాలం గడిచిపోయినా ఇంతవరకూ ఏ ఉత్తర్వులూ లేవు. ఎట్టకేలకు ప్రొఫెసర్ టి. తిరుపతిరావు ఛైర్మన్‌గా ఒక కమిటీని మాత్రం వేశారు. ఈ కమిటీ సిఫార్సులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం కమిటీ రిపోర్డును బహిర్గతం చేయలేదు. కానీ కమిటీ రిపోర్డులో ప్రతి యేటా 10శాతం ఫీజుల పెంచుకోవాలని చెప్పిన అంశాన్ని మాత్రం ప్రస్తావించి ఈ విద్యాసంవత్సరం నుంచే పెంచుకోవచ్చని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడంతో ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు విచ్చలవిడిగా ఫీజులు పెంచి దోపిడీ చేసుకుంటున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు సంపాదించిన సొమ్ములో 80శాతం పిల్లల చదువులకే ఖర్చు చేస్తున్నారు. కనీస జీవనం కూడా సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల నుండి తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకురావాలనీ, నిత్యం ప్రయివేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉండాలనీ తల్లిదండ్రులు కోరుతున్నా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి నిదర్శనం. కనుక విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంరక్షణ సంస్థలు, విద్యారంగ శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులతో కలిసి ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని ప్రతిఘటించే ఐక్యవేదికలుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప పిల్లలకు చదువులు అందుబాటులోకిరావు.
- పగడాల లక్ష్మయ్య
సెల్:9849868145