Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాక మొత్తం దేశంలోనే అత్యంత వెనుకబడిన తెగ చెంచు తెగ. అడవిలో ఉండే వీరి గృహ సముదాయాలను పెంటలు అంటారు. ఈ పెంటల్లో ఇప్పటికీ అనారోగ్యం, పోషకాహార లోపం, ఆర్థికంగా వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే వారి సాంస్కృతిక వారసత్వం మాత్రం అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నట్లు చారిత్రక, సమకాలీన సాక్ష్యాలు తెలుపుతాయి. ప్రపంచంలో అంతరించి పోతున్న ప్రధాన తెగలలో చెంచుజాతి ఒకటని యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రకటించడం ఆవేదన కలిగిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న చెంచులు ఆదిమానవ జాతులకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటుపడ్డ చెంచుల జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48,053. చెంచుల్లో అక్షరాస్యత ఇరవై ఐదుశాతం మాత్రమే కావడం ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం. కృష్ణానదికి ఇరువైపులా తెలుగు రాష్ట్రాల్లో వీరు విస్తరించి ఉన్నారు. పది పార్లమెంట్ నియోజకవర్గాలు, 30అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన వీరి జీవనం నేటికీ దుర్భరంగానే ఉంది. ప్రకృతి వనరులే వీరికి జీవనాధారం. అవిభక్త మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో వీరు స్వయం పాలన కూడా సాగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధునిక సమాజం చెంచుల స్వయం పాలనను విచ్ఛిన్నం చేసినప్పుడల్లా పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ఫలితమే కనీసం కొన్ని అభివృద్ధి ఫలాలైనా చెంచుల చెంతకు చేరాయి. 1950లో హైదరాబాద్ రాష్ట్రంలో వీరిని షెడ్యూల్ తెగలుగా గుర్తించారు. నల్లమలలో నివసిస్తున్న చెంచు తెగ అంతరిస్తోందన్న పరిశోధనా ఫలితాలతో వీరిని కాపాడాలని ప్రభుత్వం 1975లో నిర్ణయించింది.
అనేక ప్రభుత్వాలు వచ్చి వెళ్లిపోయినా, చెంచు ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. పౌష్టికాహారం లేకపోవడం, శుభ్రమైన ఆహారం, సమతుల ఆహారం లేకపోవడం, దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు తదితర కారణాల వల్ల రక్తహీనత, మలేరియా, క్షయ, డయేరియా, వైరల్ ఫీవర్ తదితర రోగాలకు వీరు తరచూ గురవుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్న దాఖలాలు లేవు. ఏడు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలోనూ, ఏడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలోనూ చెంచులకు ఇప్పటి వరకు ఒనగూడిందేమీ లేదు. అటవీ సంపద చెంచుల ద్వారా పట్టణ ప్రాంతాలకు చేరుతోంది. చెంచుల చెంతనే ఉన్న కృష్ణానదీ జలాలు తాగునీటిగా, సాగునీటిగా, జల విద్యుత్తుగా మారి ఎంతోమంది అవసరాలను తీరుస్తున్నాయి. కానీ, చెంచులు మాత్రం తాగేందుకు నేటికీ 'చెలిమల' (చిన్న చిన్న గుంటలు తవ్వుకుని వాటిలో చేరే) పైనే ఆధారపడి ఉన్నారు. రాత్రివేళ చీకటితో సహవాసం చేస్తుంటారు. అడవిలో దొరికే గడ్డి, కర్రలతో వేసుకునే గుడిసెలే వీరికి రాజమందిరాలు. మూలికలు, ఆకుల వైద్యమే వీరికి దివ్యౌషధం. చెంచులను మూడు రకాలుగా చూడవచ్చు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని గూడేలలో నివసిస్తున్న వారు 'కోర్ ఏరియా' చెంచులు. అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలు, పట్టణాలకు వచ్చి జీవిస్తున్న వారు మైదాన ప్రాంత చెంచులు. దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు వలస చెంచులు. నిజాం సర్కారు హయాంలో 'చెంచు రిజర్వ్' అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం చెంచులకు ప్రత్యేక సదుపాయాలు వచ్చాయి. 2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం 'చెంచు రిజర్వ్' అమలు కొనసాగించాల్సి ఉంది. 2008లో భూపంపిణీ చట్టం తెచ్చారు. చెంచులకు పట్టాలు ఇచ్చారు. భూమిని చూపించడం మాత్రం మరిచారు, అక్కడక్కడా దక్కిన పొలాలు భూస్వాములు, వడ్డీవ్యాపారులకు చేరాయి. సొంతంగా భూమి లేకపోవడంతో చెంచులు తమ ప్రాంతంలోనే కూలీలుగా జీవించాల్సి వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నా వారి గూడేలు మాత్రం చిమ్మచీకట్లోనే మగ్గుతున్నాయి. రాత్రిళ్లు విషపూరిత పాములు, జంతువులు వస్తూ ఉంటాయి. చీకటిపడితే వృద్ధులు, పిల్లలు, మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతుంటారు. నల్లమల అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ప్రకటించి మనుషులు జీవించకూడదనే వంకతో చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించి, అడవిని, అటవీ సంపదను కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెదురు నరకనీయకుండా. నెత్తిన మోపులు తెచ్చుకోనీయ కుండా ఫారెస్టు అధికారులు చెంచులను నిత్యం వేధిస్తుంటారు. దట్టమైన అడవిలో ఉన్న చెంచు గిరిజన గూడేలకు రహదారి సౌకర్యాలు కూడాలేవు. చెంచులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలొచ్చినా జోలికట్టి, అందులో రోగిని పడుకోబెట్టి మైదాన ప్రాంతంలోని వైద్యశాలలకు తీసుకెళ్తారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే చనిపోతున్నారు. టిబి, రక్తహీనత, మలేరియా, చర్మవ్యాధులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు సరైన వైద్యం అందక మత్యువాత పడుతున్నారు. ఎవరొచ్చినా ఏమున్నది గర్వకారణమన్నట్లు ఎన్ని రాజకీయ పార్టీలూ, ప్రభుత్వాలూ మారినా చెంచుల బతుకుల్లో మార్పు లేదు. వారి అభివద్ధికి అటవీ భూములకు పట్టాలివ్వాలి. రహదారి సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్, పక్కాగహాలు, వైద్య సదుపాయాలు కల్పించాలి. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు, క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్యం, పౌష్టికాహారం అందించాలి. అడవిలో సేకరించిన ఫలసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయ అభివద్ధికి అవసరమైన రుణాలు, పనిముట్లు అందజేయాలి. ఐటిడిఎలో ఉన్న దళారీ వ్యవస్థను రూపుమాపి, అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి శ్రద్ధ చూపితే- చెంచు తెగ అంతరించి పోకుండా కాపాడవచ్చు.
- జటావత్ హనుము,
సెల్: 8519836308