Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్రలో రెండున్నరేండ్లుగా పాలన చేస్తున్న మహావికాస్ ఆగాడీ(ఎంవిఎ)ప్రభుత్వ సంక్షోభం అయిదు రోజులుగా సాగుతున్నది. రాష్ట్రపతి ఎన్నికలపై ఉండాల్సిన దేశం దృష్టి ఇప్పుడు ఆ రాష్ట్రంవైపే కేంద్రీకృతమైంది. బీజేపీతో చేతులుకలిపి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి నిష్క్రమించిన మంత్రి ఏక్నాథ్ షిండే తనతో 40మంది ఎంఎల్‌లు ఉన్నారని చెబుతున్నారు. శివసేన మొత్తం బలం 56లో ఇది 2/3 వంతుల కంటే ఎక్కువేవుంది గనక ప్రభుత్వ పతనం తప్పదని అంతా భావించారు. రాజకీయ లెక్కలు, ఫిరాయింపు చట్టం నిబంధనలు, కేంద్ర బీజేపీ వ్యూహాలు, కోర్టుల జోక్యాలు వీటన్నిటి దృష్ట్యా ఇది మరికొన్ని రోజులు పరిష్కారం కాకపోవచ్చు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఎన్‌సిపి, కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టు ఇది శివసేనలో పుట్టిన ముసలం. భాగస్వామ్య పక్షాలు గట్టిగానే ఉండగా మన వాళ్లే మనకు ద్రోహం చేసిన ఫలితమిది అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య వాస్తవమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత, ఫిరాయింపుల క్రీడలో ఆరితేరిన బీజేపీ ప్రత్యక్ష మద్దతుతోనే ఈ పరిస్థితి వచ్చిందనేది మరింత నిజం. 2014లో మోడీ అధికారం చేపట్టినత తర్వాత ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టిన జాబితా చాలా పెద్దదే. అరుణాచల్ ప్రదేశ్‌తో మొదలై బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లలో బీజేపీ ప్రత్యక్షపాత్ర, పరోక్ష కుట్రలతో సర్కార్లు కూలాయి. మహారాష్ట్ర ఈ ప్రక్రియలో తాజా ఘట్టం.
మహారాష్ట్రలో బీజేపీ కుయుక్తులు
మహారాష్ట్రలో శివసేన తన సహజ నేస్తమని బీజేపీ చెబుతుండేది. సేన అధినేతగా బాల్‌ఠాక్రే ఉన్నంతకాలం బీజేపీ అగ్రనేతలు ఆయనచుట్టూనే తిరిగేవారు. మధ్యమధ్యలో ఆయన అలిగితే అద్వానీ వంటివారు వెళ్లి బుజ్జగించి వచ్చేవారు. ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా శివసేనకు చెందినవారే ఉండటం, వారిని కూడా ఠాక్రే రీమోట్తో పాలిస్తానని చెప్పడం పరిపాటి. కానీ తర్వాత 2014లో విడిగానే పోటీ చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసింది. శివసేన ఈ ప్రభుత్వానికి దూరంగా ఉండిపోయింది. చాలాకాలం తర్వాత మళ్లీ చేతులుకలిపింది. 2019 ఎన్నికల తర్వాత శివసేన ముఖ్యమంత్రి పదవి తమకే రావాలని షరతు పెట్టగా బీజేపీ ససేమిరా ఒప్పుకోలేదు. ఆ దశలో ఎన్సీపీ నేత శరద్‌పవార్ మంత్రాంగం ఫలించి కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని ఎంవిఎ ఏర్పడింది. కేంద్రంలోని సేన మంత్రులు కూడా వైదొలగారు. ఎన్డీఏ కూటమిలో అతి పెద్ద గండి అది. అధికారానికి తిరిగివచ్చిన మోడీకి రాజకీయదెబ్బ. అందుకే ఈ కూటమికి పూర్తి అధిక్యత ఉన్నా ప్రభుత్వ స్థాపనకు ఆహ్వానించలేదు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి. పైగా ఈ లోపలే రహస్యంగా తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. పవార్ తమ్ముని కుమారుడు, రాజకీయ వారసుడైన అజిత్‌పవార్ ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరడం మరో సంచలనమైంది. ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే శివసేన లేదా ఇతరపక్షాల నుంచి ఎంఎల్ఎలు వచ్చేస్తారని బీజేపీ ఆశపడినా అది జరగదని తేలిపోయింది. అవమానకరంగా ఫడ్నవీస్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక ఎంవిఎ ప్రమాణస్వీకారమే తరువాయి అని భావిస్తున్న దశలో ఆరుగురు ఎన్సీపీ ఎంఎల్ఎలు కనిపించకుండాపోయారు. ఢిల్లీలో బీజేపీ నేతలకు దగ్గరగా ఉండే ఒక హోటల్లో ప్రత్యక్షమయ్యారు. అజిత్‌పవార్ తిరిగి ఇటువైపు రావడం వాటిలో ఒకటి. వీటన్నిటినీ దాటుకుని ఏర్పడిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంతో కేంద్రం నిరంతరం ఘర్షణపడుతూనే ఉంది. అక్కడి పోలీసు అధికారులు, మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ ఏవో కేసులు అరెస్టులు చేస్తూనే ఉన్నాయి. అనేక వివాదాలు, బెదిరింపులు, ఘర్షణలు కరోనాలోనూ వెంటాడాయి. ఆర్నబ్ గోస్వామి అరెస్టు, ఆయనకు అమిత్ షా మద్దతు వాటిలో భాగమే. దేశ ఆర్థిక రాజధాని, మాఫియాలకు నిలయమైన ముంబాయిలో ఇలాంటి నాటకీయ పరిణామాలు సర్వసాధారణం.
సేనలో లుకలుకలు
ముఖ్యమంత్రి ఉద్ధవ్ పద్ధతులు పాటిస్తున్నా తమ పార్టీనేతలకు భాగస్వామ్య పక్షాలకు అందుబాటులో ఉండటంలేదనే విమర్శలూ ఉన్నాయి. శివసేనకన్నా ఎన్సీపీ ఎక్కువ అధికారం చలాయిస్తుందనేది వారి ప్రధాన ఫిర్యాదు. కీలకశాఖలు ఎక్కువగా ఎన్సీపీ చేతుల్లోనే ఉండటం ఇందుకు కారణమైంది. ఇప్పుడు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్నాథ్ షిండే కూడా ఆ విధంగా కీలక శాఖ కోల్పోయారంటారు. నాలుగు సార్లు ఎంఎల్ఎగా ఎన్నికై మంత్రివర్గంలోనూ ముఖ్యుడుగా ఉన్న షిండే పార్టీలో రెండవస్థానంలో నేతగా చలామణి అయ్యారు. ఉద్ధవ్ శాసనసభలో లేరు గనక అక్కడ సేన సభానాయకుడుగానూ నియమితులయ్యారు. అయితే ఉద్ధవ్ కుమారుడైన ఆదిత్యఠాక్రే ప్రాబల్యం పెంచుకోవడం ఆయనకు మింగుడు పడలేదు. ఉద్ధవ్ తర్వాత కూడా తనకు నాయకత్వంరాదని గ్రహించిన షిండే తెరవెనక రాజకీయాలు నడిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పాలకకూటమి దెబ్బతిన్నది. అయిదో రాజ్యసభస్థానం బీజేపీ గెలుచుకోగలిగింది. శాసనమండలి ఎన్నికల్లోనూ ఆరుగురు అభ్యర్థులను పెడితే ఒకరు ఓడిపోయారు. మరోవంక బీజేపీ బలాన్ని మించి అయిదూ గెల్చుకుంది. క్రాస్‌ఓటింగ్ కనిపిస్తున్నా ఠాక్రే పరిస్థితి అర్థం చేసుకోకపోగా అసంతృప్తులతో చర్చలు జరిపే బాధ్యత షిండేకే అప్పగించారు. ఇక మంత్రి హోదాలో ఆయన నేరుగా దేవేంద్ర ఫడ్నవీస్తోనే చాంబర్లో చర్చలు జరపడం అందరికీ తెలిసిన విషయమే. ఈ కాలమంతటా బీజేపీ నేతలు గానీ షిండేగానీ పరస్పర విమర్శలే చేసుకోకపోవడం వారి బంధానికి నిదర్శనం. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉద్ధవ్ అయిదునెలలుగా అధికార కార్యాలయానికి హాజరుకాలేదు. ఆ సమయంలోనే షిండే అసమ్మతి వాదులను కూడగట్టగలిగారు.
నేరుగా గుజరాత్‌కు...
ఈ వారం మొదట్లో హఠాత్తుగా అదృశ్యమైన షిండే గుజరాత్‌లోని సూరత్‌లో తేలారు. ఈ పరిణామాలతో తమకేమీ సంబంధంలేదని బీజేపీ చెబుతున్నా ఆయన తన శిబిరం కోసం మోడీ మూలపీఠమైన గుజరాత్‌ను ఎంచుకోవడం యాదృచ్చికంకాదు. ఆ తర్వాత వారిపాలనలోని మరో రాష్ట్రం అస్సాం వెళ్లారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బసచేశారు. ఆయనతో మొదట 20మంది ఉన్నారని, తర్వాత ఆ సంఖ్య 40వరకూ పెంచారు. వాస్తవంగా ఎంతమంది ఉన్నారనేది పరీక్షలోనే తేలాలి. మామూలుగా తిరుగుబాటు చేసిన లేదా ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము ముఖ్యమంత్రులం కావాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా షిండే ఎంవిఎను విడనాడి బీజేపీతో కలవాలని షరతు పెట్టారు. అప్పటికే సభాపక్ష నాయకుడుగా ఆయనను తొలగించిన శివసేన మీరు తిరిగివస్తే పరిశీలిస్తామని చెప్పింది. ఈలోగా ఠాక్రే రాజీనామకు సిద్ధమేనని ప్రకటించి అధికార కార్యాలయం ఖాళీ చేసి స్వగృహానికి తరలిపోయారు. మొదట పన్నెండు, తర్వాత పదహారు మంది షిండే వర్గీయులను అనర్హులుగా ప్రకటించాలని డిప్యూటీ స్పీకర్‌ను శివసేన కోరింది. ఆయన వారికి నోటీసు ఇస్తారని అనుకుంటున్నారు. నోటీసు వస్తే స్పందిస్తామని షిండే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన స్పీకర్ అస్వస్థులుగా ఉండటంతో ఇప్పుడు డిప్యూటీ నరహరి జిన్మాల్ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయన సేనకు అనుకూలమే గనక అనర్హత ప్రకటించే అవకాశం ఎక్కువ. అనర్హత వేటుకు గురైతే బలాబలాలు మారతాయి. ఈలోగానే కోర్టులకువెళ్లడం, స్టేలు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి.
సాంకేతిక రాజకీయ సవాళ్లు
శాసనసభాపార్టీలో మూడింట రెండు వంతుల మంది తిరుగుబాటు చేస్తే అనర్హత వర్తించదు. అయితే వారు మరోపార్టీలో విలీనం కావలసి ఉంటుంది. వారిని వేరే గ్రూపుగా గుర్తించడం లేదా అసలైన పార్టీగా పరిగణించడం అన్నది ఎన్నికల కమిషన్ చేయవలిసిన పని. అందుకు సమయం పడుతుంది. ఇప్పటి వరకూ జరిగిన దాన్ని బట్టి వారు బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఎక్కువే. అయితే బీజేపీ మాత్రం ఇది సేన అంతర్గత వ్యవహారమనీ తమపాత్ర లేదనీ ప్రభుత్వ స్థాపన కోసం అడగలేదనీ చెబుతోంది. 105మంది సభ్యులున్న బీజేపీ ఇండిపెండట్ల మద్దతు షిండేవర్గం కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తర్వాత వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చే విధంగా కర్నాటకలోనూ ఎంపీలోనూ అనుసరించిన పాతఎత్తుగడ ఇక్కడా పునరావృతం కావచ్చు. ఈ లోగా షిండే తమ మద్దతు ఉపసంహరించాము గనక సభలో బలపరీక్ష జరపాలని కోరాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా జరిగినా ఉద్ధవ్‌కు వారు మద్దతు ఇవ్వరనేది స్పష్టమే. అప్పుడు కూటమిలో ఎన్సీపీ పెద్ద పార్టీ అవుతుంది. వారు నాయకత్వం తమకు రావాలని అడుగుతారా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. గవర్నర్ కోషియారి ఆదినుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రవర్తించడం జరిగేది కాదు. కనుక మహారాష్ట్ర సంక్షోభం క్లైమాక్స్ కేంద్రం వ్యూహంపైన, కోర్టుల ఆదేశాలపైన ఆధారపడి ఉంటుంది. బలాబలాల పరీక్ష శాసనసభ వేదికపైనే జరగాలన్న బొమ్మై కేసు తీర్పు ఇక్కడ శిరోధార్యం. దేశ ప్రజలూ రాజకీయ పక్షాలూ బీజేపీ నీతిబాహ్య నిరంకుశ పోకడల తీవ్రత తెలుసుకోవడానికి మహారాష్ట్ర సంక్షోభం తాజా ఉదాహరణగా నిలుస్తుంది.
- తెలకపల్లి రవి