Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలై 1, 1949న 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)' సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా స్థాపించబడింది. ప్రపంచంలోనే అకౌంటింగ్, ఫైనాన్సియల్ విషయాలను నిర్వహించే రెండవ అతి పెద్ద వృత్తి నిబద్ధతగల సంస్థగా ఐసీఏఐ పేరు సంపాదించుకుంది. ఐసీఏఐ స్థాపించబడిన జూలై 1న దేశవ్యాప్తంగా 'జాతీయ చార్టర్ అకౌంటెంట్స్ (సీఏ) దినం' నిర్వహించుట ఆనవాయితీగా జరుగుతుంది.
ఐసీఏఐ గత చరిత్ర: 1913లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంపెనీల చట్టం ద్వారా ఆడిటర్లను నియమించడం జరిగింది. 1918లో 'గవర్నమెంట్ డిప్లమా ఇన్ అకౌంటెన్సీ' కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఆడిటర్లుగా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు మూడేండ్ల శిక్షణ కాలం ఉండేది. 1930లో భారత ప్రభుత్వం 'రిజిస్టర్డ్ అకౌంటెంట్ల' జాబితా నమోదు చేయడం ప్రారంభించింది. అనంతరం 1948లో నియమించిన కమిటీ సిఫార్సులతో 1949, జూలై 1న ఐసీఏఐ సంస్థను చట్టం ద్వారా స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇండియన్ అకౌంటెంట్లను 'చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా సీఏ'గా పిలవడం ఆనవాయితిగా మారింది.
సీఏల పాత్ర: చిరు వ్యాపారం నుంచి బహుళజాతి సంస్థ వరకు, చిన్న ఉద్యోగి నుంచి బడా బాబుల వరకు అందరి ఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో చట్టబద్దంగా ఆదాయవ్యయాల జాబితాను సీఏలు నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వాహణలోనూ వీరు కీలకం. అతి గౌరవ ప్రదమైన సీఏ వఋత్తిలో ఆకర్షణీయ ఆదాయం ఉంటుంది.
సీఏ ఎంపికకు కఠిన పరీక్షలు: ఐసీఏఐ నిర్వహించే ఉన్నత ప్రమాణాలతో కూడిన కఠిన సీఏ పరీక్షలో వేలల్లో అభ్యర్థులు పాల్గొన్నప్పటికీ కొద్ది మంది మాత్రమే ఉర్తీర్ణులు కావడం విశేషం. దేశంలో ఐసీఏఐ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి వ్యక్తిగా 'గోపాల్‌దాస్ పదమ్సే కపాడియా' గుర్తింపుపొంది ఐసీఏఐ ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు. స్వతంత్ర భారతావనిలో అతి పురాతన సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఐసీఏఐలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు, ప్రతిభ మీద మాత్రమే సీఏలను కఠిన నియమావళితో కూడిన పరీక్షల ద్వారా వడపోసి ఎంపిక చేస్తారు. సీఏ వృత్తి పట్ల అవగాహన, ఐసీఏఐ బాధ్యులను గుర్తించడం ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం ఉద్దేశ్యం. నేటి విద్యార్థినీవిద్యార్థులు, ఉన్నత విద్యనభ్యసించిన యువత సీఏ పరీక్షలో ఉర్తర్ణులై దేశం గర్వించే సీఏలుగా ఎంపిక కావాలని కోరుకుందాం. మన సమీపాన నివసిస్తున్న సీఏలకు జాతీయ సీఏల దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.
- డా|| బుర్ర మధుసూధన్‌రెడ్డి, సెల్: 9949700037
(నేడు 'జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ దినం' సందర్భంగా)