Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే నల్లగొండ జిల్లా ప్రజలు, రైతులు, అఖిలపక్ష నాయకులు కీ.శే. నర్రా రాఘవరెడ్డి అనేక మంది ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమకాల్వపైన ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పింది. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు ఆనాటి నుండీ నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో-ఆపరేటీవ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని, భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు నిర్మాణం చేసుకోని అనేక ఇబ్బందులు పడుతూ 1980-81 వరకు నడిపించారు. ఇక నుండి లిఫ్టులను నిర్వహించడం తమ వల్ల కాదని ప్రభుత్వమే నిర్వహించాలని పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసి డిపార్ట్మెంట్కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యత అప్పజెప్పింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడిసి ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లయి సరిగ్గాలేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జునసాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకు రైతులందరినీ వెంటతీసుకొని 2007లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి మరికొంత మంది నాయకులతో కలిసి వారం రోజుల పాటు పాదయాత్ర చేపట్టి, ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి తీసుకొచ్చి, సెపరేట్ ఫీడర్ లైన్ వేయించి 18 గంటలు కరెంట్ సప్లయి అందే విధంగా ఏర్పాటు చేయించడం జరిగింది. తర్వాత కాలంలో ప్రభుత్వం పర్మినెంట్ సిబ్బందిని నియమించకపోవడం వలన మోటార్లు రిపేరుకు రావడం, కాల్వలు దెబ్బతినడం వలన లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది.
2013-14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు వరల్డ్ బ్యాంక్ నుండి 4 వేల కోట్లు నిధులు కేటాయించారు. దాని నుండి లిఫ్టుల పూర్తి స్థాయి మరమ్మతులకు 200 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఐడిసి అధికారులు కోరినప్పటికీ సగం మాత్రమే (100కోట్లు) కేటాయించారు. లిఫ్టుల మరమ్మతులు పూర్తి స్థాయిలో కాకుండా 50శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టులన్నింటిని ఐడిసి డిపార్ట్మెంట్ల నుండి తీసి ఎన్ఎస్పి డిపార్లమెంట్కు నిర్వాహణ బాధ్యత అప్పజెప్పారు. కొంతకాలం తర్వాత ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ నుంచి తీసి ఐబి డిపార్ట్మెంట్కు నిర్వాహణ బాధ్యతలు అప్పగించారు. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా పర్మినెంట్ సిబ్బందిని నియమించలేదు. పైగా ఐబి డిపార్ట్మెంట్ వారికి ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేని పరిస్థితి ఏర్పడింది. ఈనాడు ఈ లిఫ్టులన్ని పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సందర్భంలో, 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లో, వారి ఎన్నికల మానిఫెస్టోలో సాగర్ ఎడమకాల్వ పైన ఉన్న లిఫ్టులు అన్నింటిని ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామి ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిధులు కానీ, సిబ్బందిని కానీ నియమించకుండా రైతులకే వదిలేయడం దారుణమైన విషయం. రైతులు లిఫ్టులను నిర్వహించలేక నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వమే నడిపిస్తుందని ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలి పోయాయి. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తి అవుతున్నా లిఫ్టుల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐదు నియోజక వర్గాల (నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ) పరిధిలో ఉన్న వేలాది మంది లిఫ్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ఈ నియోజకవర్గాల నుండి ఎన్నికైన శాసనసభ్యులు, జిల్లా మంత్రి దృష్టికి అనేక సార్లు ఈ సమస్య తీసుకెళ్ళినా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేయవలసి ఉంది. నాగార్జునసాగర్ ఎడమకాల్వ పైన ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు, తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. ఈ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జూన్ 27 సోమవారంనాడు నల్లగొండ ఐబిసిఈ ఆఫీసు ముందు రైతులు ధర్నాకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, లిఫ్టుల నిర్వహణ భాద్యత ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహించాలి. పరిష్కారం చేయని పక్షంలో సాగర్ ఎడమ కాల్వ లిఫ్ట్ రైతుల సమస్యపై మరో ఉద్యమాన్ని నడిపించవలసి వస్తుంది.
- జూలకంటి రంగారెడ్డి