Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సూర్యం అంకుల్ ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారెందుకమ్మా? ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో దొంగలు గాని పడ్డారా ఏమిటి?' అంటూ ఇంట్లోకి వస్తూనే అడిగాడు చిన్నా. తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్నా చురుగ్గా ఉంటాడు. ఆ వీధిలో వాళ్ళందరికీ చిన్నా పరిచయమే. వాడి అమ్మ వీణ, నాన్న మాధవ్‌లను ఆ వీధిలో కొందరు ఆ పేర్లతో పిలవరు. చిన్నా వాళ్ళ అమ్మ, చిన్నా వాళ్ళ నాన్న అని ప్రస్తావిస్తారు.
ఆ వీధిలోనే ఉంటూ అందరికీ తలలో నాలుకలాగా మెలిగే మరో వ్యక్తి సూర్యం. ఆ టౌన్లో ఒక కార్మిక సంఘంలో ముఖ్య నాయకుడిగా పని చేస్తున్నాడు. ఆ వీధిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి వాలిపోతాడు. తనకు చేతనైన సహాయం చేస్తాడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. సూర్యం గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే చాలు, ఆ చుట్టుపక్కల మూడు, నాలుగు వీధుల్లో ఎవరైనా చెప్పేస్తారు.
''ఆ! దొంగలు పడితే ఎత్తుకుపోడానికి వాళ్ళింట్లో ఏమున్నాయిరా? పుస్తకాలు, జెండాలు తప్ప? రేపు 'మహారాజు' గారు మన ఊరొస్తున్నాడుగా? అందుకని ముందస్తుగా ఇంటి దగ్గరే అరెస్టు చేశారన్నమాట'' వీణ కొడుక్కి వివరించింది.
ఈ ముందస్తు అరెస్టు వ్యవహారం ఏమిటో చిన్నాకి అర్ధం కాలేదు. ''అదేంటమ్మా? మనం ఏదైనా నేరం చేసినప్పుడు కదా పోలీసులు రావాలి? లేదా, మన మీద ఎవరన్నా దాడి చేయబోతే మనల్ని కాపాడడానికి కదా వాళ్ల్ళు రావాలి? సూర్యం అంకుల్ ఏ నేరమూ చేయలేదు, అంకుల్ మీద ఎవరూ దాడి చేయలేదు, అయినా ఈ అరెస్టు చేయడం ఏమిటి?'' అడిగాడు చిన్నా.
వీణ గాభరా పడింది. ''ష్! ఊరుకో. గట్టిగా మాట్లాడకు. పోలీసులు వింటే నిన్నూ అరెస్టు చేసేయగలరు'' అంటూ భయపెట్టడానికి ప్రయత్నించింది.
''అసలు సూర్యం అంకుల్ ని ఇంటిదగ్గర ఎందుకు అరెస్టు చేశారు?'' అన్న ప్రశ్న చిన్నాని వదల్లేదు. తర్వాత ఇంటికొచ్చిన మాధవ్‌ని అడిగేడు.
''రేపు మహారాజు గారు వచ్చినప్పుడు ధరలు తగ్గించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన ప్రదర్శించాలని వాళ్ళ సంఘం అనుకుంది. అందుకని ఆ కార్యక్రమం జరగకుండా ఆపడానికి పోలీసులు ఇలా చేసేరు'' అని మాధవ్ వివరించేడు.
''సూర్యం అంకుల్ అడిగినవి జరిగితే మంచిదే కదా? ధరలు తగ్గితే, ఉద్యోగాలు వస్తే అందరూ సంతోషిస్తారు కదా? మహారాజుని మెచ్చుకుంటారు కదా?'' అనడిగేడు చిన్నా.
దానికి సమాధానం ఏం చెప్పాలో మాధవ్‌కి తోచలేదు. ''నోరు మూసుకుని పడుకో. లేకపోతే నిన్నూ పోలీసులు పట్టుకుపోగలరు'' అని గట్టిగా కసిరి గదిలోకి పోయేడు.
మర్నాడు మధ్యాహ్నానికల్లా మహారాజుగారి కార్యక్రమం ముగిసింది. సాయంత్రానికి సూర్యం ఇంటినుంచి పోలీసులూ వెళ్ళిపోయేరు. ఏదో ఉపద్రవం తప్పినట్టు వీధిలోని జనం ఊపిరి పీల్చుకున్నారు. చిన్నాకి మాత్రం చాలా సందేహాలు వచ్చాయి. సాయంత్రం మెల్లగా సూర్యం ఇంటికి వెళ్ళేడు. ''రారా చిన్నా, విశేషాలేమిటి?'' అంటూ సూర్యం మామూలు పద్ధతిలోనే పలకరించాడు.
''ఇంత జరిగితే మీరు కామ్‌గా ఎలా ఉంటున్నారంకుల్?'' అనడిగాడు చిన్నా.
''ఏమైందిప్పుడు? పోలీసులు వచ్చారు, వెళ్ళేరు. అంతే కదా?'' అని అన్నాడు సూర్యం.
''అసలు ఏ తప్పూ చేయనప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇంట్లోంచి కదలనివ్వకుండా ఎందుకు అడ్డుకోవాలి?'' అనడిగాడు చిన్నా కొంచెం కోపంగా.
''కొన్ని సార్లు నిజాలు మాట్లాడినా పోలీసులకి, వాళ్ళు కాపలా కాసే అధికారపార్టీ వాళ్ళకి నచ్చదు. అందుకే ఇలా చేస్తూంటారు.'' అన్నాడు సూర్యం.
''వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా, నిజం ఎప్పుడూ నిజమే కదా? పైగా సత్యమేవ జయతే అని గవర్నమెంట్ ఆఫీసుల్లో, పోలీసు స్టేషన్లలో రాసివుంటుంది కదా? మా స్కూల్లో కూడా రాసి వుంది'' అని అడిగాడు చిన్నా. ''బాగుందయ్యా నీ ప్రశ్న. మీ టీచర్ ఎవరో గాని గట్టివాడిలాగే ఉన్నాడు. టీచర్లందరూ అలానే ఉండగలిగితే ఎంత బాగుంటుంది?'' అని అన్నాడు సూర్యం.
''మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు'' అన్నాడు చిన్నా.
''ప్రజలకి అనుకూలంగా, ఆ ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిలో సాధ్యమైనవాటిని నెరవేర్చడానికి నిజాయితీగా ప్రయత్నించే రాజకీయ నాయకులకి నిజం అంటే భయం ఉండదు. వాళ్ళు నిజం చెప్తారు, ప్రజలనుండి నిజాలు తెలుసుకుంటారు. అటువంటి నిజాయితీ లోపించిన రాజకీయ నాయకులకి నిజాలంటే చాలా భయం. వాటిని తెలుసుకోరు, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోరు. తమకు అనుకూలంగా భజన చేసేవారినే వాళ్ళు చేరదీస్తారు.'' అని అన్నాడు సూర్యం.
''ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఈ అధికార పార్టీ ఓడిపోతుంది కదా? ప్రజలు ఓడిస్తారు కదా?'' అన్నాడు చిన్నా.
''అబ్బో! చాలా విషయాలు నేర్చుకున్నావే! కాని ఆ ఓట్లేసే ప్రజలకి నిజాలన్నీ తెలియాలి కదా? ఎవరు చెప్తారు?'' అడిగాడు సూర్యం.
''మీలాంటివాళ్ళు చెప్పకుండా ఊరుకుంటారా ఏమిటి?'' అన్నాడు చిన్నా.
''అందుకే కదా నన్ను ముందస్తుగా అరెస్టు చేశారు'' అన్నాడు సూర్యం.
''ఓ! వాళ్ళకి భయమేసి మిమ్మల్ని అరెస్టు చేశారన్నమాట. మరి అమ్మ, నాన్న ఎందుకు అనవసరంగా భయపడ్డారు? నన్నెందుకు భయపెట్టాలని చూశారు?'' అనడిగాడు చిన్నా.
''భయపడినంత కాలమూ జనాలు నోరెత్తరు. వాళ్ళు నోరెత్తనంత కాలమూ నిజాలు బైటకి రావు. నిజాలు బైట పడనంతకాలమూ అధికారపార్టీకి ఢోకా ఉండదు. అందుకోసం ఏదో ఒకటి చేసి జనాలని భయపెట్టడానికే ఈ అరెస్టులూ, కేసులూ అన్నీ'' అన్నాడు సూర్యం. చిన్నాకి ఏదో కొంత అర్ధం అయినట్టనిపించింది.
''నేను మాత్రం భయపడనంకుల్'' అన్నాడు. సూర్యానికి చాలా ఉత్సాహం కలిగింది.
పక్కింట్లో టి.వి.లో పాతాళభైరవి సినిమా వస్తోంది. ''అరే డింగరీ! జనం కోరేది మనం శాయాలా? లేక మనం చేసేది జనం చూడాలా?'' అని మాంత్రికుడు (ఎస్వీ రంగారావు) తన శిష్యుడు డింగరీని (పద్మనాభం) అడుగుతున్నాడు.
ప్రజాస్వామ్య పరిపాలనకు సంబంధించిన మౌలిక ప్రశ్నను ఆ రోజుల్లో ఎంత బాగా ముందుకు తెచ్చేరు? అనుకున్నాడు సూర్యం.
- సుబ్రమణ్యం