Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసి నేటికి వంద రోజులు. అయినా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆర్డర్కాపీ అందని దుస్థితి! విధులనుండి తొలగించి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చిందని సంతోషపడాలో, ఆర్డర్కాపీ రాలేదని బాధపడాలో అర్థం గాని అయోమయస్థితిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారించేందు కోసం వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధిహామీ చట్టంలో గత 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు క్షేత్రస్థాయిలో అనేక రాజకీయ వేధింపులుతోపాటు పని ఒత్తిడికి గురయ్యారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, చాలీచాలని వేతనాలు, మరోపక్క ఫీల్డ్ అసిస్టెంట్ల మనుగడకే ప్రమాదం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 47, 79 జీఓ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ 2020 మార్చి 12న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,500మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెచేశారు. సమ్మె కొనసాగిస్తున్న దశలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రారంభం కావడం, మరోపక్క సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం మూలంగా సమ్మె విరమించి ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి చేరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వంపై సమ్మె చేస్తారా? అన్నట్టుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ 2020 మార్చి 18న ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించింది. దీనిపై ఫీల్డ్ అసిస్టెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం డిసెంబర్ 2న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధిలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సైతం బుట్టదాఖలు చేసింది. నాగార్జునసాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల అనంతరం పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, బిక్షాటనలు, రాస్తారోకోలు, ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి వంటి పలు రకాల నిరసన కార్యక్రమాలు, చలోఅసెంబ్లీ వంటి మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి పెరగడంతో మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి జూన్ 27కు వంద రోజులు పూర్తయ్యాయి. అయినా నేటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. గత వంద రోజుల నుండి ప్రతిరోజూ ప్రజాప్రతినిధులను, మంత్రులను, గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ శాఖ అధికారులను కలుస్తూ తమ గోడును వినిపిస్తున్నా ముఖ్యమంత్రికి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య పరిష్కరించాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి, ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.
- మట్టిపల్లి సైదులు
సెల్ :8106778287