Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఎనిమిదేండ్లుగా దేశంలో మోడీ పాలనలో రైతుల బతుకులు దిన దినం కునారిల్లుతున్నాయి. ఆత్మహత్యలు ఏటా 12,600లకు తగ్గకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ విధానాలు రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయి. ఎరువుల ధరల పెరుగుదల వలన వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుండగా, మరో వైపు పెట్రోల్ డీజిల్ పెరుగుదలతో ప్రతి ఎకరాపై రూ.2000 భారం అదనంగా పడింది. ఈ భారాలకు తోడు వ్యవస్థీకృతమైన విత్తన వ్యవస్థ ధరలను పెంచడమేగాక, దేశ్యాప్తంగా నాణ్యతలేని కల్తీ విత్తనాలను అమ్మి రైతులను ఏటా 2 కోట్ల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లజేస్తున్నది. వ్యవసాయ పెట్టుబడులు దిన దినం పెరగడమే తప్ప అందుకు అనుగుణంగా కనీస మద్దతు ధరల పెంపుదల లేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అశాస్త్రీయంగా ఉండడమేగాక, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల లాభాలు కట్టబెడుతున్నాయి.
మద్దతు ధరలు ఎలా నిర్ణయించాలి?
కేంద్ర ధరల నిర్ణయాక సంఘం రాష్ట్రాలలోని పెట్టుబడులను సేకరించి సగటు పెట్టుబడిని నిర్ణయించి, దానికి 50శాతం కలిపి మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వానికి రికమండ్ చేస్తుంది. కానీ, వాస్తవ పెట్టుబడిని పట్టించుకోకుండా గత సంవత్సరంపై సగటున రూ.100 నుండి రూ.250లు వరకు పెంచి ప్రకటిస్తున్నారు. పైగా దీనిని స్వామినాథన్ కమిటీ సూచనల ప్రకారం ప్రకటించామని రైతులను భ్రమలకు గురి చేస్తున్నారు. నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించక రైతులు ఏటా 3లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు, సరళీకృత ఆర్థిక విధానాలను బలంగా ఆమోదిస్తున్న ఆర్థికవేత్త అశోక్ గులాఠి ప్రకటించడం గమనార్హం. ధరల నిర్ణయంలోనే మరో 5, 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు నష్టపోతున్నారు. దేశంలో ఏటా 18 లక్షల కోట్ల వ్యవసాయ మార్కెటింగ్ జరుగుతున్నది. ఆదాని, రిలయన్స్, టాటా, బిర్లా, ఐటిసి, బేయర్ లాంటి సంస్థలు వ్యవసాయ మార్కెట్ వ్యవస్థలోకి రావడమేగాక, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం కూడా వారే చేస్తున్నారు. ముడి వ్యవసాయోత్పత్తులు కొనుగోలుచేసి ప్రాసెస్ చేసి ఎగుమతుల ద్వారా ఏటా రైతులను దోపిడీ చేసి లక్షల కోట్ల లాభాలను సంపాదిస్తున్నారు. తమ పాత పారిశ్రామిక పెట్టుబడులను వ్యవసాయ రంగంలోకి మారలుస్తున్నారు. మద్దతు ధరల నిర్ణయానికి 1. ఉపకరణాల పెట్టుబడి, 2. కుటుంబ శ్రమ, 3. వ్యవసాయ భూమికౌలు విలువ, సొంత పెట్టుబడిపై వడ్డీని లెక్కగట్టాలి. కానీ ఉపకరణాల పెట్టుబడి, కుటుంబ శ్రమను మాత్రమే తీసుకొని దానికి 50శాతం కలిపి మోడీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. పారిశ్రామిక సరుకుల ధరల నిర్ణయానికి, వ్యవసాయ సరుకుల ధరల నిర్ణయానికి భూమి పెట్టుబడి వడ్డీ, అరుగుదల తదితర అంశాలను తొలగించడం ద్వారా రైతులు ధరల నిర్ణయంలో దాదాపు 35శాతం నష్టపోతున్నారు. ఇ-నాం మార్కెట్ వల్ల రైతులకు పోటీ మార్కెట్ ఏర్పడి మంచి లాభాలు వస్తాయని చెప్పిన ప్రధానే స్వయంగా ''కార్పొరేట్ల ఐక్యతతో ఇ-నాం మార్కెట్ వల్ల కొనుగోలు దారుల మధ్య పోటీ ఏర్పడి రైతులకు మంచి లాభాలు రాలేదని'' ప్రకటించాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా 'ప్రధాని ఫసల్ బీమా' ప్రకటించింది. దేశంలో 35కోట్ల ఎకరాలు సాగు అవుతుండగా 3.5 కోట్ల ఎకరాలకు మాత్రమే బీమా సౌకర్యం విస్తరించింది. ఈ బీమా వల్ల ప్రయోజనం లేదని భావించిన గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ప్రధాని ఫసల్‌బీమా నుండి తప్పుకున్నాయి. 2016 జనవరి 15న ప్రవేశ పెట్టబడిన ఈ పథకం వల్ల ఏటా కార్పొరేట్ బీమా కంపెనీలు 5, 6 వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాయే తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ విధంగా ఫసల్‌బీమా విఫలమైందని కూడా ప్రభుత్వమే చెప్పింది.
విఫలమైన మరో పథకం
కిసాన్ సమ్మాన్ పేరుతో 2018 డిసెంబర్ 1న ప్రకటించిన ఈ పథకం సన్న-చిన్నకారు రైతులకు అంత ఉపయోగకరంగా లేదు. ప్రభుత్వం రూ.68,000 కోట్లు కేటాయించినప్పటికీ 11.07 కోట్ల మందికే సంవత్సరానికి రూ.6,000ల చొప్పున సహాయం అందిస్తున్నది. సన్న-చిన్నకారు రైతులే 14కోట్ల మంది ఉన్నారు. వారుగాక మిగతా రైతులు మరో 3కోట్ల మంది వరకు ఉన్నారు. సన్న-చిన్నకారు రైతులలో 5కోట్ల మందికి ఈ పథకం వల్ల ఏ ప్రయోజనం కలగడంలేదు. తెలంగాణలో 64లక్షల మంది రైతులు ఉండగా 38.63లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. దీనినిబట్టి ఈ పథకం పాక్షికంగా ఉపయోగపడుతున్నదే తప్ప, పేద రైతులందరికీ ఆదుకోలేకపోతుందని స్పష్టమవుతుంది.
వడ్డీమాఫీ పథకం
రైతులు తీసుకున్న రుణాలకు 4శాతం వడ్డీని కేంద్రం భరిస్తుందని, ఏటా రూ.15,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే 2శాతం వడ్డీమాఫీ చేస్తున్నారు. మిగిలిన 2శాతం బాకీ పడ్డారన్న నెపంతో ఇవ్వడంలేదు. ఈ విధంగా కేటాయించిన 15వేల కోట్లలో రూ.5, 6 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం వడ్డీ కింద ఖర్చుపెడుతున్నది. పెద్ద రైతులకు మాత్రం వడ్డీమాఫీ అందుతున్నది.
పంటల రుణ పథకం
పదహారు లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని 2022-23 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటించారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఇది ప్రకటించడం జరిగింది. బ్యాంకుల రుణ వ్యాపారంలో 40శాతం వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో 18శాతం ప్రత్యేకంగా పంట రుణాల కింద ఇవ్వాలని నిబంధన ఉంది. మొత్తం ఇచ్చే రుణాలలో 15శాతం రుణాలు దళిత, గిరిజనులకు ఇవ్వాలని కూడా నిబంధన ఉంది. రిజర్వు బ్యాంకు నింబంధనలు అమలు జరపాలంటే రూ.22లక్షల కోట్ల పంట రుణాలు ఇవ్వాలి. కానీ, ప్రకటించిన రూ.16లక్షల కోట్లలో ఇస్తున్నది 10.50లక్షల కోట్లు మాత్రమే. సంస్థాగత పంట రుణాలు లభ్యం కాకపోవడంతో రైతులు 24శాతం నుండి 36శాతం వడ్డీకి ప్రయివేటు రుణాలు తెచ్చుకొని వ్యవసాయం సాగిస్తున్నారు. రాష్ట్రాల్లో ప్రకటించిన రుణమాఫీ బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు బాకీపడి ఉంటున్నారు. ఆ పేరుతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడం లేదు. ఫలితంగా రుణగ్రస్తులైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే మొత్తం భూములను డిజిటల్ సర్వే చేయిస్తామని, రాష్ట్రాలకు నిధులు అందజేసి ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. భూములు సర్వే చేయిస్తే తమ పాలకవర్గంలోని వారే అక్రమంగా సంపాదించిన భూములు కోల్పోవాల్సి వస్తుందని భయంతో సర్వేలు అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు. ఇటు రైతులకూ భూములపై హక్కులు లేకుండా చేశారు. దేశంలో కౌలుదార్లు 25శాతం వరకు ఉన్నారు. వారికి ఎలాంటి హక్కులు లేవు. పైగా భూసేకరణ పేరుతో దళిత, గిరిజన, పేదల భూములను లాక్కోవడం జరగుతున్నది. ఈ విధంగా భూమిపై హక్కులను కోల్పోవడమేగాక, కేంద్రం ప్రకటించిన ఏ ఒక్క పథకం రైతులకు ఉపయోగపడటం లేదు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి మొత్తం వ్యవసాయరంగాన్ని కేంద్ర జాబితాలోకి తీసుకొని, కార్పొరేట్లకు అనుకూలంగా మార్చాలని చూసింది. దాదాపు ఒక సంవత్సరం రైతుల సుధీర్ఘ పోరాటంతో ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంది. ఆ పోరాట సందర్భంగా 40వేల మందిపై అక్రమ కేసులు బనాయించడమేగాక, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్, నీటిఫిరంగుల ద్వారా లక్షల మందిని గాయపరిచారు. 730మంది రైతులు పోరాటంలోనే చనిపోయారు. చట్టాలను విరమించుకున్నప్పటికీ పరోక్షంగా ఈ చట్టాలను అమలు చేయడానికే మోడీ ప్రభుత్వం నిరంతరం పాకులాడుతున్నది. ఇప్పటికీ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ఉపంసంహరించుకోలేదు. చివరికి రాష్ట్రాలలోని ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రం చేతిలోకి తీసుకునే విధంగా గెజిట్లు ప్రకటించి ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టులను కేంద్ర అధీనంలోకి తీసుకున్నది.
రాజ్యాంగం రీత్యా రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయరంగంలో భూ సమస్య మొదలు మార్కెట్ సమస్య వరకు అన్ని అంశాలనూ కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. వ్యవసాయం ఉత్పత్తులు పెంచడం కన్నా దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కల్పించింది. ఏటా 3.5లక్షల కోట్ల విలువగల వంటనూనెలు, పంచధార, పత్తి, పప్పులు, మాంసం, చిరుధాన్యాల ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నాం. ఫలితంగా ఇక్కడ రైతుల పంటలకు ధరలు తగ్గిపోయి, అసలు పంటలకే దూరం అవుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ సమావేశాలలో భారత వ్యవసాయరంగంలో ఇంతకాలం అనుసరించిన తప్పుడు విధానాలను సరి చేసుకొని, ఆత్మహత్యలు నివారించే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి తగిన కార్యక్రమాన్ని రూపొందించాలి. 2022 నాటికే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రభుత్వం, రెట్టింపు సంగతి అటుంచి వచ్చే ఆదాయంలో 50 శాతం కోల్పోయేలా చేసింది. తిరోగమనంలో పోతున్న రైతుల ఆదాయాన్ని రక్షించాలి. దిగుమతులను పూర్తిగా తగ్గించుకొని ఎగుమతులకు అవకాశం కల్పించే విధంగా వ్యవసాయ విధానాన్ని మార్చాలి. ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంలో వ్యవసాయ సంక్షోభం పెరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
- టి సాగర్
సెల్: 9490098055