Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అరె వీడు వద్దన్న పని చేస్తాడు. ఎంత చెప్పినా వినడు. చెప్పి చెప్పి బేజారవుతున్నా. వీడి అల్లరి రోజు రోజుకు మితిమీరుతుంది. పక్కలోళ్లతోటి తగదాలు తెస్తున్నాడు'' అంటూ తమ పిల్లలు గురించి తల్లిదండ్రులు ఆవేదన చెందడం సర్వసాధారణం. తరగతి గదిలో కొంత పిల్లల గురించి ఉపాధ్యాయులు కూడా ఇలాగే బాధపడుతుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీల్లో కూడా ఉంటారనేది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇది షరామాములే అనుకోవచ్చు. కానీ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఒక మాట చెప్పినా వినకుండా వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసి ఆశ్చర్యపరిచారు మన పెద్దాయన హన్మంతన్న. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణలో ప్రథమ శత్రువుగా ఎంచుకున్న టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నది. అయినా ఈ సందర్భంలో టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి వెళ్లి ఆయన్ను కలవడం ద్వారా రెండు పార్టీలు ఒక్కటనే సంకేతాలు పోతాయనేది పార్టీ నిర్ణయం. అందుకే ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి యశ్వంత్‌ను కలవాలని రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ గీసిన గీతను దాటి సీఎం కేసీఆర్‌తోపాటు మన హన్మంతన్న కూడా బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. చిరునవ్వులు చిందించారు. ఇప్పుడేమైంది... పార్టీ వైఖరి అంటే హన్మంతన్నకు లెక్కెలేదా? అంటున్నారు పార్టీ నాయకులు. కాంగ్రెస్‌లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పుకునే ఆ పార్టీ నేతలు... ఆ పేరుతో నిత్యం పప్పులో కాలేస్తుంటారు. ఆయన ఒక్కడే కాదు కాంగ్రెస్‌లో ఇలాంటి మహానుభావులనేకులు...!
- గుడిగ రఘు