Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో అనేకమంది హిందూ రాజులు హిందూ రాజులతో యుద్ధాలు చేశారు. ముస్లిం రాజులు ముస్లిం రాజులతో తలపడ్డారు. హిందూ రాజులు అనేకమంది, ముస్లిం సైన్యాధిపతులనూ, మంత్రులనూ, సైన్యాన్నీ నియమించుకున్నారు. ముస్లిం రాజులు కూడా హిందూ సైన్యాధిపతులనూ, మంత్రులను, రాయబారులను అనేకమందిని నియమించుకున్నారు. ఈ విషయం మధ్యయుగాల కాలంలో హిందూ ముస్లిం రాజులలో మత సామరస్య భావనను తెలియజేస్తోంది. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలను పరిశీలిద్దాం...
సామాన్య శకం 1210లో ఇల్ తుత్ మిష్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఇతని పరిపాలన కాలంలో బెంగాల్, బీహార్ ప్రాంతాల రాజయిన ఇవాజ్ స్వతంత్రం ప్రకటించు కున్నాడు.1227లో ఇవాజ్ను ఇల్ తుత్ మిష్ కుమారుడు ఓడించి హతమార్చాడు.
పదమూడవ శతాబ్దంలో రాజపుత్ర రాజులలో కలహాలు చాలా తీవ్రంగా ఉండేవి. వారిలో కొందరు ముస్లిం రాజులకు సహకరించేవారు. ఉదాహరణకు ఇల్ తుత్ మిష్ సైన్యాలు గుజరాత్‌లోని రాజపుత్ర రాజుపై దాడి చేసినప్పుడు, మాల్వా, దేవగిరిలను పాలించే రాజపుత్ర రాజులు కూడా గుజరాత్ రాజుపై మరో వైపు నుండి దాడి చేసి ఇల్ తుత్ మిష్ అనే ముస్లిం రాజుకు సహకరించారు.
15వ శతాబ్దంలో మేవార్ రాజయిన రాణా కుంభ అనే రాజపుత్ర రాజుపై, అతని సోదరుడు మోకల్ తిరుగుబాటు చేయగా, మహమ్మద్ ఖిల్జీ అనే మాల్వా పాలకుడు మోకల్కు సహకరించాడు. అంతేకాదు, రణ కుంభ మార్వార్‌కు చెందిన రాథోడ్‌లు అనే హిందూ రాజులతో కూడా వైరం పెంచుకొని, వారితో అనేకసార్లు పోరాటం సల్పాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే గద్దెకోసం రణ కుంభాను అతని కుమారుడు ఊదాయే హతమార్చాడు.
16వ శతాబ్దంలో మాల్వాలో సింహాసనం కోసం జరిగిన ఘర్షణలో మహమూద్-2 అనే ముస్లిం రాజుకు మేదినీరారు అనే రాజపుత్ర రాజు సహకారం అందించాడు.
సామాన్య శకం 1526లో బాబర్‌ను భారతదేశం మీదికి దండెత్తి, మరో ముస్లిం రాజు ఇబ్రహీంలోడీని గద్దె దించడానికి రమ్మని ఆహ్వానించిన వారిలో పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్, మేవార్ రాజయిన రాజపుత్రుడు రాణా సంఘా ఉన్నారు. చివరకు రాణా సంఘ యుద్ధంలో బాబర్ సహాయానికిరాలేదు కానీ ఆ తరువాత 1527లో బాబర్‌తో ఖాన్వా అనే ప్రదేశంలో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధంలో సంఘాకు ఇబ్రహీంలోడీ సోదరుడు మహమూద్ లోడీ సహకారం అందించాడు. మేవాత్ పాలకుడు హసన్ ఖాన్ కూడా సంఘకే మద్దతుగా సైన్యాన్ని పంపాడు. ఈ యుద్ధంలో బాబర్ గెలిచాడు.
సామాన్య శకం 1530లో హుమాయూన్ ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. ఈయనపై ఆఫ్ఘన్ ముస్లింలు తిరుగుబాటు చేశారు. వారిపై హుమాయూన్ దాడి చేసి ఓడించాడు. ఆ తర్వాత షేర్ ఖాన్ పై దాడి చేసి అతనిని తన సామంతుడుగా చేసుకున్నాడు. అలాగే తాతర్ ఖాన్‌పై దాడి చేసి, అతనిని చంపివేశాడు. ఆ వెంటనే గుజరాత్ పాలకుడు అయిన బహదూర్ షాపై దాడి చేస్తే, అతను కథియ వార్ పారిపోయాడు.
తరువాత1539లోనూ, 1540లోను హుమాయూన్ కు, షేర్ ఖాన్‌కు మధ్య యుద్ధాలు జరిగాయి. రెండింటిలోనూ షేర్ ఖానే విజయం సాధించాడు. హుమాయూన్ పర్షియా పారిపోయాడు.
అదే సమయంలోమార్వార్ పాలకుడైన మాల్దేవ్ అనే రాజపుత్ర రాజు అనేకమంది రాజపుత్ర రాజులతో విరోధం పెంచుకొని యుద్ధాలు చేశాడు. వారిలో బికనీర్ రాజు ఒకడు. మాల్దేవ్, యుద్ధంలో బికనీర్ రాజును చంపి వేయగా, బికనీర్ రాజ కుమారులు షేర్ షాను ఆశ్రయించి, అతని కొలువులో సైనికాధికారులు అయ్యారు. అలాగే మాల్దేవ్ సమీప బంధువైన మేర్తా రాజా బైరం దేవ్ కూడా మాల్దేవ్ వలన రాజ్యాన్ని కోల్పోయి షేర్ షా వద్ద సైనికాధికారి పదవిని సంపాదించాడు.
ఇక అక్బర్ పాలనా కాలాన్ని గూర్చి తెలుసు కుందాం. ఢిల్లీ పాలకుడైన అక్బర్‌ను దేశం నుండి తరిమి వేయాలని బెంగాల్ పాలకుడైన ఆదిల్షా అనే ముస్లిం రాజు నిర్ణయించి హేము అనే తన హిందూ సైన్యాధిపతిని పంపాడు.1556లో వారిద్దరికీ మధ్య జరిగిన యుద్ధంలో అక్బర్ గెలుపొందాడు.
ఆ తర్వాత మేవాడ్ రాణా ప్రతాప్ పై అక్బర్ దాడి చేశాడు. ఆ దాడికి అక్బర్ సైనిక అధికారి రాజా మాన్ సింగ్ అనే రాజపుత్ర వీరుడు నాయకత్వం వహించాడు. రాణా ప్రతాప్ సైన్యానికి హకీమ్ ఖాన్ నాయకత్వం వహించాడు. హల్దిఘాట్ వద్ద జరిగిన ఆ యుద్ధంలో అక్బర్ సేనలు పైచేయిగా ఉన్న పరిస్థితుల్లో రాణా ప్రతాప్ యుద్ధభూమి నుండి అడవుల్లోకి తప్పించుకొని వెళ్లి అక్కడి నుండి గెరిల్లా యుద్ధం కొనసాగించాడు.
బెంగాల్, బీహార్ల ముస్లిం సామంతులు తిరుగుబాటు చేయగా, వారిపైకి అక్బర్ తన హిందూ సైనిక అధికారులైన తోడర్ మల్, భగవాన్ దాస్‌లను పంపాడు. అక్బర్ సోదరుడైన మీర్జా హకీమ్ తిరుగుబాటు చేయగా, అతని పైకిరాజా మాన్ సింగ్ నాయకత్వంలో మరో సైన్యాన్ని పంపాడు. ఖైబర్ మార్గాన్ని ఆక్రమించిన ముస్లిం తిరుగుబాటుదారులపైకి రాజా బీర్బల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. తిరుగుబాట్లన్నీ అణచివేయబడ్డాయి గాని ఒక యుద్ధంలో రాజా బీర్బల్ ప్రాణాలు కోల్పోయాడు.
మరో విశేషం ఏమిటంటే తోడర్ మల్ షేర్ షా కొలువులోనూ, అక్బర్ కొలువులోనూ రెవెన్యూ మంత్రిగా కూడా పని చేశాడు.
బీజాపూర్ పాలకుడు ఆదిల్షా తన గ్రంథాలయానికి అధికారిగా వామన్ పండిట్ అనే హిందూ పండితుడిని నియమించాడు. అతని వారసుడు ఆదిల్షా- 2 సరస్వతి దేవిని స్తుతిస్తూ పాటలు రాశాడు. ఆయనే పంధర్పూర్లోని విఠోబా దేవాలయానికి జాగీరు ను మంజూరు చేశాడు. అహ్మద్ నగర్ పాలకుడైన ఇబ్రహీంకుతుబ్ షాకు పీష్వాగా అంటే ప్రధానమంత్రిగా మురహరిరావు ఉండేవాడు.1672 నుండి 1687 వరకు గోల్కొండ రాజ్య మంత్రులుగా అక్కన్న, మాదన్నలు ఉండేవారు.
ఇక ఔరంగజేబు, ఆయన సమకాలీనుల కాలంలో ఉన్న మత సామరస్య వివరాలను పరిశీలిద్దాం... ఔరంగజేబు అస్సాం పాలకులైన అహౌమ్లతో చేసిన సుదీర్ఘ యుద్ధంలో, ఆయన సైన్యాలకు అంబర్ పాలకుడు రాజా రామ్ సింగ్ నాయకత్వం వహించాడు. ఔరంగజేబు పాలనలో జాట్లు అనబడే హిందూ రైతులు తిరుగు బాటు చేయగా వారితో జరిగిన పోరాటంలో స్థానిక హిందూ జమిందార్ లందరూ ఔరంగజేబుకు మద్దతుగా పోరాడారు. చివరకు జాట్ రైతుల తిరుగుబాటు అణిచి వేయబడింది. అలాగే ఆఫ్ఘన్ ముస్లింల తిరుగుబాటును అణచి వేయడానికి ఔరంగజేబు మార్వార్ పాలకుడైన మహారాజా జస్వంత్ సింగ్‌ను ఆఫ్గన్ ప్రాంతానికి చెందిన జుమ్రూద్ కోటకు ఠానేదా రుగా నియమించాడు. రాజా జస్వంత్ సింగ్, మొగల్ సైన్యాధికారి సుజాత్ ఖాన్లకు చెందిన హిందూ, ముస్లింల ఉమ్మడి సైన్యం ఆఫ్ఘన్ల తిరుగుబాటును అణచి వేసింది.
ఔరంగజేబును ఎదిరించిన వారిలో ప్రముఖుడైన శివాజీని అణచడానికి ఆయన పంపిన పెద్ద సైన్యానికి రాజా జై సింగ్ నాయకత్వం వహించాడు. మొగలుల కోటల్లో ఒకటయిన కొండానా కోటకు రక్షకుడుగా ఔరంగజేబు ఉదయభాను అనే హిందూ సేనానిని నియమించాడు. అంతేకాదు. ఔరంగజేబు మంత్రుల్లో ముఖ్యుడు రఘునాథ దాస్ అనే రాజపుత్ర వీరుడు.
మరో ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఔరంగజేబు పదవులను కేటాయించేటప్పుడు' 'మతం కారణంగా ఉన్నత పదవులు ఇవ్వాలి' అనే ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించాడు. ఒక ముస్లిం వ్యక్తి ఆయనకు 'మతం కారణంగా తనకు పదవి నీయమ'ని ఒక వినతి పత్రాన్ని సమర్పించినప్పుడు ఔరంగజేబు ''మతంతో ప్రాపంచిక విషయాలకు ఉన్న సంబంధమేమిటి? నీవు కోరిన విధంగా పదవులు ఇస్తే, హిందూ పాలకులను, వారి అనుయాయులను వెలివేసే బాధ్యత నాదే అవుతుంది'' అని వ్యాఖ్యానించాడని ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ సతీష్ చంద్ర ''మధ్యయుగాల భారతదేశం'' అనే గ్రంథంలో 310, 311 పేజీలలో వివరించాడు. అలాంటి అభిప్రాయమే మొఘల్ పాలకులు అందరిలోనూ ఉండేది. విశేషమేమంటే హిందూ సంస్థానాధీశులు అక్బర్ పాలనలో 16శాతం మంది ఉంటే, షాజహాన్ కాలంలో వారు 24శాతానికి పెరిగి, ఔరంగజేబు పాలనలో 33శాతానికి పెరిగారనీ, ఔరంగజేబుసేనలో వేలాది మంది జాట్లు, మరాఠాలు, రాజపుత్రులూ ఉన్నారనీ చరిత్రకారులు చెబుతున్నారు.
ఇక శివాజీకి సంబంధించిన మతసామరస్య వివరాలు తెలుసుకుందాం. శివాజీ 1656లో మరాఠా నాయకుడు చంద్రరావు మోరే అధీనంలోని జావ్లీ కోటను ఆక్రమించాడు. ఆ తరువాత తన మేనమామ శంభాజీ మహితే నుండి సూప దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శివాజీని అణచడానికి బీజాపూర్ నవాబు అఫ్జల్ ఖాన్‌ను పంపాడు. అఫ్జల్ ఖాన్, తనతో సంప్రదింపులకు రావలసిందిగా కోరుతూ, తన దూతగా కృష్ణా జి భాస్కర్ అనే మరాఠా బ్రాహ్మణుడిని తన దూతగా శివాజీ వద్దకు పంపాడు. ముస్లింలు హిందువులను రాయబారు లుగా నియమించుకున్నారు అనేందుకు ఇది రుజువు.
ఇక శివాజీ సైన్యాన్ని పరిశీలిస్తే, ఆయన నౌకా దళాధిపతి దర్యా సారంగ్ దౌలత్ ఖాన్. శివాజీ యొక్క దౌత్యాధికారి కాజీ హైదర్. నూర్ ఖాన్ బేగ్ శివాజీ యొక్క పదాతి దళ అధికారి. సిద్దీ హిలాల్ అనే ముస్లిం ఆయన యొక్క సైన్యాధికారుల్లో ఒకడు. అంతేకాదు. శివాజీని ఆగ్రాలో ఔరంగజేబు గృహనిర్బంధం చేసినప్పుడు ఆయన తప్పించుకొని పోవడానికి సహకరించిన కొద్దిమంది అనుచరుల్లో మదారి మెహతర్ అనే ముస్లిం ఉన్నాడు.
పై అంశాలన్నీ మధ్యయుగాలలో మత సామరస్యం ఉండేదనీ, యుద్ధాలన్నీ వ్యక్తిగతంగా అధికారం కోసం జరిగినవేననీ, అందువలననే హిందూ రాజులకు ముస్లిం రాజులూ, ముస్లిం రాజులకు హిందూ రాజులూ సహకరించుకున్నారనీ, హిందూ రాజులు ముస్లింలనూ, ముస్లిం నవాబులు హిందువులనూ వేలాదిగా తమ సైన్యాలలో చేర్చుకున్నారనీ రుజువు చేస్తున్నాయి.
పై విషయాలన్నీ ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ వీ.డి.మహాజన్ ''ఇండియా సిన్స్ 1526'' అనే గ్రంథంలోనూ, ప్రొఫెసర్ సతీష్ చంద్ర ''మధ్యయుగాల భారతదేశం'' అనే గ్రంథంలోనూ విపులంగా వివరించారు. అలాంటి మత సామరస్య భావనను కొనసాగించడమే నేటి దేశ భక్తులందరి కర్తవ్యం.
- కెఎల్ కాంతారావు