Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. పంటల సాగుపై మొక్కుబడి సూచనలే తప్ప, ప్రభుత్వాలు వ్యవసాయ విధానా లను ప్రకటించలేదు. వానా కాలం ఏ పంట వేయాలో నిర్ణయించు కోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. భూమి ఏ పంటలకు సాను కూలం? ఏ రకం విత్తనాలు కొనుగోలు చేయాలి? నాణ్యమైనవి మార్కెట్లో ఎక్కడ దొరుకుతాయి? రసాయనాలు, ఎరువులు ఏ రకం, ఏ మేరకు వాడాలి? పంట దిగుబడి ఏ మేరకు వస్తుంది? వచ్చిన పంట ఎక్కడ అమ్మాలి? ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతుధర ఖచ్చింతంగా ఇస్తారా? ఇలా అనేక ప్రశ్న లకు ప్రభుత్వాలవద్ద సమాదానాలు లేవు. రైతుకు దిశానిర్ధేశం, భరోసా కల్పించే చర్యలు ఇప్పటివరకు కనిపించడం లేదు.
సాగుకు విత్తన కొనుగోలు మొదలు ధాన్యం చేతికొచ్చి అమ్మే వరకు రైతాంగం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విత్తన కొనుగోళ్లలోనే మోసాలకు గురవుతున్నారు. నాసిరకం విత్తనాలను గుర్తించే చర్యలు ఇప్పటి వరకు లేవు. విత్తన నాణ్యతను గుర్తించే ప్రయోగశాలల ఏర్పాటు, ఉన్న వాటికి నిధులు విడుదల చేయడంలో బీజేపీ సర్కారు విఫలమవుతోంది. తెలంగాణలో చూస్తే... రాజేంద్రనగర్, మలక్‌పేటలో మాత్రమే ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ కేంద్రాలకు కేంద్రం నుండి నిధులు విడుదల చేయకపోవడంతో విత్తన నాణ్యతా పరీక్షలు జరుగడంలేదు. దీంతో విచ్చలవిడిగా మార్కెట్లో నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర విత్తన నాణ్యత దృవీకరణ బోర్డు సర్టిఫికెట్లు తీసుకున్న కంపెనీలే మార్కెట్లో విక్రయించాలనే నిబంధన ఉన్నా, మార్కెట్లో ఇందుకు విరుద్దంగా ఇష్టానుసారంగా నకిలీ విత్తన విక్రయాలు జరుగుతున్నాయి. వరి, పత్తి, కందులు ఇలా అనేక రకాల నకిలీ విత్తనాలు మార్కెట్లో విచ్చల విడిగా విక్రయించడం వల్ల రైతులు యేటా లక్షల్లో నష్టపోతున్నారు. ప్రభుత్వం నుండి నకిలీ విత్తనాలపై చర్యలు లేకపోగా, రైతులకు ఇచ్చే సబ్సిడీ విత్తనాల సరఫరా ఎత్తేశాయి. పైగా మార్కెట్లో ధరలు మూడింతలు పెంచడం, సబ్సిడీలు ఎత్తేయడం ప్రభుత్వాలకు తగని పని. ఇవి రైతులకు నష్టాలు చేకూర్చి, కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చే చర్యలుగానే చెప్పక తప్పదు.
దేశ వ్యాప్తంగా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. నువ్వులు క్వింటాలుకు రూ.523 వరికి రూ.100, పత్తికి రూ.354, మొక్కజొన్నకు రూ.92, కందులకు రూ.300, జొన్నకు రూ.232 ఇలా పెంచిన మద్దతు ధర రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుందనేది ఏలినవారికే తెలియాలి. వరికి క్వింటాల్‌కు రూ.1960, కందులకు రూ.6,000, పత్తికి రూ.6,025 గతంలో ప్రకటించినప్పటికీ తెలంగాణలో అయితే ఎక్కడా అమలు కాలేదు. పైగా తూకంలో కోతలు, మిల్లర్ల తరుగు అంటూ అనేక కొరివీలతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం పెంచిన అత్తెసరు మద్దతు ధరల వల్ల రైతుకు ఏ మాత్రమూ ప్రయోజనం చేకూరదు. సాగు ఖర్చులు, పెట్టుబడి పోను రైతుకు వచ్చే లాభాలపై కేంద్ర సర్కారు కనీస ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియని దుస్థితి ఏర్పడింది. తెలంగాణలో పరిశీలిస్తే... వరి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు మొక్కజొన్న, కందుల సెంటర్లు ఏర్పాటు చేసినా నామమాత్రపు కొనుగోల్లే జరుగుతున్నాయి.
సమగ్ర వ్యవసాయ విధానాల రూపకల్పన, కార్యచరణ అమల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. దేశంలో 70శాతం వరకు వ్యవసాయంపై ఆధార పడుతున్న ప్రజలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు, చేస్తున్న ఖర్చు, సంక్షేమానికి తీసుకున్న చర్యలు సర్కారువారి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కార్పొరేట్, ప్రయివేటు వర్గాలకు మేలు చేసేందుకే ప్రభుత్వాలు ఉన్నాయనడానికి వాటి విధానాలు, తీసుకుంటున్న చర్యలే సాక్షాలు. సాగు చట్టాలను బీజేపీ సర్కారు ఉపసంహరించుకున్నా, దొడ్డిదారిన మరోరూపంలో అమలుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ''ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అర్గనైజేషన్'' పేరుతో బీజేపీ ఎంపీలు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్లస్టర్‌ను ఏర్పాటు చేసి రైతులను సభ్యులుగా చేర్పిస్తున్నారు. కరీంనగర్జిల్లా జమ్మికుంట క్లష్టర్ పరిధిలోకి పలు గ్రామాల్లో రైతులను చేర్పించారు. మానకొండూర్ ఎఫ్‌డీవో కింద 720మంది రైతులను చేర్పించారు. రైతులు తమ పంటలను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లి అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీవో పేరుతో చాపకింద నీరులా చర్యలు కొనసాగిస్తోంది. దీనివల్ల నష్టపోయేది రైతులే. పంట సాగు ప్రారంభం మొదలు దిగుబడి వచ్చే వరకు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్న రైతన్న, వచ్చిన ధాన్యాన్ని వినియోగదారుని వద్దకు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితులు ఏ మాత్రమూ ఉండవు. మళ్లీ దళారీ వ్యవస్థ, కార్పొరేట్ శక్తులను నమ్ముకోక తప్పదు. వారు చెప్పిన విధంగా అగ్గువ ధరకు పంటలను తెగనమ్ముకోక తప్పదు. ఇలా వరుస నష్టాలతో అప్పుల పాలైన రైతులు తమ భూములను తక్కువ ధరలకు అమ్ముకుని రోడ్డున పడతారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలెన్నో రాష్ట్రంలో, దేశంలో చూస్తున్నాం.
- చిలగాని జనార్థన్
సెల్:8121938106