Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదక ద్రవ్యాల దురలవాటు అంతర్జాతీయ సమస్యగా రూపొందింది. దేశాల సరిహద్దులు దాటుతూ అక్రమ రవాణ చేసే స్మగ్లర్లు, తీవ్రవాద గుంపులు తమ అక్రమ సామ్రాజ్యాలను విస్తరించడం, సప్లయి చైన్‌ను ఏర్పాటు చేసుకోవడం యదేచ్ఛగా జరుగుతున్నది. 'ఐరాస ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్' వరల్డ్ రిపోర్ట్ - వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలను వాడుతున్నారని, వీరిలో 35మిలియన్లు మాదకద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధ పడుతున్నారని తెలుస్తున్నది. ఇండియాలో దాదాపు 14.6కోట్ల ప్రజలు ఆల్కహాల్ దురలవాట్లకు లోనైనారని, 3.1కోట్ల ప్రజలు కన్నాబిస్ డ్రగ్స్, దాదాపు 3కోట్లు ఓపియం, 8.5లక్షల మంది మాదకద్రవ్యాలను సూది మందు రూపంలో (ఐవి) వాడుతున్నారని తేలింది. ఇలాంటి సూది మందులను వాడటం వల్ల హెచ్ఐవి-ఏయిడ్స్ కూడా పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతున్నది. భారతదేశంలో మాదకద్రవ్యాల కేంద్రంగా సరిహద్దు రాష్ట్రం పంజాబ్ అగ్రభాగాన ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణ, వాడకం ఎక్కువగా కనిపిస్తున్నది. అస్సాం, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మిజోరాం, సిక్కిం, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల లభ్యత, వాడకం అధికంగా నమోదు అవుతున్నాయి. కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోంచి అక్రమ రవాణాకు తోడుగా కన్నాబిస్, హెరాయిన్, కొకేయిన్ లాంటి మాదకద్రవ్యాల ఉత్పత్తి కూడా జరుగుతున్నది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశ సరిహద్దుల గుండా డ్రగ్స్ దేశంలోకి అక్రమంగా చేరవేయడం జరుగుతున్నది.
మాదకద్రవ్యాలు లేదా డ్రగ్స్ దురలవాటుకు గురి అయిన వారు అనేక దుష్ప్రభావాలకు లోనవుతారు. మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ, చికాకు, సుఖభ్రాంతి, అతి చురుకుదనం, అతిగా కదలడం, మానవ సంబంధాలలో అసాధారణ ప్రవర్తన, ప్రేరణ కోల్పోవడం, బాధ్యతలను విస్మరించడం, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం, శారీరకంగా బలహీన పడటం, నిద్రలేమి, సోమరితనం, అనవసరంగా ఆవేశ పడటం, భయం లేకపోవడం, ఉద్రేక పడటం, మానసిక ప్రవర్తనలో సమూల మార్పులు, సమాజంలో చిన్నచూపునకు గురికావడం, వ్యక్తిత్వ వినాశనం లాంటి పలు అనర్థాలు జరుగుతాయి. మాదకద్రవ్యాల దురలవాటు దుష్పరిణామాల్లో మెదడు క్రియాశీలతలో మార్పులు, అనవసరంగా గాయాల పాలుకావడం, రోగనిరోధకశక్తి పడిపోవడం, హృదయనాళ సమస్యలు, వికారం, వాంతులు, కాలేయ హాని, కడుపు నొప్పి, స్ట్రోక్స్, హార్ట్ అటాక్, నిర్ణయ శక్తి నశించడం, శాశ్వతంగా మెదడు ప్రభావితం కావడం, భావోద్వేగాల అస్థిరత్వం లాంటి అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి మాదకద్రవ్యాల దురలవాటు ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత విస్మరించలేనిది. దేశ యువత మత్తులో తూలకుండా, బాధ్యతాయుత పౌరులుగా జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిద్దాం.
డా|| మధుసూదన్‌రెడ్డి, 9949700037