Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమెరికా డాలర్‌తో రూపాయి విలువ 67గా ఉండగా, ప్రస్తుతం 78.92కు చేరుకున్న పరిస్థితి. ఇది భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలు, మన ప్రభుత్వ విధానాలు. చమురు ధరలు పెరగడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దిగుమతులు ఎక్కువగా ఉండటం వలన భారత రూపాయి విలువ అంతకంతకూ దిగజారుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు చమురు దిగుమతిపై ఖర్చు చేయడం గమనార్హం. మనదేశానికి కావలసిన చమురు (పెట్రోల్, డీజిల్) సుమారు 85శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ప్రస్తుతం బారెల్ చమురు ధర 105 నుంచి 130 డాలర్లు మధ్య కొనసాగుతోంది. చమురు బిల్లు, దిగుమతుల చిల్లుతో మన ఆర్థిక వ్యవస్థ అల్లాడుతున్నది. 61వేల కోట్ల రూపాయల మేర ఉత్పత్తుల దిగుమతులు జరుగుతున్నట్టు అంచనా. ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరుగుతుండటం వలన వివిధ రకాల లోటులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. దేశంలో ఇటీవల ''విదేశీ మారక ద్రవ్య నిల్వలు'' కరిగిపోతున్నాయి. ప్రస్తుతం 596.46 బిలియన్లకు చేరాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచటం వలన కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు మనదేశ ఆర్థిక సంస్థల నుంచి, స్టాక్ మార్కెట్ల నుంచి ఇతర దేశాలకు తరలి పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రూపొందించి, ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఎగుమతులు పెంచుకోవాలి. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో తగ్గిన టెక్టైల్ ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవాలి. దిగుమతులు తగ్గించుకోవాలి. స్వదేశీ పరిజ్ఞానంతో వస్తువులు ఉత్పత్తి చేయాలి. సాధ్యమైనంత వరకూ విదేశీ వస్తువుల వాడకం తగ్గించాలి. స్వావలంబన దిశగా అడుగులు వేయాలి.
మనకు ఏ భాగానికైనా దెబ్బ తగిలితే, మొత్తం శరీరం అంతా బాధ కలుగుతుంది. అదే రీతిలో నేడు ప్రపంచంలో ఏ దేశానికీ సంక్షోభం, సమస్యలు వచ్చినా ప్రపంచ దేశాలు అన్నీ ఆ సంక్షోభంతో కుదేలు అవుతున్నాయి. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అనేక దేశాలు రకరకాలైన ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టీల్, బార్లీ, గోధుమ, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు నింగిని తాకి, పేద మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాయి. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆదాయం కోసం పన్నులు, సెస్‌ల రూపంలో ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజానీకం ఆర్థిక లోటుతో కుదేలు అవుతున్నాయి. రూపాయి విలువ మరింత దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్వదేశీ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా, ముఖ్యంగా ఫార్మా, ఐ.టి రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా రూపాయి విలువ పటిష్టంగా ఉంచవచ్చు. స్థానిక ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ''చైనా'' తన ఆర్థిక వ్యవస్థను ఎంత పటిష్టంగా ఉంచుకున్నదో, అదే విధంగా మనదేశంలో కూడా దేశీయ వస్తువుల ఉత్పత్తి పెంచడం, ఎగుమతులు పెంచు కోవడం, ప్రపంచ మార్కెట్లో మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అప్పుడు మాత్రమే మన రూపాయి విలువ పతనం అరికట్టి, ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ధృడంగా నిలబడేటట్లు చేయగలం. అనుత్పాదక వ్యయం తగ్గించుకోవాలి. వ్యవసాయ, కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉనికినే కోల్పోతున్న అనేక పరిశ్రమలకు ఊపిరి పోయాలి. ప్రభుత్వ రంగ సంస్థల పునఃనిర్మాణం చేపట్టాలి. బడా పారిశ్రామిక వేత్తలకు, సంస్థలకు ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలు తగ్గించాలి. వీరికి ఇచ్చిన రుణాలు తిరిగి జమ కట్టేట్లు నిర్ణయాలు తీసుకోవాలి. మాఫీలు చేయరాదు. వీరు అజ్ఞాతంగా ఇతర దేశాల్లో, బ్యాంకుల్లో ఉంచిన అక్రమ ధనాన్ని మనదేశానికి తేవడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపట్టాలి. భారత రూపాయి 1947లో స్వాతంత్య్రం వచ్చిన నాటికి ఉన్న విలువ ''ఒక రూపాయి ఒక డాలర్'' అనే స్ధాయికి తీసుకొని రావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముమ్మర ప్రయత్నాలు చేయాలి.
- రావుశ్రీ