Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి విద్యార్థుల జీవితాల్లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యార్థుల సమతుల శారీరక మానసిక వికాసానికి విద్యతో పాటు క్రీడలు కూడా తప్పనిసరి. ఆటలు ఆడడం, చూడటమే కాదు, క్రీడాంశాలను పత్రికలు, ప్రచారమాద్యమాల ద్వారా చదవటం వల్ల కూడా ఆటల పట్ల ఆసక్తి, నైపుణ్యం పెరుగుతాయి. ప్రపంచ నలుమూలల జరుగుతున్న క్రీడల సంపూర్ణ వివరాలను నేరుగా, సత్వరమే అందించే క్రీడా జర్నలిస్టులు, క్రీడాంశాల రచయితల పాత్ర అనిర్వచనీయమే కాదు అభినందనీయం కూడా. క్రీడా జర్నలిస్టులకు కృతజ్ఞతలను తెలియజేయడం, సముచితంగా సన్మానించుకోవడం, వారి నుండి క్రీడా స్పూర్తిని పొందడం నేటి యువత కనీస బాధ్యతగా తెలుసుకోవాలి. 1994లో జరిగిన 70వ 'ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్' వార్షికోత్సవం సందర్భంగా తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట జూలై 2న 'ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం' జరుగుతున్నది. క్రీడాంశాల రచనలను వృత్తిగా చేసుకొని కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించవలసిన వేదికగా ఈ వేడుక పని చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రీడా జర్నలిస్టుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి, వారిలో వృత్తి పట్ల ఉత్సాహం పెంచడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని గమనించాలి. అందుకే విశ్వవ్యాప్తంగా విస్తరించిన వివిధ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, జాతీయ స్థానిక క్రీడా సంఘాల నేతృత్వంలో 'ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం' ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. పత్రికల్లో క్రీడా వార్తలకు పాఠకులు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం మనకు తెలుసు. అత్యుత్తమ ప్రతిభగల క్రీడా జర్నలిస్టులు అందించే ఆసక్తికర వార్తలను చదివే పాఠకులు ఆటను ప్రత్యక్షంగా చూసిన అనుభూతులను పొందుతుంటారు. క్రీడా జర్నలిస్టులు, రచయితలు ప్రపంచ మానవాళికి అనునిత్యం క్రీడా వార్తలను అందించే మహత్తర విధులను నిర్వహిస్తూ, క్రీడల పట్ల యువతలో ఆసక్తి, అభిరుచులను పెంపొందిస్తూ, క్రీడాంశాలతో ప్రపంచ ఐక్యతను చాటాలని ఆశిద్దాం.
(2 జూలై 'ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినం' సందర్భంగా)
- డాక్టర్ బి.ఎం.ఆర్.