Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు, మూడు రోజుల ముందే తెలంగాణలో ఊడిపడ్డారు. దళితుల నోటికాడి ముద్దను లాగేసి... చంపేసి... వీరవిహారం చేసినోళ్లే ఎన్నడూ లేనిది దళితుల మీద తెగ ప్రేమ ఒలకబోశారు. మేమూ దళితుల ఇండ్లలో తిన్నాం అని చెప్పుకునేందుకు తెగ ఆరాటపడ్డారు. గిదంతా నిజంగా దళితుల మీద ప్రేమతోనే అని ఎవరైనా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే. తెలంగాణలో పాగా కోసం ఆరాట పడుతున్న బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. 31 స్థానాల్లో కనీసం సగమైనా దక్కించుకోవాలనే ఆ పార్టీ ఎత్తుగడ దాగుంది. అందుకే ఈ కపట ప్రేమంతా. అయినా, ఓ ధర్మ సందేహం... దళితుల ఇండ్లలో అన్నం తిన్నంత మాత్రాన కులం సమసిపోతుందా? దళితులను గుడిలోకి రానిస్తారా? నిజంగా వారికి ఆస్తులొస్తాయా... అంతస్తులొస్తాయా? మీలాగా నాణ్యమైన విద్య, వైద్యమందుతుందా? ఆ దిశగా చర్చించకుండా ఈ ఉత్తిత్తి నాటకాలెందుకు? ఇక్కడి దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎంతో చైతన్యవంతులు. మనుధర్మం నిజస్వరూపాన్ని పసిగట్టలేనంత అమాయకులేం కాదు. ఓ బీజేపీ నేతల్లారా! దళితుల ఇండ్లలో తిని వారి బతుకులను గమనించారు కదా.. 'అంటరానితనం పోవాలి... మనుషులంతా సమానమే..'అంటూ మీ పార్టీ జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేయగలరా?
- బి.వి.ఎన్. పద్మరాజు