Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''డాడీ! నాకు తోలుబొమ్మలాట చూడాలని ఉంది! చూపించవా'' అన్నాడు నానిగాడు. తండ్రి ఆఫీసు నుండి రాగానే.
''యూట్యూబ్‌లో చూసుకోరా!'' అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు రమేష్.
స్నానం చేసి వచ్చి చూస్తే నానిగాడు నేలమీద కూర్చున్నాడు. చుట్టూ పెన్నులూ, పుస్తకాలు, బ్యాగూ విసిరేసి ఉన్నాయి. అది చూసి సీన్ రీకనస్ట్రక్షన్ చేసుకున్నాడు. అందులో తన శ్రీమతి అలియాస్ నానిగాడి తల్లి కన్పించలేదు.
''మీరు సీన్ బాగానే రీకన్స్ట్రక్షన్ చేశారు! కాని మీ తండ్రి కొడుకుల మధ్య నేనెందుకుంటాను?'' శ్రీమతి ప్రశ్నించింది.
''తల్లిగా అది నీ బాధ్యత!'' అన్నాడు రమేష్ గంభీరంగా
''వాడడిగే ప్రశ్నలకు, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, వాట్సప్ యూనివర్సిటీలలో వెదకమని మీరు సమాధానమిచ్చే సీన్లలో నేనుండను. అంతే! ఆఁ'' అన్నది శ్రీమతి తన మెడమీద చెయ్యివేసి రుద్దుతూ పవన్ కళ్యాన్ స్టైల్లో.
అది చూసి రమేష్‌కి కళ్ళు తిరిగాయి. కిందపడబోతూ నిలదొక్కుకున్నాడు.
నానిగాడు అడిగింది అమలు చెయ్యటమే తన మొట్టమొదటి కర్తవ్యంగా గుర్తించాడు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు కొట్టాడు. అది నానిగాడి కోరిక బలమో, లేక రమేష్ అదృష్టమో తెలియదుగాని మర్నాడు టౌనుహాలులో ''రాజాధిరాజు'' అనే తోలుబొమ్మలాట ఉందని తెలుసుకున్నాడు. పాసులు తెచ్చుకున్నాడు. నానిగాడిని ఆటకు తీసుకెళ్ళాడు.
''రాజాధిరాజు'' ఆట మొదలైంది!
అనగా ఒక రాజ్యం! ఆ రాజ్యానికి రాజును ఎన్నుకునే సాంప్రదాయం ఉంది. ఆ విధంగా కొందరు రాజులు ఎన్నికయ్యారు. కాని ప్రజలలో చాలా అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. తమ తరగతికి చెందిన వ్యక్తి రాజుగా ఎన్నిక కానందున తమ సమస్యలు పట్టించుకోవటం లేదన్నది! ఆ అసంతృప్తికి కారణమని భావించారు. అందుకని అసంతృప్తి చెందుతున్న ప్రజలకు చెందిన మనిషిని రాజుగా ఎంపిక చేశారు. రాజు పదవీ కాలం ముగిసింది. కాని ఆ రాజు పదవి కాలంలో తన తరగతికి చెందిన ప్రజలను తన సైనికులే వేటాడి చంపుతుంటే రాజు నోరు మెదపలేకపోయాడు!
ఈసారి అసంతృప్తిని సర్దుబాటు చేసేందుకు ఒక కులానికి చెందిన వ్యక్తిని రాజుని చేశారు. దాంతో రాజ్యమంతా ఆనందం తాండవించింది! ఆ కులం ప్రజలు అందరితో సమానంగా బతుకుతారని ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ ఆశలు అడియాసలయ్యాయి. రాజు పదవి కాలంలో, ఆ కులం వారిపై ఎన్నో దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయి. కాని రాజు నోరెత్తలేదు. తన కులం ప్రజలపై సానుభూతి మాటలైనా మాట్లాడలేదు. ఆ రాజు పదవికాలం కూడా పూర్తయ్యింది.
ఈసారి కొండజాతి తెగకు చెందిన వ్యక్తిని రాజు అభ్యర్థిగా ముందుకు తెచ్చారు. రాజ్యమంతా పెద్ద హడావుడి మొదలైంది. కొండజాతి తెగకు చెందిన వ్యక్తి రాజుని నిలబెట్టడం ఎంతో గొప్ప విషయం! అందుకే రాజుగా గెలిపించండి! అంటూ ఒకటే ప్రచారపు హౌరు సాగుతోంది! దేశమంతా కొండజాతి తెగకు చెందిన వ్యక్తికి మద్దతు ఇవ్వటానికి సాధారణ ప్రజల నుండి మేధావుల వరకూ పోటీ పడ్డారు. ఎన్నికలు జరిగాయి! కొండజాతి తెగకు సంబంధించిన వ్యక్తి రాజుగా గెలిచారు! రాజ్యమంతా సంబరాలు మొదలయ్యాయి! రాజాధిరాజు ఆట ముగిసింది!'' అంతా చప్పట్లు కొట్టారు.
బయటకి వచ్చిన ప్రేక్షకులకి తోలుబొమ్మలాట ఎంతో నచ్చింది! ''ఎంత గొప్ప రాజ్యం! రాజులుగా వచ్చిన వారు వెనకబడ్డ కులాలకు, తెగలకు ప్రతినిధులుగా వచ్చారు! ఇది ఎంతో అద్భుతం!'' అనుకుంటూ ఇళ్ళకి చేరారు.
''నీవు అడిగిన తోలుబొమ్మలాట చూశావా! ఎట్లా ఉంది?'' అడిగాడు రమేష్ ఇంటికి వచ్చాక.
''మరేఁ కొండజాతి తెగకు చెందిన వ్యక్తి రాజయ్యాడు కదా! ఆయన కూడా తన ముందున్న రాజుల్లాగేనా!'' అడిగాడు నానిగాడు.
''అంతేగా! అంతేగా!'' అన్నాడు రమేష్.
''అయితే నాకు తోలుబొమ్మలాట నచ్చలేదు!'' అన్నాడు నానిగాడు చిరాగ్గా! అంతా వింటున్న శ్రీమతి కిసుక్కున నవ్వింది!
రమేష్‌కి ఉక్రోషం వచ్చింది!
''ఏరా! తోలుబొమ్మలాట చూపించమని, ఇల్లంతా చిందర వందర చేశావు! తీరా చూపించాక ఆట బాగా లేదంటావా! అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయిరా నీకు!'' గరుమన్నాడు రమేష్.
''మధ్యలో మా అమ్మనెందుకు తిడతావ్!'' కరుమన్నాడు నానిగాడు.
''రాజు అయ్యాక ప్రజలందరి కోసం పనిచేయాలి! అదెట్లాగూ చేయలేదు! కనీసం తన తరగతి ప్రజలకు కష్టం వచ్చినప్పుడైనా వారికి సపోర్టు చేయాలి కదా! మొదటి రాజు అట్లా సపోర్టు చేయలేదు! తర్వాత అధికారంలోకి వచ్చిన రాజైనా తన కులం ప్రజలకు హెల్ప్ చేయాలి కదా! అట్లా చేయలేదు! ఇప్పుడు కొండజాతి వ్యక్తి రాజయ్యారు! కాని ఆ రాజు కూడా ముందటి రాజుల్లాగే ఉంటారని నీవే చెప్పావుగదా! కనీసం తన వాళ్ళకి హెల్ప్ చేయని రాజు ఎందుకు డాడీ! అందుకే నాకు నచ్చలేదు!'' అన్నాడు నానిగాడు.
నానిగాడి లాజిక్కు రమేష్ దిమ్మెరపోయి కింద పడ్డాడు!
మొహాన నీళ్ళు చల్లటంతో లేచి కూర్చున్నాడు. బేలగా శ్రీమతి మొఖంలోకి చూశాడు! ''నేనేం పాపం చేశాను?'' అన్నట్లు.
మెల్లిగా వెళ్ళి కొడుకు భుజంపై చేయివేసింది తల్లి.
''ఆట నచ్చలేదా? లేక ఆటలోని కంటెంటు నచ్చలేదా!'' అడిగింది తల్లి.
''ఆట బాగుంది! కాని రాజులు అట్లా ఉండటం నచ్చలేదమ్మా! తాము ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారో, వారి ప్రాబ్లమ్స్ పట్టించుకోకపోతే ఎలాగమ్మా? ఈ రాజుల కన్నా మా క్లాస్ రిప్రజెంటేటివ్ ఎంతో బెటరమ్మా!'' అన్నాడు నానిగాడు బాధగా!
''అది తోలుబొమ్మలాట నాన్నా! అక్కడ తెరమీద కనిపించే రాజులు వెనకబడ్డ తరగతులకు, కొండజాతి ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నట్లు కన్పిస్తారు. అంతే! కాని ఆ రాజులను తెరమీదికి తెచ్చేదీ, వారిని ఆడించేది తెరవెనక ఉండే సూత్రధారులు! ఆ రాజులు ఏమీ చేయలేరు! సూత్రధారులు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతారు అంతే!'' అర్థమైందా?'' అన్నది తల్లి.
అర్థమైందని తలాడించాడు నానిగాడు!
- ఉషాకిరణ్, 9490403545