Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)' తాజాగా 'గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ (ప్రపంచ నివాసయోగ్య సూచిక)-2022'ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం విశ్వ నగరాల్లో అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసిన 173 నగరాల్లో సంస్కృతులు, విద్యా వసతులు, వైద్య ఆరోగ్య వసతులు, రాజకీయ స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వనరులు అనబడే ఆరు అంశాల అధ్యయనం ఆధారంగా ప్రముఖ నగరాల నివాసయోగ్యత లను 100 పాయింట్ల స్కేల్‌తో నిర్ణయించారు.
అత్యుత్తమ నివాసయోగ్యత గల 10 ప్రపంచ నగరాలు: అత్యున్నత నివాసయోగ్యత కలిగిన నగరాల తొలి 10స్థానాల్లో వియన్నా (ఆస్ట్రియా, 99.1/100), కోపెన్హాగన్ (డెన్మార్క్, 98.0/100), జూరిచ్ (స్విస్, 96.3/100), కల్గరీ (కెనడా, 96.3/100), వాన్కోవర్ (కెనడా, 96.1/100), జెనీవా (స్విస్, 95.9/100), ఫ్రాక్ఫర్ట్ (జర్మనీ, 95.7/100), టొరంటో (కెనడా, 95.4/100), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్, 95.3/100), ఓసా (జపాన్, 95.0/100)తో కలిసి మెల్బర్న్ (ఆస్ట్రేలియా, 95.0/100) 10వ స్థానంలో నిలిచాయి.
నివాసయోగ్యతలో చిట్టచివరి స్థానాల్లో నిలిచిన 10నగరాలు : నివాసయోగ్యత సూచికల జాబితాలో చిట్టచివరి 172వ స్థానంలో డమాస్కస్ (సిరియా, 30.7/100), 171వ స్థానంలో లాగోస్ (నైజీరియా, 32.2/100), తరువాత ట్రిపోలీ (లిబియా, 34.2/100), అల్జియర్స్ (అల్జీరియా, 37.0/100), కరాచీ (పాకిస్థాన్, 37.5/100), పోర్ట్ మోర్స్బీ (పపువా న్యూ గ్వినియా, 38.8/100), ఢాకా (బంగ్లాదేశ్, 39.2/100), హరారె (జింబాబ్వే, 40.9/100), డౌలా (కమెరూన్, 43.3/100), 163వ స్థానంలో టెహ్రానా (ఇరాన్, 44.0/100)లు నిలిచాయి. నివాసయోగ్యతపై ప్రతికూల ప్రభావాలకు కారణాలుగా యుద్ధాలు, సంఘర్షణలు, తీవ్రవాదం, విపత్తులు పేర్కొనబడినవి.
కరోనాతో మారిన నివాసయోగ్యత సూచీలు : కరోనా మహావిపత్తు విధ్వంసానికి తీవ్రంగా ప్రభావితం అయిన కారణంగా గత ఏడాది 60వ స్థానంలో ఉన్న లండన్ (యూకె) నేడు 33వ స్థానానికి, లాస్ వేగాస్ (యూయస్) 18 నుండి 37వ స్థానానికి, వెల్లింగ్టన్ 4 నుంచి 50వ స్థానానికి, ఆక్లాండ్ తొలి స్థానం నుంచి 34వ స్థానానికి, అడలైడ్ 2 నుంచి 30వ స్థానానికి, పెర్త్ 26 నుంచి 32కు, బ్రిస్బెన్ 17 నుంచి 27వ స్థానానికి దిగజారడం గమనించారు. కెనడా నగరాలు తొలి 10స్థానాల్లో చోటు దక్కించుకోగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నగరాలు జాబితాలో దిగజారడం జరిగింది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న వేళ కీవ్ నగరాన్ని అధ్యయనం నుంచి మినహాయించారు.
నివాసయోగ్యతలో భారత నగరాలు తొలి 10స్థానాల్లో స్థానం దక్కించుకోకపోవడం కొంత విచారకరం. కాగా జాబితాలో చిట్టచివరి 10స్థానాల్లో కూడా లేకపోవడం కొంత ఊరటను ఇస్తున్నది. కరోనా నిబంధనలతో పాటు నగరాల జీవన వ్యయాలు కూడా నివాసయోగ్యతలను ప్రభావితం చేయడం గమనించబడిందని నివేదిక స్పష్టం చేస్తున్నది.
(ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా విడుదల చేసిన 'గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్-2022' నివేదిక ఆధారంగా)
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్: 9949700037