Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: గురువుగారూ... గురువు గారూ... తమ గర్భస్థ పిండ శిశువుపై తగు హక్కు తల్లులకు ఉంటుందా? ఉండదా? అత్యాచారానికి గురైన బాలిక ఆ గర్భాన్ని అనివార్యంగా మోయాల్సిందేనా?
గురువు: శిష్యా ఏమా వితండ వాదన... వివరంగా చెప్పు
శిష్యుడు: అమెరికాలో అర్థశతాబ్దం క్రింద మహిళలకు దక్కిన గర్భస్రావ హక్కుకు ఇప్పుడు కాలదోషం పట్టింది. తమ గర్భంలోని పిండాన్ని 22-24 వారాలలోపు తొలగించుకునే హక్కు అక్కడి గర్భిణీ స్త్రీలకు ఉన్నది. తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా గర్భవతులైన స్త్రీలకు, గర్భస్రావ హక్కు ఓ వరం. తమ శరీరం, తమ గర్భం, తమ ఆరోగ్యం తమ సొంతం అని భావించే మహిళలు పోరాడి సాధించుకున్న హక్కు ఇది. అభివృద్ధికి సిసలైన చిరునామా అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఇలా మహిళా సాధికారత హక్కుపై చావుదెబ్బ కొట్టడం ఏమిటండి చెప్మా...
గురువు: చెట్టు చెడేనాటికి కుక్క మూతి పిందెలు పుట్టడం సహజమే కదా శిష్యా. ఇదీ అలాగే. గర్భస్రావాలపై నిషేధం అంటే మహిళల సహజ హక్కును, పునరుత్పత్తి హక్కును కాలరాయడమేనని ఐక్యరాజ్యసమితితో సహా నేడు లోకం కోడై కూస్తున్నది. అయినా అమెరికా పురుషాధిక్య సమాజం తిరోగమన బాటలో నడవడానికే సిద్ధమైంది.
అన్ని వివక్షల్లో అత్యంత క్లిష్టమైనది, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది ఈ లింగ వివక్ష. పడగవిప్పిన పురుషాధిక్యం ఒక్కోచోట ఒక్కో రీతిన కాటు వేస్తుంది. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ద్వారా ఇది ఇలా బయటపడింది.
శిష్యుడు: అవును గురువుగారు... ఈ తీర్పు వెలువడిన రోజు అధ్యక్షుడు జోబైడెన్ కూడా 'కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరం. ఈ ఒక్క తీర్పుతో అమెరికా 150ఏండ్లు వెనక్కి వెళ్ళింది' అని వాపోయాడు.
గురువు: అమెరికా సుప్రీం కోర్టు 6 - 3 మెజారిటీతో ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పును ఆసరగా తీసుకుని అక్కడ 50రాష్ట్రాల్లో సగంపైగా అంటే 26 రాష్ట్రాల్లో ఈ గర్భస్రావ హక్కుపై నిషేదాలొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి డెమోక్రాట్లు కోర్టు తీర్పును వ్యతిరేకిస్తుంటే.. రిపబ్లికన్లు స్వాగతిస్తున్నారు. అయితే ఈ కోర్టు తీర్పుతో మహిళలు గర్భస్రావలపై నియంత్రణ పాటిస్తారనుకుంటే పొరపాటే.
శిష్యుడు: ఎందుకని?
గురువు: దొంగచాటు గర్భస్రావాలు ఎప్పుడూ ఎక్కువే. వాటిలో ప్రమాదాలూ ఎక్కువే. పెద్ద ప్రాణాలకు(గర్భవతులకు) ముప్పు ఏర్పడుతుంది. అనేక సర్వేలు ఈ విషయాల్ని చాటిచెప్పాయి. ముఖ్యంగా నిరుపేద మహిళలు, నల్లజాతి మహిళలు ఇలా బలైపోతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న గర్భస్రావాల్లో 45శాతం సురక్షితం కావని తేలింది. ఆ మరణాలు పెంచేందుకే ఈ తీర్పు దోహదకారి అవుతుందనే వాదన లేకపోలేదు.
శిష్యుడు: మరేమిటండి ఈ గందరగోళం.
గురువు: ప్రతిదానికి ఓ రాజకీయ నేపధ్యం ఉంటుంది శిష్యా. వచ్చే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలకు ఇదో పాచిక. పురుషాధిక్యతను గుడ్డిగా సమర్థించే సనాతన మితవాదులను ఒక పక్షంవైపు చేర్చి, అదే అసలైన అమెరికా సంప్రదాయంగా భ్రమలు కొల్పి, పెద్దఎత్తున ఓట్లు లబ్దిపొందాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. దీనికి విరుగుడుగా వెల్లువెత్తే నిరసనలు ఉపయోగించుకోవాలని డెమోక్రేట్లు సహజంగానే ఆలోచిస్తున్నారు.
శిష్యుడు: రానున్న ఎన్నికల కోసం ఇది తురఫ్కార్డు అయిందంటారా?
గురువు: అవును మరి. అమెరికన్ స్త్రీలకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ఒక ప్రాథమిక హక్కుకు తూట్లు పడేలా సుప్రీం వ్యవహరించింది. గర్భస్రావం (అబార్షన్) హక్కులకు ఇకనుండి రాజ్యాంగ రక్షణ ఏమీ ఉండదని కోర్టు తేల్చిపారేసింది. ఇకముందు గర్భస్రావంపై నిర్ణయం చేసే హక్కు సరాసరి ప్రజాప్రతినిధులకు మాత్రమే ఉంటుందని చెప్పింది.
శిష్యుడు: అమ్మమ్మా... ఎంతమాట! రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన కోర్టులే ఈ విధంగా చేస్తే ఎలా...?
గురువు: ఇంకో విషయం. ఇదంతా ఘనత వహించిన గత అధ్యక్షుని ట్రంప్ చలవే. పైకి మాత్రం ప్రజాస్వామ్యం, సమానత్వం అని గగ్గోలు పెడుతుంటారు. నిశితంగా చూస్తేనే ఆ నిరంకుశాధిపత్య కోరలు కనిపిస్తుంటాయి.
శిష్యుడు: ఎలా చెప్పగలుగుతున్నారు?
గురువు: ట్రంప్ హయాంలోనే అలాంటి మితవాదుల (కన్జర్వేటివ్) న్యాయమూర్తుల నియామకం జరిగిందట. వారే ఇప్పుడు తమ రహస్య ఎజెండా ప్రకారం ఈ తీర్పుకు ఇలా శ్రీకారం చుట్టారని వార్తలొస్తున్నాయి.
శిష్యుడు: ఇది చాలా అన్యాయం కదండీ.
గురువు: చిన్నగా అంటావేం శిష్యా! ఘోర అన్యాయం. యావత్ స్త్రీజాతి శరీరంపై స్త్రీలకు హక్కు లేకుండా చేసే అనాగరిక అమానవీయం. అవనిలో సగం, ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం అని నినదిస్తే సరికాదు కదా! కేవలం పశువాంఛతో కామం తీర్చుకోవడం, రాక్షసంగా అత్యాచారాలు చేయడం, ఫలితంగా గర్భం దాలిస్తే తిరిగి ఆ గర్భాన్ని తొలగించుకునే హక్కు కూడా లేకుండా చేయడం, కరడుగట్టిన పురుషాధిక్యం కాక మరేమిటి? స్త్రీలు తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పురుషులకు తమ శరీరాలు సమర్పించుకోవాలన్న మనుస్మృతికన్నా ఇదేం తక్కువ కాదు.
అందుకే స్త్రీల హృదయాన్ని అర్థం చేసుకోలేనివారు స్త్రీలను గౌరవించరని మహనీయుడు చలం చెప్పిన మాట ఎప్పుడైనా, ఎక్కడైనా, శిరోధార్యమే.
- కె శాంతారావు
సెల్:9959745723