Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ఫ్లెక్సీల పంచాయతీ ముఖం బాగలేక అద్దం పగులగొట్టుకున్నట్టు ఉంది. పట్నంల యాడజూసిన గిప్పుడు ప్లెక్సీల పంచాయతీ నడుస్తున్నది. వీళ్లు పెట్టినది వాళ్లు..వాళ్లు పెట్టినది వీళ్లుచింపేసుకుంట పోతున్నరు. కేసులు పెట్టుకుంటున్నరు. మెట్రో ఫిల్లర్లు, బస్ షెల్టర్లు, రోడ్డు మధ్యలోనివి..ఇలా మాకు ప్రకటనల ప్లేస్ లేకుండా టీఆర్ఎస్ పార్టీ కొనేసుకుని మాకు ప్రచారం దక్కనీయట్లేదంటూ బీజేపీ నేతలు లబోదిబో మొత్తుకుంటనే ఉన్నరు. 'అరె మిమ్ములి ఎవ్వరు బుక్ చేసుకోవద్దన్నరు? ముందే చేసుకుంటుంటే అడ్డమొచ్చినమా?' అని టీఆర్ఎస్ వాళ్లు తిప్పికొడుతున్నరు. గీ పంచాయతీ పక్కనబెడితే రోడ్లమీద ఫ్లెక్సీల పంచాయతీ అయితే చెప్పలేనిది. ఒకరికొకరు పీకేసుకోవటాలు.. గొడవలు...కేసుల దాకా పోయినవి. కోట్ల రూపాయలు తగులబెట్టి బ్యానర్లు, ప్లెక్సీలు కట్టుడెందుకూ? పీకేసుడెందుకూ? ఏం సమజైతలేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) వస్తువులను ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిగా నిషేధిస్తున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎవరైనా వాడినట్టు తెలిస్తే లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. గమ్మత్తేటంటే... ఈ ఫ్లెక్సీలు ముద్రించేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్తోనే. గిప్పుడు గా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక్కో ఫ్లెక్సీకి ఇంత అని లెక్కగడుతూ కోట్ల రూపాయల జరిమానా విధించి తన చిత్తశుద్ధి నిరూపించుకుంటుందో లేదో చూడాలి.
- అచ్చిన ప్రశాంత్