Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న హైటెక్ సిటీ గుండా పోయేటప్పుడు మిత్రుడొకాయన కలుస్తానని చెప్పి, బయో డైవర్సిటీ పార్కు దగ్గర ఉంటానన్నాడు. ఆ పార్కు గురించి వినడమే కాని ఎప్పుడూ చూడలేదు. జీవ వైవిధ్యం అన్న విషయమే చాలా ఆసక్తి కలిగిస్తుంది. రెండు పనులూ ఒకే సారి అయిపోతాయని మిత్రుడితో పాటు పార్కులోకి అడుగు పెట్టాము. ఇంకా పనులు పూర్తి కాలేదు. రెండు విగ్రహాలు ఒకటి డార్విన్ది అనుకుంటా, ఇంకా స్థాపించకుండా నేలపై రెస్టు తీసుకుంటున్నాయి. అప్పుడ నిపించింది డార్వినే కనుక జీవ పరిణామంతో పాటు దశావతారాలను పోల్చి ఉంటే ఈపాటికి కొన్ని వందల టన్నుల భారీ కంచు విగ్రహం ఆయనది తయారై ఉండేది అని. మొత్తం ప్రపంచానికి సంబంధించిన పార్కు పనులు నత్త నడకన సాగడం చూస్తే ఇదే మన వైవిధ్యమేమో అనిపించింది!
జీవ వైవిధ్యమంటే ఈ భూమి మీద ఉన్న ప్రాణులు. అవి చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇతర జీవులు ఏవైనా కావచ్చు... అవి ఈ భూగోళాన్ని ఎలా పంచుకుంటున్నాయి, ఎలా ఒకదానికొకటి ఆసరాగా ఉన్నాయి, భూగోళం మీద పర్యావరణ వ్యవస్థను ఎలా సమతుల్యం చేస్తున్నాయి అని తెలిపేదే జీవవైవిధ్యం. ఎప్పుడైతే మానవులు అవతరించారో అప్పటినుండే ఇతర జీవాల నాశనం మొదలైనట్టు సైన్సు చరిత్ర చెబుతోంది. తమ తక్షణావసరాలే తమవి కాని భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచనలేని మానవులు ఏదో ఒక సురుకు తగిలితేనే కాని మామూలుగా మేలుకోరు. అది ఎండ రూపంలో ప్రతి సంవత్సరం ఒక డిగ్రీ వేడి పెరుగుతోంటే ఇప్పుడు తెలిసొస్తోంది. అప్పుడప్పుడూ సడన్‌గా మేలుకొని ప్లాస్టిక్‌పై నిషేదమంటాడు. గోళంపై ఇంకో చోట యుద్ధాలు చేస్తుంటారు, అది కాలుష్యమని చెబుతూనే ఇంకొక వైపు ఆయుధాలు పంపిస్తుంటుంది ఒక దేశం. కర్బన ఉద్గారాలు అంటూ గోల పెడుతూ కింద నీళ్ళు తాగుతున్న మేకపిల్లదే తప్పని చెప్పిన తోడేలులా ప్రవర్తిస్తుంటారు. ఇదీ ఒక జీవ వైవిధ్యమేమోలే అనుకుంటూ కొందరు బుద్ధి జీవులు చూస్తూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు. ఆ నిశ్శబ్దమే తమ పైకి ఓ విస్ఫోటనంలా విరుచుకు పడుతుందని తెలియదు వాళ్ళకు.
అసలు జీవులన్నీ ఒకే విధంగా ఎందుకుండకూడదు, ఇన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎందుకుండాలి అని ప్రశ్నిస్తే చక్కటి సమాధానాలు దొరుకుతాయి. ఈ ప్రపంచంలో పొద్దున లేచినప్పటినుండి జీవులకు తిండి అవసరమని అందరికీ తెలుసు. ఆ తిండి సంపాదనలోనే ఇన్ని వైవిధ్యాలు ఏర్పడ్డాయని తెలుసుకోవాలి. ఈ వైవిధ్యాలను ఆధారం చేసుకొనే తమను తాము మార్చుకున్న జీవులు బతికి బట్ట కడుతుంటాయి. అలా జంతువులు తమ తెలివిని ఉపయోగించబట్టే మనగలుగుతున్నాయి. ఆ తెలివి మానవులకు ఇంకా ఎక్కువండోరు...!
జీవుల్లో బుద్ధి జీవులు వేరయా అనుకొని వారిని సినిమా, రాజకీయ, వ్యాపార ఇలా రకరకాలుగా చేసుకొని పరిశీలించాలి. అప్పుడు ఆ 'వైవిధ్యం', ఒకదానివెనుక ఒకటిగా ఉన్న అనుబంధం, సంబంధం మనకు అర్థమవుతాయి. అబ్బా ఈ సినిమా ఎంత వైవిధ్యంగా ఉంది, కొత్త పాయింటు భలే పట్టుకున్నాడు అని సినిమా చూసి బయటికొచ్చి అనుకుంటాము, తరువాత ఆ విషయం మరచిపోతాము కూడా. కొన్నిరోజులకు ఏదో పాత సినిమా చూస్తుంటాము, అందులోని కథని చూసి ఇదెక్కడో చూసినట్టుందే అనుకొని ఆశ్చర్యపోతాం, ఈ వైవిధ్యమంతా కాపీ అని, కొత్తవాడు కాపీ కొట్టాడని తెలుసుకొని మనమీద మనమే జాలిపడతాము. ఇంకోసారి పాయింటును పూర్తిగా వ్యతిరేకంగా చూపించి తమ తెలివిని ఉపయోగించి దాన్ని కూడా వైవిధ్యంగా చూపే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ సినిమా జీవులు. ఏదేమైనా సినిమా చూడకుండా జీవించలేని జనాలకు ఏదో ఒకటి చూపిస్తే చాలనుకొనే మనస్తత్వం ఉండబట్టి ఆ వైవిధ్య జీవులు మనగలుగుతున్నారని అర్థమైపోతుంది.
ఇక వ్యాపార జీవులైతే తమ వస్తువుల వైవిధ్యాన్ని ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటారు. ఫలానా సోపు వాడి వాడి బోరు కొట్టిన జనులకు దాని రూపు మార్చి, సైజు మార్చి ప్రకటనల్లో ఆ సోపును వాడే యాక్టరును మార్చి, నానా తంటాలు పడి మళ్ళీ అదే సోపును ఇంకొన్ని రోజులు వాడేలా చేస్తుంటారు. అలాగే ఆరోగ్య పానీయాలు, ఆరోగ్యాన్ని పాడు చేసే శీతల పానీయాల విషయంలో కూడా వైవిధ్యభరితమైన మార్పులను చేసినట్టుగా చూపించి తమ అమ్మకాలు ఆగకుండా చూసుకుంటారు. అదే వ్యాపార వైవిధ్యం. బట్టలు, కుక్కర్లు, వాహనాలు ఇలా ఒకటేమిటి అన్నింటిని కొద్దిగా మార్పులు చేస్తూ జీవిస్తారు, వైవిధ్యమంటే అది. డబ్బుతో వ్యాపారం చేసే బ్యాంకుల పరిస్థితి ఈమధ్య ఏమీ బాగోలేదు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు హాయిగా విదేశాల్లో ఉంటే, అవి ఇచ్చిన అధికారులపై వేధింపులు, ఆ సాకుతో బ్యాంకులను మూసివేస్తామనడం చూస్తాం. ఎగ్గొట్టిన అప్పులను మాఫీ చేయడమే కాదు వాటికి పనిచేయని ఆస్తులు అని మంచి పేరు పెట్టారు కూడా. ఇక 'పే' సంస్థలు కొన్ని వచ్చాయి. వాటి తాడు బొంగరం ఎక్కడుంటుందో కాని అవి ఒకరి అకౌంటు నుండి ఒకరికి సెకనులో డబ్బును బదిలీ చేస్తాయి. ఇవి ఎటువంటి వ్యాపార సంస్థలో ఏలినవారే సెలవివ్వాలి.
ఇక టీవీ ఆన్ చేస్తే మనకెన్ని అనుమానాలో వస్తాయి. వ్యాపారం, సినిమా వ్యాపారం, రాజకీయ వ్యాపారం ఇలా అన్నీ కలగలసిన వైవిధ్యం ఈ టీవీ చానల్సులో కనిపిస్తుంది. పైగా రేటింగులు, వాటికోసం మస్తు, యెగస్ట్రా మస్తు ఇలా రకరకాల పేర్లతో అస్లీలతను పెంచి పోషిస్తున్నారు. ఈ టీవీల్లో ఒకదాంట్లో చట్టానికి కళ్ళు లేవు అన్న సినిమా ఒక చానల్లో వస్తుంటే, అదే సమయానికి చట్టానికి వేయి కళ్ళు అని ఇంకొక సినిమా వేరేదాంట్లో వస్తుంది. తమాషా ఏమిటంటే వీటిల్లో వ్యాపార ప్రకటనలు మాత్రం ఒకే సమయంలో వస్తాయి. అదే వ్యాపార వైవిధ్యమంటే. వీటిల్లో కూడా రాజకీయాల్లో, సాఫ్టువేరు కంపెంనీల్లో మారినట్లు జనాలు మారుతూ ఉంటారు. ఒకదానినుండి ఒక దానిలోకి జంప్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కప్పలు తక్కువై పోయాయి కాని లేకుంటే ఇటువంటి వైవిధ్యమైన గంతులు చూసి అవీ తమ గంతులను మార్చుకునేవి.
ఈ భూమి మీద వాతావరణాన్ని బట్టి ఒక్కో చోట ఒక విధమైన జీవ వైవిధ్యం కనిపిస్తుంది. కాశ్మీరులో యాపిల్సు పండాయని మనదగ్గర ఆ చెట్లు వేస్తే వాటికి ఈ వాతావరణం సరిపడక నష్టమైపోతాము. మహారాష్ట్రకు చెందిన వారు అక్కడ నో అని, అస్సాంలో కొన్ని రోజులుంటే ఎస్ అనేంత వైవిధ్యంగా తయారవుతారు అన్న విషయం కూడా ఈ జీవ వైవిధ్యం కిందికి వస్తుందేమో అనిపించింది. ఈ రాజకీయ వైవిధ్యాలను, వైరుధ్యాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేటోళ్ళను భయపెట్టే వైవిధ్యం కూడా ఉంటుంది కొందరికి. మొత్తం మీద రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇప్పుడు ఒక వైవిధ్యభరితమైన దశలో ఉన్నాయన్న విషయం రోజూ తెలుస్తూనే ఉంది మనకు. అది ఇంకెన్ని రకాలుగా మారి మనల్ని అలరిస్తుందో వేచి చూడాలి మరి.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298